Child marriages : ఆగని బాల్య వివాహాలు
ABN , Publish Date - Apr 29 , 2025 | 11:00 PM
Child marriages :జిల్లాలో బాల్య వివాహాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంతంతో పాటు గిరిజన ప్రాంతాల్లో ఈ విష సంస్కృతి నడుస్తోంది.
- పెళ్లి పీటలెక్కుతున్న చిన్నారులు
- రాష్ట్రంలోనే మూడోస్థానంలో నిలిచిన జిల్లా
- చదువుకు దూరమవుతున్న వైనం
- జీవితాంతం వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు
- ఇచ్ఛాపురం మండలంలోని ఓ మారుమూల గ్రామంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థినికి వివాహం నిశ్చయమైంది. మంచి సంబంధమని భావించిన తల్లిదండ్రులు వివాహం జరిపించేందుకు సిద్ధపడ్డారు. కానీ అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో చైల్డ్‌లైన్ సిబ్బంది గ్రామానికి చేరుకొని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. దీంతో వారు వివాహాన్ని ఒక ఏడాది పాటు వాయిదా వేసుకున్నారు.
-ఒడిశా సరిహద్దు గ్రామంలో బాలికకు వివాహం చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధపడ్డారు. సమాచారం అందుకున్న చైల్డ్‌లైన్ సిబ్బంది గ్రామానికి వెళ్లారు. పూర్తిస్థాయి వివరాలు సేకరించారు. చిన్ననాడే పెళ్లితో అనర్ధాలున్నాయని.. జీవితాంతం అనారోగ్య సమస్యలు వెంటాడుతాయని చెప్పడంతో వారు వివాహ నిర్ణయాన్ని విరమించుకున్నారు.
ఇచ్ఛాపురం, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బాల్య వివాహాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంతంతో పాటు గిరిజన ప్రాంతాల్లో ఈ విష సంస్కృతి నడుస్తోంది. బడికెళ్లాల్సిన బాలికలు పెళ్లి పీటలెక్కుతున్నారు. తెలిసీ తెలియని వయసులో వారి మెడలో మూడు ముళ్లు పడుతున్నాయి. చదువు, ఆటపాటలతో హాయిగా గడపాల్సిన ఈడులో గర్భం దాల్చుతుండడంతో అనారోగ్య సమస్యలు జీవితాంతం వెంటాడుతున్నాయి. అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు, కట్టుబాట్లతో పెద్దలే చిన్నారులకు పెళ్లిచేసి అత్తారింటికి పంపుతున్నారు. అధికారులు అడ్డుకుంటున్నవి కొన్నే. కానీ అంతకు మించి బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పది, ఇంటర్ విద్యార్థినులను సైతం పెళ్లిపీటలు ఎక్కిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
మూడోస్థానంలో జిల్లా
బాల్య వివాహాల గణాంకాలు పరిశీలిస్తే జిల్లా ప్రమాదంలో ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో 45 శాతానికి మించి బాల్య వివాహాలు జరుగుతుండగా అందులో శ్రీకాకుళం జిల్లా మూడో స్థానంలో ఉంది. అందులో 15 నుంచి 18 ఏళ్లలోపు బాలికలు, యువతులు అమ్మలుగా మారుతున్నారు. బాల్యంలో తల్లులు కావడం వంటివి గతాని కంటే తగ్గాయి కానీ.. బాల్య వివాహాలు మాత్రం పెరుగుతున్నాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే స్పష్టం చేసింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ బాల్య వివాహాల ప్రభావం ఉంది. అయితే ప్రధానంగా జిల్లాలోని 11 తీర మండలాల్లో ఈ సామాజిక రక్కసి కొనసాగుతోంది. జీవనోపాధికిగాను ఎక్కువ మంది మత్స్యకారులు ఉపాధి బాట పడుతుంటారు. అటువంటి సమయంలో చిన్నారులకు తోడు, భద్రత ఉంటుందని బాల్యవివాహాలు జరిపిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి ఉంది. నిరక్షరాస్యతే ప్రధాన కారణం కాగా.. ఆర్థిక వెనుకబాటు దృష్ట్యా మంచి సంబంధాలు వస్తుండడంతో ఎక్కువ మంది బాలికలకు పెళ్లి చేస్తున్నారు. కుటుంబ పరిస్థితులు, సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలు వంటి ఘటనలు చూస్తున్న తల్లిదండ్రులు ఆడపిల్లలకు వివాహం జరిపిస్తే మేలన్న నిర్ణయానికి వస్తున్నారు.
ప్రాణాలకే ప్రమాదం..
బాల్య వివాహాలు ఎక్కువగా 12 నుంచి 17 సంవత్సరాల మధ్య జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆ వయసులో ఉండాల్సిన బరువు కంటే తక్కువగా ఉంటారు. తల్లిగా మారే సమయంలో బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) తగ్గడంతో వారి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో బిడ్డ గర్భంలో చనిపోవడం, వైకల్యంతో పుట్టడం, ఆరోగ్యకరమైన ఎదుగుదల లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కేంద్ర ప్రభుత్వం బాల్య వివాహాల నియంత్రణకు ప్రత్యేకంగా ‘బాల్ వివాహ్ ముక్తు భారత్’ కార్యక్రమాన్ని చేపట్టింది. బాల్య వివాహాలు జరిగినట్టు తెలిస్తే 1098, 181, 100 నంబర్లకు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చు. సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రానికి సమాచారం ఇవ్వొచ్చు. జిల్లా అధికారులు రంగంలోకి దిగి స్థానిక పోలీసుల సహకారంతో తల్లిదండ్రులకు అవగాహన కల్పించవచ్చు.
1098కు ఫిర్యాదు చేయవచ్చు..
ఏటా విద్యాసంవత్సరం ముగిసిన తరువాత వివాహాలు జరిపిస్తుంటారు. ఆ సమయంలో చడీచప్పుడు కాకుండా ముహూర్తాలు ఖరారు చేస్తున్నారు. రహస్యంగా కూడా వివాహాలు జరిపిస్తున్న వారు ఉన్నారు. అయితే తమ పిల్లల భవిష్యత్ బాగుంటుందని ఎక్కువ మంది తల్లిదండ్రులు బాల్య వివాహాల వైపు మొగ్గుచూపుతున్నారు. కానీ వారు రకరకాల రుగ్మతలకు గురవుతున్నారు. జీవితాంతం మూల్యం చెల్లిస్తున్నారు. ఇటీవల బాలికల్లో కొంత చైతన్యం వచ్చింది. చిన్ననాటే వివాహాలు చేసుకోవడానికి ఇష్టపడని వారు నేరుగా 1098 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తున్నారు. బాల్య వివాహాల సమాచారం ఇస్తున్నారు. ఈ విషయంలో చైల్డ్‌లైన్‌తో పాటు అన్ని శాఖలు అవగాహన పెంచితే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
ఫిర్యాదుచేయాలి
బాల్య వివాహాలు అత్యంత ప్రమాదకరం. బాధ్యత తీరిపోతుందని బాల్య వివాహాలు చేస్తే జీవితాంతం పిల్లలకు సమస్యలు వెంటాడుతాయి. అందుకే ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండకపోతే వారి పిల్లల భవిష్యత్‌కే ముప్పు ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే వెంటనే 1098కు ఫోన్ చేసి సమాచారం అందించాలి. ఇదో సామాజిక బాధ్యతగా చూడాలి.
- కేవీ రమణ, జిల్లా బాలల రక్షణ అధికారి, శ్రీకాకుళం
ప్రమాదకరం..
బాల్య వివాహాలు చేయడం వల్ల ప్రసవ సమయంలో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. తల్లితో పాటు పుట్టిన బిడ్డకు ప్రమాదమే. సంతానోత్పత్తి సమయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. పుట్టిన పిల్లలతో పాటు తల్లికి తీవ్ర అనారోగ్యం తప్పదు. చిన్న వయసులోనే పెళ్లిళ్లతో అనేక రుగ్మతలు ఎదురుకాక తప్పదు. గైనిక్ సమస్యలతో ఆస్పత్రులకు వస్తున్న వారిలో బాల్య వివాహ బాధితులే అధికం. ఈ విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
- డాక్టర్ పాతిర్ల దేవేంద్రరెడ్డి.. సీహెచ్‌సీ సూపరింటెండెంట్, ఇచ్ఛాపురం