Share News

రేషన్‌ అక్రమ రవాణాకు చెక్‌!

ABN , Publish Date - Oct 25 , 2025 | 12:08 AM

Chemical kits for rice testing రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్న నేపథ్యంలో అక్రమ రవాణాకు చెక్‌పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అధికారుల తనిఖీల్లో పట్టుబడిన బియ్యం ప్రజాపంపిణీ వ్యవస్థకు సంబంధించినవా? కావా? అన్నది క్షణాల్లో తేలిపోనుంది. ఈ మేరకు ప్రభుత్వం పౌరసరఫరాలశాఖ అధికారులకు రసాయనాలతో కూడిన కిట్లు అందజేయనుంది.

రేషన్‌ అక్రమ రవాణాకు చెక్‌!
పౌరసరఫరాలశాఖ డీటీలకు అందించిన రసాయన కిట్లు

బియ్యం నిర్ధారణకు రసాయన కిట్లు

సివిల్‌ సప్లయ్‌ డీటీలకు పంపిణీ

ఎరుపు రంగులోకి మారితే అక్రమమే

వెంటనే కేసు నమోదుకు చర్యలు

ఇచ్ఛాపురం, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్న నేపథ్యంలో అక్రమ రవాణాకు చెక్‌పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అధికారుల తనిఖీల్లో పట్టుబడిన బియ్యం ప్రజాపంపిణీ వ్యవస్థకు సంబంధించినవా? కావా? అన్నది క్షణాల్లో తేలిపోనుంది. ఈ మేరకు ప్రభుత్వం పౌరసరఫరాలశాఖ అధికారులకు రసాయనాలతో కూడిన కిట్లు అందజేయనుంది. ఇకపై బియ్యం ఎక్కడ దొరికితే అక్కడే పరీక్ష చేసి.. అక్రమమని తేలితే అధికారులు కేసులు నమోదు చేయనున్నారు. జిల్లాలో 1603 రేషన్‌డిపోలు ఉన్నాయి. 6,60,739 రేషన్‌కార్డులు, 24లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. రేషన్‌ పంపిణీలో భాగంగా డీలర్లు ప్రతినెలా 8,935 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని అందిస్తున్నారు. పోషక విలువలు ఉన్న ఈ బియ్యాన్ని అవగాహన లేక ఎక్కువమంది వినియోగించడం లేదు. 60శాతం మంది విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కార్డుదారుల నుంచి కిలోబియ్యం రూ.18 వరకూ దళారులు కొనుగోలు చేస్తున్నారు. మిల్లర్లతో ఒప్పందం చేసుకొని వారికి విక్రయిస్తున్నారు. మిల్లర్లు రీపాలిష్‌ చేసి వేర్వేరు బ్రాండ్లకు చెందిన బ్యాగుల్లో బియ్యాన్ని నింపి అధిక ధరకు అమ్ముకుంటున్నారు. విజయనగరం, విశాఖ, ఒడిశా ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలోని గత ఏడాది కాలంలో అక్రమంగా తరలించే 55 టన్నుల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తనిఖీలు చేస్తున్నా.. బియ్యం అక్రమ రవాణా ఆగడం లేదు. ఈ నేపథ్యంలో ఇటువంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావించి.. బియ్యం నిర్ధారణకు రసాయణ కిట్లు అందజేయనుంది. జిల్లాలో 15మంది సివిల్‌ సప్లయ్‌ డీటీలు, యూడీఆర్‌ఐలకు 4, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బందికి రెండు రసాయన కిట్లు అందిస్తారు. మరో కిట్‌ను జిల్లాకేంద్రంలో అందుబాటులో ఉంచుతారు. ఆయా కిట్లలో ఉన్న రెండు రకాల రసాయనాలను వినియోగించి బియ్యాన్ని పరీక్షిస్తారు. అవి ఎరుపు రంగులో మారితే రేషన్‌ బియ్యంగా నిర్ధారిస్తారు. ఆరు నెలల ముందు పంపిణీ చేసినవైనా, రీపాలిష్‌ చేసినా ఇట్టే గుర్తిస్తాయి ఈ రసాయనాలు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణా నిర్ధారణ అయితే.. వెంటనే అధికారులు కేసులు నమోదుకు చర్యలు చేపట్టనున్నారు.

కిట్లు అందించాం..

జిల్లాలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణా నియంత్రించేలా దృష్టి పెట్టాం. తనిఖీల సమయంలోనే బియ్యం అక్రమమని నిర్ధారించేందుకు రసాయన కిట్లు వచ్చాయి. పౌరసరఫరాలశాఖ తహసీల్దార్లతో పాటు ఆర్‌ఐలకు అందించాం. వారు తనిఖీలు చేపట్టి బియ్యం పరీక్షలు చేసి నిర్ధారిస్తారు.

- సూర్యప్రకాశరావు, డీఎస్‌వో, శ్రీకాకుళం

Updated Date - Oct 25 , 2025 | 12:08 AM