chit fund fraud : చిట్‌ఫండ్ మోసానికి చెక్
ABN , Publish Date - Sep 12 , 2025 | 11:28 PM
Confiscation of the accused's assets జిల్లాలో ఐదేళ్ల కిందట భారీ చిట్‌ఫండ్ మోసం వెలుగులోకి వచ్చింది. రణస్థలం మండలం పైడిభీమవరం గ్రామానికి చెందిన లింగం నీలవేణి చిట్‌ఫండ్స్ పేరుతో వందలాది మంది నుంచి డిపాజిటర్లను మోసం చేసి రూ.కోట్లు దోచుకుందని అప్పటి పోలీసుల దర్యాప్తులో తేలింది.
నిందితురాలి ఆస్తుల జప్తు
ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
సీఐడీ విచారణ నివేదిక ఆధారంగా చర్యలు
శ్రీకాకుళం, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఐదేళ్ల కిందట భారీ చిట్‌ఫండ్ మోసం వెలుగులోకి వచ్చింది. రణస్థలం మండలం పైడిభీమవరం గ్రామానికి చెందిన లింగం నీలవేణి చిట్‌ఫండ్స్ పేరుతో వందలాది మంది నుంచి డిపాజిటర్లను మోసం చేసి రూ.కోట్లు దోచుకుందని అప్పటి పోలీసుల దర్యాప్తులో తేలింది. డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడటానికి ఆమె సొంతం చేసుకున్న స్థిరాస్తులను ప్రభుత్వం జప్తు చేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. కొన్నేళ్ల కిందట సీతారామయ్య భార్య లింగం నీలవేణి(37).. రణస్థలం మండలం పైడిభీమరంలో అక్రమంగా ప్రైవేట్ చిట్‌ఫండ్ వ్యాపారం చేసింది. ఏజెంట్ల ద్వారా 276 మంది డిపాజిటర్ల నుంచి చందాలు, డిపాజిట్లు సేకరించింది. మూలధనం, ఆశించిన లాభాలు తిరిగి కస్టమర్లకు చెల్లించలేదు. దీనిపై 2020 నవంబరులో పైడిభీమవరం గ్రామానికి చెందిన సగరం నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఆర్ పురం పోలీసు స్టేషన్‌లో క్రైం నంబర్ 711/2020 కింద 406, 420 ఐపీసీ, చిట్‌ఫండ చట్టం 76వ సెక్షన్, ఏపీపీడీఎఫ్‌ఈ చట్టం 5వ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మొత్తం ఆమె రూ.3.45 కోట్లు సొంతం చేసుకుందని పోలీసు దర్యాప్తులో బయటపడింది. తరువాత ఈ కేసు సీఐడీకి బదిలీ అయింది. విచారణలో డిపాజిటర్ల డబ్బుతో నీలవేణి అనేక స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు రుజువైంది. విజయనగరం జిల్లా డెంకాడ మండలం పెద్దతాడివాడలో 214 చదరపు గజాల ప్లాట్, అదే ప్రాంగణంలో నిర్మించిన ‘మహాలక్ష్మి టవర్స్’లో 35.66 చదరపు గజాల విస్తీర్ణం గల ప్లాట్లు, శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సీతంవలసలో 183.26 చదరపు గజాల ఖాళీస్థలం... ఇవన్నీ పలువురి పేర్లతో ఆమె కొనుగోలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
తాత్కాలిక జప్తు ఆదేశాలు..
సీఐడీ ఇచ్చిన నివేదిక ఆధారంగా.. నిందితురాలి ఆస్తులను విక్రయించే అవకాశం ఉందని ప్రభుత్వం గుర్తించింది. అందుకే హోంశాఖ జీవో ఎంఎస్ 133 ద్వారా తాత్కాలిక జప్తు ఆదేశాలు జారీచేసింది. అలాగే సీఐడీ డైరక్టర్ జనరల్‌ను కంపీటెంట్ అథారిటీగా నియమించింది. ఆస్తులను కోర్టు ఆదేశాల ప్రకారం పూర్తిగా జప్తుచేసేందుకు సీఐడీకి అధికారాలు ఇచ్చింది. అనంతరం న్యాయపరమైన ప్రక్రియను పూర్తిచేయాలని సూచించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో డిపాజిటర్లకు కొంత భరోసా లభించింది. నిందితురాలు సొంతం చేసుకున్న ఆస్తులను జప్తు చేసి వాటిని బాధితుల నష్టపరిహారానికి ఉపయోగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇదో పెద్ద హెచ్చరిక ..
చిన్న గ్రామాల వరకు విస్తరిస్తున్న చిట్‌ఫండ్ మోసాలు ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన మళ్లీ నిరూపించింది. న్యాయపరమైన చర్యలు వేగంగా జరిగితే మోసపోయినవారు తమ డబ్బును తిరిగి పొందే అవకాశాలు పెరుగుతాయి. ప్రజలు కూడా ఇలాంటి అనుమానాస్పద పథకాలలో డబ్బు పెట్టే ముందు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేదా అన్నది పరిశీలించాలి. ‘డిపాజిటర్ల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చిట్‌ఫండ్ మోసాలకు పెద్ద హెచ్చరిక అవుతుంది’ అని సీఐడీ అధికారులు తెలిపారు.