Share News

అక్కడ చవక.. ఇక్కడ ప్రియం

ABN , Publish Date - Sep 23 , 2025 | 12:02 AM

onions Prices are increasing ఉల్లి, టమాటా ధరలు హడలెత్తిస్తున్నాయి. సామాన్యులు కొనడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటోంది. ఉల్లి పండించే కర్నూలు, శంకరాపల్లె, సదాశివునిపేట తదితర రాయలసీమ ప్రాంతాల్లో కిలో 50పైసల వంతున లభిస్తుంటే... మన జిల్లా కేంద్రంలోని శ్రీకాకుళం రైతుబజారులో రూ.17, మిగిలిన ప్రాంతాల్లో రూ.20 నుంచి రూ.25 మధ్య వ్యాపారులు విక్రయిస్తున్నారు.

అక్కడ చవక.. ఇక్కడ ప్రియం

రాయలసీమలో కిలో ఉల్లి 50పైసలే..

జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ధరలు

టెక్కలి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఉల్లి, టమాటా ధరలు హడలెత్తిస్తున్నాయి. సామాన్యులు కొనడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటోంది. ఉల్లి పండించే కర్నూలు, శంకరాపల్లె, సదాశివునిపేట తదితర రాయలసీమ ప్రాంతాల్లో కిలో 50పైసల వంతున లభిస్తుంటే... మన జిల్లా కేంద్రంలోని శ్రీకాకుళం రైతుబజారులో రూ.17, మిగిలిన ప్రాంతాల్లో రూ.20 నుంచి రూ.25 మధ్య వ్యాపారులు విక్రయిస్తున్నారు. ఏటా ఏప్రిల్‌ నుంచి గోల్టీ, గోల్టా, బళ్లారి రకాల ఉల్లి జిల్లాకు వస్తోంది. జనవరి నుంచి మార్చి వరకు మహారాష్ట్ర నుంచి వస్తుంది. జిల్లాలో రోజుకు పది లారీల్లో సుమారు 300 టన్నుల ఉల్లి కర్నూలు ప్రాంతం నుంచి వస్తోంది. ఇది ఎక్కువగా గృహ అవసరాలు, హోటళ్లు, దాబాలు, వసతిగృహాలకు సరఫరా అవుతోంది. జంటపాయి, పేడు ఉల్లి, గోల్టా, గోల్టీ, బళ్లారి, ఇండియా బళ్లారి రకాల ఉల్లిని జిల్లాలో వినియోగిస్తున్నారు. కర్నూలు మార్కెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా రైతుల నుంచి ఇటీవల 60,570 క్వింటాళ్ల ఉల్లిని సేకరించింది. అందులో 3,707 టన్నులను వివిధ జిల్లాల్లో రైతుబజార్లకు పంపిణీ చేశారు. ఒక్క కర్నూలు మార్కెట్‌లోనే 2,350 టన్నుల ఉల్లి బస్తాలు కుప్పలుగా పడి ఉన్నాయి. కానీ ఇక్కడ పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం. ధర అధికంగా ఉంటోంది.

టమాటా ధరలూ అంతే...

ఉల్లితో పాటు టమాటా ధరలూ పైపైకి చేరుకుంటున్నాయి. కిలో టమాటా హోల్‌సేల్‌లో రూ.25, రిటైల్‌లో రూ.30చొప్పున వ్యాపారులు విక్రయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చిరు వ్యాపారులు కిలో టమాటా రూ.40నుంచి రూ.50కి విక్రయిస్తున్నారు. మదనపల్లె, గుర్రంకొండ, కర్ణాటకలోని కోలార్‌ ప్రాంతం నుంచి జిల్లాకు రోజు పది వ్యాన్ల ద్వారా టమాటా చేరుతుంది. గృహ అవసరాలు, హోటళ్లు, దాబాలు, వసతిగృహాల్లో టమాటా వినియోగం ఎక్కువగా ఉండడంతో వీటి ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

Updated Date - Sep 23 , 2025 | 12:02 AM