Share News

విద్యతోనే సమాజంలో మార్పు

ABN , Publish Date - Dec 06 , 2025 | 12:05 AM

parents- teachers meeting ‘విద్య ద్వారా సమాజంలో మార్పు వస్తుంది. జిల్లా నుంచి వలసల నివారణలో భాగంగా అక్షరాస్యత శాతం పెంచే దిశగా చర్యలు చేపడుతున్నామ’ని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. టెక్కలిలోని జిల్లాపరిషత్‌ బాలికల హైస్కూల్‌ ప్లస్‌లో శుక్రవారం మెగా పేరెంట్స్‌ - టీచర్స్‌ సమావేశం (పీటీఎం) పండుగ వాతావరణంలో జరిగింది.

విద్యతోనే సమాజంలో మార్పు
టెక్కలి: పాఠశాలలో భోజనం చేస్తూ విద్యార్థిని పేడాడ మోక్షతో మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు, పక్కన కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

ఘనంగా మెగా పేరెంట్స్‌ - టీచర్స్‌ మీటింగ్‌

టెక్కలిలో విద్యార్థులతో కలిసి మంత్రి, కలెక్టర్‌ సహపంక్తి భోజనం

టెక్కలి, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): ‘విద్య ద్వారా సమాజంలో మార్పు వస్తుంది. జిల్లా నుంచి వలసల నివారణలో భాగంగా అక్షరాస్యత శాతం పెంచే దిశగా చర్యలు చేపడుతున్నామ’ని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. టెక్కలిలోని జిల్లాపరిషత్‌ బాలికల హైస్కూల్‌ ప్లస్‌లో శుక్రవారం మెగా పేరెంట్స్‌ - టీచర్స్‌ సమావేశం (పీటీఎం) పండుగ వాతావరణంలో జరిగింది. మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు తదితరులు విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి సుమారు మూడు గంటలు గడిపారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ‘ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. విద్యార్థులు ఉన్నతి కోసమే ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్‌-టీచర్స్‌ సమావేశం ఏర్పాటు చేసింది. టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. నాడు ఎన్టీ రామారావు రెసిడెన్షియల్‌ స్కూల్‌ వ్యవస్థను తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి గ్రామానికి ఒక పాఠశాల, మూడు కిలోమీటర్లకు ఒక యూపీ స్కూల్‌, ఐదు కిలోమీటర్లకు ఒక హైస్కూల్‌, రెవెన్యూ డివిజన్‌కు ఇంజనీరింగ్‌ కళాశాల, జిల్లా కేంద్రానికి వైద్య కళాశాల తెచ్చారు. యువ నాయకుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డీఎస్సీ నియామకం చేపట్టారు. డీఎస్సీ అంటే టీడీపీ.. టీడీపీ అంటే డీఎస్సీ అని రుజువు చేశార’ని తెలిపారు. విద్యను రాజకీయాలతో ముడిపెట్టకూడదన్నారు. గతంలో జగన్‌రెడ్డి ఏ పథకం ప్రవేశ పెట్టినా ఒకటే పేరుతో పిలవబడేదని ఎద్దేవా చేశారు. ‘టెక్కలిలో ఈ పాఠశాలను రాష్ట్రంలో ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి. పాఠశాలకు అవసరమయ్యే మరుగుదొడ్లు, మైదానం, అదనపు తరగతి గదులు, వంట కార్మికులకు షెడ్లు, నీడలో కూర్చొని తినే సౌకర్యం కల్పిద్దామ’ని మంత్రి అచ్చెన్న తెలిపారు. అంతకుముందు విద్యార్థులు రూపొందించిన పలు వైజ్ఞానిక ప్రదర్శనలను తిలకించారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉన్నతాధికారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ బగాది శేషగిరి, ఏపీసీ పప్పల వేణుగోపాలరావు, ఉపవిద్యాశాఖాధికారి విలియమ్స్‌, ఎంఈవోలు తులసీరావు, చిన్నారావు, ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు ఈశ్వరమ్మ, హనుమంతు రామకృష్ణ, మామిడి రాము, సుందరమ్మ, లవ, కామేసు, ప్రసాద్‌రెడ్డి, మెండ దమయంతి, ఉపాధ్యాయులు వాణిశ్రీ ఉన్నారు.

విద్యార్థినులతో ముచ్చట్లు

సహపంక్తి భోజన సమయంలో మంత్రి అచ్చెన్న పేడాడ మోక్ష అనే విద్యార్థినితో కాసేపు ముచ్చటించారు. ఎన్నో తరగతి చదువుతున్నావని, ఎక్కడి నుంచి వస్తున్నావని, తల్లిదండ్రులు ఏమి చేస్తుంటారని మంత్రి కుశలు ప్రశ్నలు వేశారు. తాను ఆరో తరగతి చదువుతున్నానని, సంతబొమ్మాళి మండలం ఇజ్జువరం నుంచి వస్తున్నానని, తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేస్తుంటారని బాలిక మోక్ష తెలిపింది. బాగా చదువుకుని.. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని మంత్రి అచ్చెన్న సూచించారు.

మరో బాలిక కల్నిక పరీక్‌తో కూడా మంత్రి అచ్చెన్న, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడారు. బాలిక వివరాలు ఆరా తీశారు. ‘నేను పదో తరగతి చదువుతున్నాను. మాది రాజస్థాన్‌. మా తల్లిదండ్రులు ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. నాన్న ఓ మిఠాయి దుకాణంలో పనిచేస్తున్నారు’ అని బాలిక కల్నిక పరీక్‌ తెలిపింది. రాజస్థాన్‌ నుంచి వచ్చి ఇక్కడ చదువుతున్నావు. నీకు ఇక్కడ చదువు అర్థమవుతుందా? అని కలెక్టర్‌ అడగ్గా.. తెలుగు చక్కగా అర్ధమవుతోందని బాలిక వివరించింది. బాగా చదువుకో.. మంచిపేరు తెచ్చుకో అని కలెక్టర్‌ సూచించగా.. ‘ధన్యవాద్‌ జీ’ అని బాలిక తెలిపింది.

Updated Date - Dec 06 , 2025 | 12:05 AM