Cameras secreat: బాత్‌రూమ్‌లో సెల్‌ఫోన్ కెమెరా
ABN , Publish Date - May 29 , 2025 | 12:08 AM
Hidden Camera పొందూరు రెవెన్యూ కార్యాలయంలో ఏళ్ల తరబడి సాగుతున్న ఓ కంప్యూటర్ ఆపరేటర్ బాగోతం బట్టబయలైంది. బాత్‌రూమ్‌లో మహిళా ఉద్యోగుల వీడియోలను చిత్రీకరిస్తున్నట్టు ఓ ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని లీలలు వెలుగుచూశాయి.
మహిళా ఉద్యోగుల వీడియోలు చిత్రీకరణ
రెవెన్యూ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ లీలలు
ఉద్యోగిని ఫిర్యాదుతో పోలీస్‌స్టేషన్‌లో కేసు న మోదు
కలెక్టర్ కార్యాలయానికి సరెండర్
పొందూరు, మే 28(ఆంధ్రజ్యోతి): పొందూరు రెవెన్యూ కార్యాలయంలో ఏళ్ల తరబడి సాగుతున్న ఓ కంప్యూటర్ ఆపరేటర్ బాగోతం బట్టబయలైంది. బాత్‌రూమ్‌లో మహిళా ఉద్యోగుల వీడియోలను చిత్రీకరిస్తున్నట్టు ఓ ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని లీలలు వెలుగుచూశాయి. ఈ మేరకు కేసు నమోదు కాగా.. ఆ ఆపరేటర్‌ను కలెక్టర్ కార్యాలయానికి తహసీల్దార్ సరెండర్ చేశారు. వివరాల్లోకి వెళితే.. పొందూరు మండలంలోని ఒక మహిళా వీఆర్వో మ్యుటేషన్ ఫైల్ పట్టుకుని బుధవారం పొందూరు రెవెన్యూ కార్యాలయానికి వచ్చారు. కొద్దిసేపటి తర్వాత ఆమె కార్యాలయంలోని బాత్‌రూమ్‌కు వెళ్లగా.. పక్కనున్న పురుషుల బాత్‌రూమ్ నుంచి సెల్‌ఫోన్‌లో ఎవరో వీడియో చిత్రీకరిస్తున్నట్టు గుర్తించారు. ఆ ఫోన్ కంప్యూటర్ ఆపరేటర్ సువ్వారి సన్యాసిరావుదిగా గుర్తించి.. వెంటనే తహసీల్దార్ వెంకటేష్‌కు ఫిర్యాదు చేశారు. ఆ వీడియోను డిలీట్ చేయించారు. దీనిపై సన్యాసిరావును పిలిచి తహసీల్దార్ విచారించగా మౌనం దాల్చాడు. వెంటనే ఆ మహిళా వీఆర్వో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసి కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సన్యాసిరావును కలెక్టర్ కార్యాలయానికి సరెండర్ చేశారు. కంప్యూటర్ ఆపరేటర్ సన్యాసిరావు బాగోతం వెలుగు చూడడంతో మరికొంతమంది మహిళా ఉద్యోగులు తమకు గతంలో జరిగిన ఘటనలపై తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. నాలుగేళ్లుగా ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నాడని.. ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నాడని వాపోయారు. సన్యాసిరావుపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మండలంలో ప్రభుత్వ భూములకు తప్పుడు పొజిషన్ ధ్రువపత్రాలు ఇవ్వడంతో కోర్టు కేసులు నడుస్తున్నాయి. సన్యాసి రావుపై కఠినచర్యలు తీసుకోవాలని మహిళా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.