Ceiling blown : తప్పిన ముప్పు
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:04 AM
Quality deficiencies revealed in the work మూడేళ్ల కిందట వైసీపీ ప్రభుత్వ హయాంలో పాఠశాలల్లో చేపట్టిన ‘నాడు-నేడు’ పనుల్లో నాణ్యతలోపం తాజాగా బయటపడింది. సోమవారం ఉదయం మాకివలస ప్రాథమిక పాఠశాలలో ఒక తరగతి గది సీలింగ్ ఊడి పడిపోయింది.
మాకివలస ప్రాథమిక పాఠశాలలో ఊడిన సీలింగ్
‘నాడు-నేడు’ పనుల్లో బయటపడిన నాణ్యతాలోపం
నరసన్నపేట, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): మూడేళ్ల కిందట వైసీపీ ప్రభుత్వ హయాంలో పాఠశాలల్లో చేపట్టిన ‘నాడు-నేడు’ పనుల్లో నాణ్యతలోపం తాజాగా బయటపడింది. సోమవారం ఉదయం మాకివలస ప్రాథమిక పాఠశాలలో ఒక తరగతి గది సీలింగ్ ఊడి పడిపోయింది. ఉదయం 8 గంటలకు పాఠశాలను శుభ్రం చేసేందుకు ఆయా తలుపుతీయగా ఒక గదిలో బెంచీలపై సీలింగ్ పడిపోయింది. మళ్లీ 8.30గంటల సమయంలో మిగతా సీలింగ్ కూలిపోయింది. ఈ పాఠశాలలో 42 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. సీలింగ్ పడిన గదిలో ఒకటి, రెండో తరగతులు నిర్వహిస్తారు. విద్యార్థులు లేని సమయంలో సీలింగ్ పడిపోవడంతో పెనుప్రమాదం తప్పిందని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఎంఈవో పేడాడ దాలినాయుడు పాఠశాలను పరిశీలించి ఘటనపై ఆరా తీశారు. ఇటీవల వర్షాలకు భవనం నుంచి నీరుకారి సీలింగ్ తడిచి కూలిపోయిందని నిర్ధారించారు. ఈ విషయంపై ఇంజనీరింగ్ అధికారులు ఫిర్యాదు చేయనున్నట్లు ఎంఈవో దాలినాయుడు తెలిపారు.