Share News

CCTV Surveillance: ఆలయాల్లో సీసీ నిఘా

ABN , Publish Date - Jul 29 , 2025 | 12:12 AM

temple security జిల్లాలోని ఆలయాల్లో తరచూ చోరీలు, విధ్వంసకర ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల నేరాలు, మత విధ్వేషాలు, వర్గ వైషమ్యాలు పెరుగుతున్నాయి. భావవ్యక్తీకరణ పేరుతో రెచ్చగొట్టడాలు జరుగుతున్నాయి. మరోవైపు గంజాయి, మద్యం మత్తులో ఆకతాయిల చర్యలు కూడా పెరుగుతున్నాయి. విగ్రహాల ధ్వంసం, దాడులు వంటివి జరుగుతున్నాయి. వీటిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది.

CCTV Surveillance: ఆలయాల్లో సీసీ నిఘా
డీఆర్‌ వలసలో ఆలయాన్ని పరిశీలిస్తున్న జేఆర్‌పురం సీఐ అవతారం(ఫైల్‌)

  • ప్రతి గుడిలోనూ కెమెరాల ఏర్పాటు

  • పోలీస్‌శాఖకు పూర్తి వివరాలు

  • నేర నియంత్రణే ముఖ్య ఉద్దేశం

  • బంగారు, వెండి ఆభరణాలకు బీమా

  • దేవదాయశాఖకు ప్రభుత్వ ఆదేశాలు

  • రణస్థలం, జూలై 28(ఆంధ్రజ్యోతి):

  • ఈ నెల 11న జి.సిగడాం మండలం డీఆర్‌ వలస గ్రామంలోని శివాలయంలో విగ్రహాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు దర్యాప్తు చేసి గ్రామానికి చెందిన వేమల రామకృష్ణ మద్యం మత్తులో ఈ ఘటనకు పాల్పడినట్టు గుర్తించారు.

  • ఈ ఏడాది మే 21న ఎచ్చెర్ల మండలం ముద్దాడలోని అసిరిపోలమ్మ ఆలయంలో చోరీ జరిగింది. తులం బంగారం, అరతులం వెండితో పాటు హుండీలోని రూ.15వేల నగదును దొంగలు ఎత్తుకుపోయారు. గ్రామానికి దూరంగా ఆలయం ఉండడం, సీసీ కెమెరాలు లేకపోవడంతో కేసును చేధించడంలో పోలీసులకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

  • ఈ ఏడాది మార్చి 4న పలాసలోని సూదికొండ కాలనీలోని కొండమ్మతల్లి గ్రామదేవత ఆలయంలో చోరీ జరిగింది. పట్టపగలే దొంగలు హుండీని పగులగొట్టి రూ.10వేల వరకూ నగదును పట్టుకుపోయారు. ఆ సమయంలో గుడిలో సీసీ కెమెరాలు లేవు.

  • ..ఇలా జిల్లాలోని ఆలయాల్లో తరచూ చోరీలు, విధ్వంసకర ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల నేరాలు, మత విధ్వేషాలు, వర్గ వైషమ్యాలు పెరుగుతున్నాయి. భావవ్యక్తీకరణ పేరుతో రెచ్చగొట్టడాలు జరుగుతున్నాయి. మరోవైపు గంజాయి, మద్యం మత్తులో ఆకతాయిల చర్యలు కూడా పెరుగుతున్నాయి. విగ్రహాల ధ్వంసం, దాడులు వంటివి జరుగుతున్నాయి. వీటిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఆలయాల భద్రతకు పెద్దపీట వేస్తూ.. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీసు శాఖకు ఆదేశించింది. దేవదాయశాఖ పరిధిలోని ఆలయాలే కాకుండా.. చిన్నచిన్న ఆలయాల్లో సైతం ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎస్పీ మహేశ్వరరెడ్డి చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని ప్రతీ గ్రామంలో ఆలయాలు, ఆలయ కమిటీ సభ్యుల వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. చోరీల నియంత్రణ, కేసులు త్వరితగతిన ఛేదించడానికి సీసీ కెమెరాలు దోహదపడతాయని భావిస్తున్నారు.

  • అన్ని ఆలయాలకూ..

  • జిల్లాలో దేవదాయశాఖ పరిధిలో 749 దేవాలయాలు ఉన్నాయి. గ్రామస్థులు, ఆలయ కమిటీలతో నడిచేవి మరో 2 వేల వరకూ ఉంటాయి. సాధారణంగా శివాలయాలతోపాటు గ్రామదేవత ఆలయాలు దేవదాయ శాఖ పరిధిలోకి రావు. వాటిని గ్రామస్థులే నిర్వహిస్తుంటారు. కాగా లక్షలాది రూపాయలతో నిర్మిస్తున్న ఆలయాలకు భద్రత కరువవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అటువంటి ఆలయాల్లో పోలీసుశాఖ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనుంది. ఒక్కో సీసీ కెమెరా ఏర్పాటుకు సుమారు రూ.30వేల నుంచి రూ.40 వేలు ఖర్చుకానుంది. ప్రస్తుతం దేవదాయశాఖ పరిధిలోని అన్ని ఆలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తయింది. మిగతా గ్రామాలు, గ్రామ కమిటీల ఆధీనంలో ఉన్న ఆలయాలకు సంబంధించి నిర్వాహకులతో చర్చించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.

  • ఆభరణాలకు బీమా..

  • జిల్లాలో అరసవల్లిలో శ్రీసూర్యనారాయణ క్షేత్రం, శ్రీకూర్మం, శీమ్రుఖలింగం, టెక్కలి ఎండల మల్లికార్జునస్వామి ఆలయం, పాతపట్నం నీలమణి దుర్గమ్మ, కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి, ఇచ్ఛాపురం తులసమ్మ, శ్రీకాకుళంలో ఉమారుద్ర కోటేశ్వరాలయం, కమ్మసిగడాంలో మహాలక్ష్మి అమ్మ వంటి ఆలయాల్లో విలువైన బంగారం, వెండి ఆభరణాలు ఉన్నాయి. ప్రభుత్వం తాజాగా ఈ వస్తువులకు బీమా చేయాలని దేవదాయశాఖ అధికారులకు ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. దొంగతనాలు, ఇతరత్రా మార్గాల్లో నష్టం జరిగితే బీమా కొంతవరకూ అండగా నిలిచే అవకాశం ఉంటుంది.

  • నిఘా పెట్టాం..

  • ఎస్పీ ఆదేశాల మేరకు ఆలయాల్లో చోరీల నియంత్రణపై ప్రత్యేక దృష్టిపెట్టాం. ఇప్పటికే అన్ని ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాం. ఆలయ కమిటీలు, గ్రామపెద్దలతో సమావేశాలు ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు అందించాం. అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే 100కు ఫోన్‌ చేయాలని ప్రజలకు సూచించాం. - సీఐ ఎం.అవతారం, జేఆర్‌ పురం సర్కిల్‌

  • ప్రత్యేక దృష్టి

  • జిల్లావ్యాప్తంగా ఆలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. అక్కడ దొంగతనాల నియంత్రణతో పాటు విగ్రహాల ధ్వంసం, విద్రోహక చర్యలు జరగకుండా అడ్డుకట్ట వేస్తాం. అందుకే అన్ని ఆలయాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుకు నిర్ణయించాం. ఈ విషయంలో ఆలయ కమిటీలు, నిర్వాహకులు సహకరించాలి. కచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.

    - డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద, శ్రీకాకుళం

Updated Date - Jul 29 , 2025 | 12:12 AM