Share News

Cashew industries : జీడి పరిశ్రమలు మూత

ABN , Publish Date - Jun 07 , 2025 | 11:46 PM

Labor impact Industrial shutdown జీడి రైతులు, కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జీడి పరిశ్రమలు తాత్కాలికంగా మూత పడడంతో కార్మికులకు ఉపాధి కరువైంది. మరోవైపు జీడిపిక్కల ధరలు తగ్గుముఖం పట్టడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Cashew industries : జీడి పరిశ్రమలు మూత
జీడిపరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు (ఫైల్‌)

  • కార్మికులకు తప్పని ఇబ్బందులు

  • మరోవైపు పిక్కల ధర తగ్గుముఖం

  • ఆందోళన చెందుతున్న రైతులు

  • వజ్రపుకొత్తూరు, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): జీడి రైతులు, కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జీడి పరిశ్రమలు తాత్కాలికంగా మూత పడడంతో కార్మికులకు ఉపాధి కరువైంది. మరోవైపు జీడిపిక్కల ధరలు తగ్గుముఖం పట్టడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పది రోజుల కిందట 80 కిలోల జీడిపిక్కల బస్తా రూ.13వేలు ఉండగా.. గ్రామాల్లో వ్యాపారులు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం ధర రూ.12వేలకు పడిపోవడంతో పిక్కలు కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇతర దేశాల నుంచి పిక్కలు నేరుగా దిగుమతి అవుతుండడంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వాపోతున్నారు. వ్యాపారులు విదేశీ పిక్కల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొంటున్నారు. ఓ వైపు బస్తా పిక్కలను రూ.16వేలకు కొనుగోలు చేయాలని జీడిరైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేస్తుండగా.. ధరలు మరింత తగ్గుముఖం పట్టడం అన్యాయమని ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు అనుకూలించక పిక్కల దిగుబడి తగ్గిందని, ఉన్న కాస్త పంటకు కూడా ధర తగ్గడంతో తమకు నష్టాలు తప్పేలా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి జీడిపిక్కల ధరలు పెంచి.. తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

  • కార్మికులకు ఉపాధి లేక..

  • ఉద్దానం ప్రాంతంలో జీడిపిక్కల నుంచి జీడిపప్పు వేరుచేసే పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులు లబ్ధి పొందుతున్నారు. కాగా జీడి పరిశ్రమలను ఈ నెల 2 నుంచి యజమానులు తాత్కాలికంగా బంద్‌ చేశారు. ఈ నెల 14వరకు మూసివేయనున్నట్టు సమాచారం. జీడిపప్పునకు అంతర్జాతీయంగా డిమాండ్‌ తగ్గింది. మరోవైపు అమెరికా టారిఫ్‌ల ప్రభావంతో ఎగుమతులు కూడా తగ్గాయి. ఈ నేపథ్యంలో పప్పు నిల్వలు పూర్తిస్థాయిలో విక్రయించిన తర్వాతే.. పరిశ్రమలు తెరుస్తామని యజమానులు చెబుతున్నారు. అదే జరిగితే.. జీడిపిక్కల ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని రైతులు దిగులు చెందుతున్నారు. మరోవైపు పరిశ్రమల మూతతో ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యాలు ఎటువంటి సంప్రదింపులు లేకుండానే పరిశ్రమలు మూసివేయడం తగదని పేర్కొంటున్నారు. తమకు కనీస వేతనాలు అయినా అందజేయాలని కోరుతున్నారు. పరిశ్రమలు మూతపడిన సమయంలో.. కనీస వేతనాలు అందించేలా ఒప్పందాలు జరగాలని కార్మిక వర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

  • కార్మికులను ఆదుకోవాలి

  • జీడి పరిశ్రమలు మూత కారణంగా కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిశ్రమలు మూతపడే సమయంలో కార్మికులకు కనీస వేతనం అందించేలా వేతన ఒప్పందాలు కుదుర్చుకోవాలి. జీడి కార్మికులను ఆదుకోవాలి.

    - సాన కృష్ణ, సర్పంచ్‌, చినవంక

Updated Date - Jun 07 , 2025 | 11:46 PM