Cashew board : పలాసలో జీడిబోర్డు
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:29 PM
State government prepares to set up cashew board జిల్లాలో జీడి బోర్డు ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ అంశంపై ఇటీవల కేంద్ర పరిశ్రమలశాఖ మంత్రి పీయుష్‌గోయల్‌ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ కలిసి చర్చించారు. రాష్ట్రంలో జీడి, మిర్చి, మామిడి బోర్డులు ఏర్పాటు చేయాలని లోకేశ్ కోరగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.
ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు
కేంద్రమంత్రితో చర్చించిన మంత్రి లోకేశ్
రామకృష్ణాపురం వద్ద 70 ఎకరాల కేటాయింపు
పలాస, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): జిల్లాలో జీడి బోర్డు ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ అంశంపై ఇటీవల కేంద్ర పరిశ్రమలశాఖ మంత్రి పీయుష్‌గోయల్‌ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ కలిసి చర్చించారు. రాష్ట్రంలో జీడి, మిర్చి, మామిడి బోర్డులు ఏర్పాటు చేయాలని లోకేశ్ కోరగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే పలాస జీడి పప్పు తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా అవుతోంది. జిల్లాలో జీడి బోర్డు ఏర్పాటు చేస్తే పలాస జీడికి తిరుగుండదని రైతులు, వ్యాపారులు పేర్కొంటున్నారు.
అంతర్జాతీయ గుర్తింపు..
దేశంలో జీడి ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతుల్లో రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. ముఖ్యంగా జీడిపప్పు ఉత్పత్తులకు కేంద్రమైన పలాస జీడికి అంతర్జాతీయంగా కూడా మంచి గుర్తింపు ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా జీడి ఉత్పత్తులకు సముచిత స్థానం ఇచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జీడి ఉత్పత్తులు మరింతగా గుర్తింపు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా జీడి బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తోంది. జిల్లాలో 400 పైగా జీడి పరిశ్రమలు ఉండగా ఒక్క పలాస, టెక్కలి డివిజన్లలోనే 350 పైగా ఉన్నాయి. పలాసలో ఇంగిలిగాం పారిశ్రామిక వాడలో 50 దాకా ఉండగా, దానికి అనుబంధ పరిశ్రమలు నాలుగు ఉన్నాయి. వాటి ద్వారా 15వేలకు పైగా కార్మికులకు ఉపాధి లభిస్తోంది. జిల్లావ్యాప్తంగా 30వేల హెక్టార్లలో ప్రస్తుతం జీడి సాగవుతోంది. వరి తరువాత అతిపెద్ద పంటగా సాగులో ఉండగా వాణిజ్యంలో మొదటిస్థానంలో ఉంది. ఇక్కడ అవసరాలకు స్థానికంగా పండే జీడి గింజలు చాలకపోవడంతో విదేశాల నుంచి ఏటా 50వేల టన్నుల వరకూ పిక్కలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. పంటలపై సరైన విధానాలు అవలంబించకపోవడం, ఏటా ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల కారణంగా ఆశించినంతగా దిగుబడి లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికితోడు గిట్టుబాటు ధరలు లేక రైతులు అవసరాల మేరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది.
ఇవీ ప్రయోజనాలు
జిల్లాలో జీడి బోర్డు ఏర్పాటయితే రైతులు, వ్యాపారులకు ఎంతో ప్రయోజనగం కలగనుంది. జీడి ప్రాసెసింగ్, ఆధునికీకరణ, పారదర్శకమైన వ్యాపారం, రైతులకు మెరుగైన ధరలు అందించడానికి మార్గం సుగమం అవుతుంది. సాంకేతికంగా అభివృద్ధి చెందడంతో పాటు రైతులు, వ్యాపారులకు ప్రభుత్వమే తగు సూచనలు చేస్తూ దిగుబడి పెంచడంతో పాటు నష్టం లేకుండా రైతులు తమ పంటలు విక్రయించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. జీడి, దాని అనుబంధ పరిశ్రమలు స్థాపించడానికి కూడా యువ వ్యాపారులకు అవగాహన ఏర్పాటు చేయడం, వారితో పరిశ్రమలు స్థాపించి ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండు రోజుల కిందట జిల్లా కేంద్రంలో కలెక్టర్ స్వప్నిల్‌దినకర్ పుండ్కర్ జీడి వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. జీడి పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాలు కలెక్టర్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఇప్పటికే నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్కు మంజూరు చేసింది. నామమాత్రపు ధరకు వ్యాపారులకు అవసరమైన స్థలాలు ఇచ్చి ప్రోత్సహిస్తుంది. ఈ మేరకు పలాస మండలం రామకృష్ణాపురం వద్ద 70 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. వాటిని ప్లాట్లుగా విభజించి ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు.