బీటెక్ విద్యార్థి ఆత్మహత్య ఘటనలో 8 మంది సీనియర్లపై కేసు
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:04 AM
Parents and students concerned on campus ఎచ్చెర్ల మండలం ఎస్.ఎం.పురంలోని ఆర్జీయూకేటీ (శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్) బీటెక్ విద్యార్థి ఆత్మహత్య ఘటనలో ఎనిమిది సీనియర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని క్యాంపస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
క్యాంపస్‌లో తల్లిదండ్రులు, విద్యార్థుల ఆందోళన
బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్, పోలీసుల జోక్యం
ఆ ఎనిమిది మంది విద్యార్థుల సస్పెన్షన్
ఎచ్చెర్ల, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్ల మండలం ఎస్.ఎం.పురంలోని ఆర్జీయూకేటీ (శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్) బీటెక్ విద్యార్థి ఆత్మహత్య ఘటనలో ఎనిమిది సీనియర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని క్యాంపస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గుంటూరుకు చెందిన ప్రత్తిపాటి సృజన్(20) ఇక్కడ ఇంజనీరింగ్ ఈఈఈ బ్రాంచ్‌లో తృతీయ సంవత్సరం చదువుతూ.. బుధవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సృజన్ తల్లిదండ్రులు జ్యోతి, శివకృష్ణప్రసాద్ గురువారం ఉదయం 6 గంటలకు క్యాంపస్‌కు చేరుకున్నారు. తన కుమారుడి మృతికి క్యాంపస్‌లో పర్యవేక్షణ లోపమే కారణమని బోరున విలపించారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. విద్యార్థులు కూడా వారిని ఓదార్చే ప్రయత్నం చేస్తూ.. క్యాంపస్ డైరెక్టర్ కార్యాలయం బయట బైటాయించి ఆందోళన చేపట్టారు. ‘కొంతమంది సీనియర్ విద్యార్థుల వేధింపుల వల్లే మా కుమారుడు మృతి చెందాడు. ఆత్మహత్యకు గల కారణాలను పూర్తిస్థాయిలో వెలికితీయాలి. బాధ్యులను కఠినంగా శిక్షించాల’ని సృజన్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద, జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం, ఎస్‌ఐలు వి.సందీప్‌కుమార్, జి.లక్ష్మణరావు, వై.మధుసూదనరావు పోలీసు బలగాలతో క్యాంపస్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. డీఎస్పీ వివేకానంద మాట్లాడుతూ మృతుని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని, చట్టం ముందు అందరూ సమానమేన్నారు.
సృజన్ ఆత్మహత్యకు కారణమని ఆరోపిస్తూ మృతుడి తల్లి చేసిన ఫిర్యాదు మేరకు నాలుగో సంవత్సరం చదువుతున్న వివిధ బ్రాంచ్‌లకు చెందిన 8 మంది విద్యార్థులను పోలీసులు ఎచ్చెర్ల పోలీసుస్టేషన్‌కు తరలించారు. వీరిపై 108 బీఎన్‌ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శ్రీకాకుళం సర్వజనాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో ఆందోళనకారులు కొంతమేరకు శాంతించారు. ఉదయం 11 గంటల తర్వాత విద్యార్థులు ఎవరి తరగతులకు వారు వెళ్లిపోయారు.
నిజనిర్ధారణకు అంతర్గత కమిటీ
ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్‌లో విద్యార్థి సృజన్ ఆత్మహత్యపై విచారణకు యూనివర్సిటీ అధికారులు అంతర్గత కమిటీని నియమించారు. కమిటీ సూచనల మేరకు 8 మంది విద్యార్థులను తక్షణమే సస్పెన్షన్ చేశామని వర్సిటీ అధికారులు ప్రకటించారు. ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ డాక్టర్ సండ్ర అమరేంద్రకుమార్ క్యాంపస్‌కు చేరుకుని విద్యార్థులు, అధికారులు, అధ్యాపకులతో మాట్లాడి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
న్యాయం చేయాలి
గతంలో కూడా ఇలాంటి సంఘటన లు జరిగాయని, ఈ సంఘటనకు బాధ్యులైనవారిపై చర్యలు చేపట్టాలని ఆర్జీయూకేటీ క్యాంపస్ అధికారులను కలిసి కోరామని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు డి.చంద్రశేఖర్, చిత్రిరాజు తెలిపారు. దళిత సంఘ నేతలు ముంజేటి కృష్ణమూర్తి, వై.గురుమూర్తి, జి.యోగేశ్వరరావు, బి.శశిభూషణరావు తదితరులు మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులను కోరారు.