Share News

Cancer: కన్నీటి ‘సంద్ర’ం!

ABN , Publish Date - Apr 11 , 2025 | 12:01 AM

Cancer cases ఒడిశా రాష్ట్ర సరిహద్దున.. మెళియాపుట్టి మండలంలోని నడసంద్రలో 150 కుటుంబాలు ఉన్నాయి. ఇందులో అధికంగా ఒడియా కుటుంబాలు నివసిస్తున్నాయి. ఏమి జరిగిందో కానీ.. గత నాలుగేళ్ల నుంచీ ఈ గ్రామంలో క్యాన్సర్‌ బాధితులు పెరుగుతున్నారు. ఏ ఇంటికి వెళ్లినా కన్నీటి గాథలే కనిపిస్తున్నాయి.

Cancer: కన్నీటి ‘సంద్ర’ం!
నడసంద్ర గ్రామం.. పంచాయతీ కార్యాలయం

  • నడసంద్ర గ్రామాన్ని కబళిస్తున్న క్యాన్సర్‌

  • నాలుగేళ్లలో ఆరుగురి మృతి

  • ప్రస్తుతం మరో పదిమంది వరకు బాధితులు

  • మెళియాపుట్టి మండలం నడసంద్ర గ్రామానికి చెందిన సంధ్యా జిన్నా గత నెల 16 క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ మృతి చెందింది. చివరి స్టేజ్‌లో గుర్తించడం వల్ల వైద్యసేవలు అందించినా ఫలితం లేకపోయిందని ఆమె భర్త వరికి జిన్నా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తమ గ్రామానికి చెందిన చింతామణి మజ్జి కూడా గతేడాది క్యాన్సర్‌తో పోరాడి మృతి చెందిందని తెలిపాడు. గ్రామంలో క్యాన్సర్‌ వ్యాధిగ్రస్థులు పెరుగుతున్నారని, బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నాడు.

  • ........................

  • మెళియాపుట్టి, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): ఒడిశా రాష్ట్ర సరిహద్దున.. మెళియాపుట్టి మండలంలోని నడసంద్రలో 150 కుటుంబాలు ఉన్నాయి. ఇందులో అధికంగా ఒడియా కుటుంబాలు నివసిస్తున్నాయి. ఏమి జరిగిందో కానీ.. గత నాలుగేళ్ల నుంచీ ఈ గ్రామంలో క్యాన్సర్‌ బాధితులు పెరుగుతున్నారు. ఏ ఇంటికి వెళ్లినా కన్నీటి గాథలే కనిపిస్తున్నాయి. గత నాలుగేళ్లలో క్యాన్సర్‌ వ్యాధితో గ్రామానికి చెందిన చింతామణి మజ్జి, రోహిత్‌పాత్రో, సంద్యా జిన్నా, ప్రతాప్‌పాత్రో, జొగ్గజిన్నా, బొబ్బుకుంటి.. ఇలా ఆరుగురు మృతి చెందారు. ప్రస్తుతం మరో పది మంది వరకూ క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతుండడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో చాలామంది ఖైనీ, గుట్కా, బీడీ, సిగరెట్‌, కిల్లీ అలవాటు ఉంది. వీటి కారణంగా వ్యాధి ప్రబలిందా?.. లేదా నీటి సమస్య వల్ల వ్యాధి తీవ్రత పెరుగుతుందో తెలియక సతమతమవుతున్నారు. వైద్యసిబ్బంది అవగాహన కల్పిస్తున్నా.. వ్యాధి తీవ్రత తగ్గడం లేదని ఆవేదన చెందుతున్నారు. గతంలో ఈ పరిస్థితి లేదని, రెండేళ్ల నుంచి కొత్తబోరు తవ్వి నీరు ఇవ్వడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. కొత్తబోరు నీటిని నిల్వ ఉంచితే మరుసటి రోజుకు నల్లగా మారుతోందని, ద్విచక్రవాహనాలను ఆ నీటితో కడిగితే తుప్పుపడుతున్నాయని తెలిపారు. తాగునీటిని పరీక్షించాలని సచివాలయ సిబ్బందికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన తాము వైద్యసేవలు పొందేందుకు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఆరోగ్యశ్రీ సేవలు కూడా కొంతమందికి వర్తించకపోవడంతో వైద్యం కోసం అప్పులు చేయాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి క్యాన్సర్‌ వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ విషయమై మెళియాపుట్టి వైద్యాధికారిణి గ్రీష్మ వద్ద ప్రస్తావించగా.. ‘గతంలో క్యాన్సర్‌ వ్యాధితో నలుగురు బాధపడుతుండేవారు. ముగ్గురికి వ్యాధి నయమైంది. ఇటీవల ఒకరు మృతి చెందారు. ఏ అనారోగ్య సమస్య ఉన్నా క్యాన్సర్‌ అంటూ ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదు. క్యాన్సర్‌ బాధితులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. సకాలంలో క్యాన్సర్‌ను గుర్తిస్తే.. దాని నివారణకు చర్యలు చేపడతామ’ని తెలిపారు. అలాగే గ్రామంలో తాగునీటి పరీక్షలు చేయిస్తామని, ఇప్పటికే క్యాన్సర్‌ బాధితులను గుర్తించాలని వైద్యసిబ్బందిని ఆదేశించామని ఎంపీడీవో ప్రసాద్‌పండా తెలిపారు. గ్రామంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు.

  • మూడేళ్ల నుంచి బాధపడుతున్నాను

  • గత మూడేళ్ల నుంచి నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. వైద్యం కోసం అప్పు చేశాను. ప్రభుత్వం నుంచి ఎటువంటి సేవలు అందడం లేదు.

    - వినోద్‌ మల్లికో, నడసంద్ర, మెళియాపుట్టి

    .....................

  • బాధితులు పెరుగుతున్నారు

  • గ్రామంలో క్యాన్సర్‌ వ్యాధి బాధితులు పెరుగుతుండడంతో భయాందోళనగా ఉంది. ఇప్పటికే కొంతమంది బాధితులను విశాఖపట్నంలో వైద్యసేవలు పొందుతున్నారు. చాలామంది పేదలకు వ్యాధి ప్రబలుతుండడంతో వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు.

    - సంతోష్‌ మల్లికో, మాజీ సర్పంచ్‌, నడసంద్ర

    ...............

  • వైద్యపరీక్షలు నిర్వహించాలి

  • గ్రామంలో వ్యాధి లక్షణాలు ఉన్నవారికి వైద్యపరీక్షలు చేయించాలి. కొంతమంది బాధితులు చివరిస్టేజ్‌లో వైద్యసేవల కోసం వెళ్లినా ప్రయోజనం ఉండడం లేదు. ప్రత్యేక వైద్యనిపుణులతో గ్రామంలో పరీక్షలు నిర్వహిస్తే ఉపయోగకరంగా ఉంటుంది.

    - వెంకటరావు, మాజీ సర్పంచ్‌, నడసంద్ర

Updated Date - Apr 11 , 2025 | 12:01 AM