ఖరీఫ్ నాటికి కాలువలు సిద్ధం కావాలి: ఎమ్మెల్యే
ABN , Publish Date - May 06 , 2025 | 11:52 PM
రానున్న ఖరీఫ్ నాటికి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా సాగునీటి కాలువలను సిద్ధం చేయాలని నీటి పారుదల శాఖ అధికారులను ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదేశించారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, మే 6(ఆంధ్రజ్యోతి): రానున్న ఖరీఫ్ నాటికి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా సాగునీటి కాలువలను సిద్ధం చేయాలని నీటి పారుదల శాఖ అధికారులను ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదేశించారు. నగరంలోని ఎస్‌ఈ కార్యాలయంలో ఆయన నీటి పారుదల శాఖ అధికారులతో ఆయన మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెగ్యులర్, ఆర్‌ఎంసీ, బైరిదేశి గెడ్డ పనులపై ఆరా తీశారు. చెక్ డ్యామ్‌లు, ఇతర పనులు కూడా ఎంజీఎన్‌ఇఆర్‌ఎస్ నిధులతో చేపట్టాలని సూచించారు. సాగునీటి సంఘాల చైర్మన్లు, ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ పనులు చేపట్టాలని, రైతులకు అధికారులు అందుబాటులో ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అరవల రవీంద్ర, సాగునీటి సంఘాల చైర్మన్లు, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీలతో మెరుగైన సేవలు
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మరిన్ని మెరుగైన సేవలను అందించాలని ఎమ్మెల్యే గొండు శంకర్ సూచించారు. నగరంలోని ఐసీడీఎస్ కేంద్రంలో మంగళవారం ఆయన అంగన్‌వాడీ కేంద్రాల పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి. ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. గార పరిధిలో 57, శ్రీకాకుళం అర్బన్‌లో 176 భవనాల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
గోశాలల నిర్మాణానికి చర్యలు
గ్రామీణ ప్రాంతాల్లో గోశాలలు, పశువుల నీటి తొట్టెల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో డ్వామా అధికారులతో ఆయన మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షపు నీటిని నిల్వ చేయడం, మట్టిని కాపాడడం, భూగర్భ జలాలను పునరుద్ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ సుధాక ర్, సిబ్బంది పాల్గొన్నారు.