బంగారం కోసమే వ్యాపారి హత్య
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:12 AM
Businessman Body found in Ramigedda నరసన్నపేటకు చెందిన బంగారం వ్యాపారి(కొరియర్) పొట్నూరు వెంకటపార్వతీశం గుప్త హత్యకు గురైనట్టు పోలీసులు నిర్ధారించారు. శ్రీకాకుళం మండలం పెద్దపాడు పంచాయతీ తంగివానిపేట వద్ద రామిగెడ్డలో శుక్రవారం ఆయన మృతదేహం బయట పడింది.
రామిగెడ్డలో దొరికిన మృతదేహం
కారు డ్రైవరే కీలక పాత్రధారి
అతడి స్నేహితుడి సాయంతో..
నరసన్నపేట/శ్రీకాకుళం క్రైం, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): నరసన్నపేటకు చెందిన బంగారం వ్యాపారి(కొరియర్) పొట్నూరు వెంకటపార్వతీశం గుప్త హత్యకు గురైనట్టు పోలీసులు నిర్ధారించారు. శ్రీకాకుళం మండలం పెద్దపాడు పంచాయతీ తంగివానిపేట వద్ద రామిగెడ్డలో శుక్రవారం ఆయన మృతదేహం బయట పడింది. గత నెల 26న గుప్త హత్యకు గురికాగా.. తను కనబడలేదంటూ కుటుంబ సభ్యులు 31న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు అనుమానితులను విచారణ చేపట్టారు. గుప్త మృతదేహం కోసం రెండు రోజులుగా గాలించారు. శుక్రవారం రామిగెడ్డ వద్ద మృతదేహం కనిపించడంతో శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద, రూరల్ సీఐ పైడిపునాయుడు, నరసన్నపేట పోలీసులు వెళ్లి పరిశీలించారు. గుప్త సోదరుడు మన్మథరావు కూడా మృతదేహాన్ని పరిశీలించి తన సోదరుడేనని నిర్ధారించారు. పొలాల మధ్య కాలువల్లో లభించిన మృతదేహాన్ని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. హత్య కేసులో నిందితులను త్వరలో అరెస్టు చేయనున్నారు.
ఏమి జరిగిందంటే..
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గుప్త హత్య కేసులో కారుడ్రైవర్ సంతోష్, అతని స్నేహితుడు పెద్దపాడులోని కారు డెకార్ యాజమాని కీలకంగా వ్యవహరించారు. ఈ నెల 26న కారుడ్రైవర్ సంతోష్‌తో కలిసి గుప్త విశాఖ వెళ్లారు. అక్కడ నుంచి రూ.2కోట్ల విలువైన బంగారు బిస్కెట్లను తీసుకొస్తుండగా, వాటిని కాజేసేందుకు పథకం ప్రకారం గుప్తను హతమార్చాలని భావించారు. ఈ క్రమంలో పెద్దపాడు వద్ద కారును సర్వీసు రోడ్డువైపు మళ్లించారు. ఆ సమయంలో వర్షం పడడంతో గుప్తను కారు డెకార్ షాపులోకి తీసుకెళ్లారు. గుప్త మెడకు వైరు బిగించి హతమార్చినట్లు తెలుస్తోంది. కారులో బంగారు ఆభరణాలను డ్రైవర్ సంతోష్ ఇంటికి తీసుకెళ్లి భార్యకు ఇచ్చారు. అందులో కొన్ని ఆభరణాలను ఆమె బొరిగివలసకు చెందిన ఓ యువకుడికి ఇచ్చి భద్రపరచాలని కోరారు. తర్వాత కారును గుప్త ఇంటికి డ్రైవర్ అప్పగించేశారు. నాలుగు రోజులుగా గుప్త ఆచూకీ లేకపోవడంతో గత నెల 31న ఆయన సోదరుడు మన్మథరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా ఆ రోజు హత్య జరిగిన తర్వాత గుప్త మృతదేహాన్ని పాత్రునివలస వద్ద రామిగెడ్డలో వేయగా.. వర్షాల కారణంగా అది సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో కాలువలోకి కొట్టుకువచ్చి.. తంగివానిపేట వద్ద శుక్రవారం లభ్యమైంది.