Share News

పలాసలో వ్యాపారి కిడ్నాప్‌

ABN , Publish Date - Nov 06 , 2025 | 11:46 PM

Businessman kidnapped పలాసలో కిడ్నాప్‌ కలకలం రేగింది. గురువారం ఉదయం టీ తాగుతున్న ఓ వ్యాపారిని కారులో కొంతమంది వ్యక్తులు వచ్చి కిడ్నాప్‌ చేయడంతో తోటి వ్యాపారులంతా ఆందోళన చెందారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. వ్యాపారికి ఆమదాలవలసలో ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌ను బలవంతంగా రిజిస్ర్టేషన్‌ చేసేందుకుగాను కిడ్నాప్‌ చేసినట్టు పోలీసులు గుర్తించారు. కిడ్నాపర్లను హెచ్చరించడంతో వారు వ్యాపారిని విడిచిపెట్టేశారు.

పలాసలో వ్యాపారి కిడ్నాప్‌
వీఎల్‌ఎన్‌ రాజు(ఫైల్‌)

  • వీఎల్‌ఎన్‌ రాజును కారులో ఎత్తుకెళ్లిన దుండగులు

  • షాపింగ్‌ కాంప్లెక్స్‌ను రిజిస్ర్టేషన్‌ చేసుకునేందుకు యత్నం

  • పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విడిచిపెట్టిన వైనం

  • పలాస, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): పలాసలో కిడ్నాప్‌ కలకలం రేగింది. గురువారం ఉదయం టీ తాగుతున్న ఓ వ్యాపారిని కారులో కొంతమంది వ్యక్తులు వచ్చి కిడ్నాప్‌ చేయడంతో తోటి వ్యాపారులంతా ఆందోళన చెందారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. వ్యాపారికి ఆమదాలవలసలో ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌ను బలవంతంగా రిజిస్ర్టేషన్‌ చేసేందుకుగాను కిడ్నాప్‌ చేసినట్టు పోలీసులు గుర్తించారు. కిడ్నాపర్లను హెచ్చరించడంతో వారు వ్యాపారిని విడిచిపెట్టేశారు. ఈ ఘటనకు సంబంధించి కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పలాసకు చెందిన ప్రముఖ జీడి వ్యాపారి, బ్యాంకుల కన్సల్‌టెంట్‌ వి.లక్ష్మినారాయణరాజు(వీఎల్‌ఎన్‌ రాజు)ను ఆమదాలవలసకు చెందిన వ్యాపారి పొట్నూరు వేణుగోపాలరావు, ఆయన అనుచరులు గురువారం ఉదయం కిడ్నాప్‌ చేశారు. రాజు గురువారం ఉదయం 9 గంటల సమయంలో కేటీ రోడ్డు, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌వద్ద టీ తాగుతున్నారు. ఈక్రమంలో ఆమదాలవసలకు చెందిన శ్రీను అనే వ్యక్తి వీఎల్‌ఎన్‌.రాజును బయటకు రావాలని పిలిచాడు. అప్పటికే రోడ్డుపై రెండు కార్లతో పొట్నూరు వేణుగోపాలరావుతో పాటు ఏడుగురు వ్యక్తులు రెడీగా ఉన్నారు. వీఎల్‌ఎన్‌.రాజు బయటకు రాగానే బలవంతంగా ఆయన్ను కారులోకి ఎక్కించి కిడ్నాప్‌ చేశారు. రాజు వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ తీసుకొని స్విచ్ఛాప్‌ చేశారు. రాజుతో పాటు టీ తాగేందుకు వచ్చిన ఆయన స్నేహితులు ఏమి జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు. అనంతరం ఆయన భార్య మాధవికి ఫోన్‌ద్వారా సమాచారం అందించారు. మాధవితోపాటు పలాసకు చెందిన కొంతమంది వ్యాపారులు కాశీబుగ్గ పోలీసులకు కిడ్నాప్‌ వ్యవహారాన్ని తెలిపారు. ఆయన ఫోన్‌కు రింగ్‌ చేసినా స్పందన లేకపోయింది. ప్రమాదం పొంచి ఉందని భావించిన కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ ఆమదాలవలస పోలీసులకు సమాచారం అందించారు.

  • షాపింగ్‌ కాంప్లెక్స్‌ రిజిస్ర్టేషన్‌ కోసమే..

  • వీఎల్‌ఎన్‌ రాజుకు ఆమదాలవలసలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఉంది. దీన్ని కొన్నాళ్ల కిందట వేణుకు అద్దెకు ఇచ్చారు. ఇప్పటికే వేణు వద్ద రూ.1.10 కోట్లు అప్పు రూపంలో రాజు తీసుకున్నారు. దీన్ని మార్ట్‌గేజ్‌ చేస్తూ 2029 వరకూ టైమ్‌బాండ్‌ పెట్టుకున్నారు. ఆస్తిని విక్రయించి వేణుగోపాలరావుకు డబ్బులు ఇవ్వడానికి రాజు సిద్ధమయ్యారు. పలాసకు చెందిన బ్రోకర్ల సహాయంతో ఆ ఆస్తిని వేరొకరికి అమ్మడానికి ప్రయత్నించారు. కాగా ఈ ఆస్తిని తనకు తప్ప వేరే వ్యక్తులకు అమ్మకూడదని, అలా చేస్తే ఊరుకోనని వేణు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఇద్దరి మఽధ్య కొద్దిరోజులుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఇటీవల వేణుగోపాలరావు అనుచరుడు శ్రీను కూడా రాజుకు హెచ్చరికలు జారీ చేశాడు. ఈ క్రమంలో రాజును కిడ్నాప్‌ చేసి బలవంతంగా ఆమదాలవలస సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయానికి తరలించారు. అక్కడ షాపులను రిజిస్ర్టేషన్‌ చేసేందుకు ప్రణాళిక రచించారు. కాగా.. రాజు కిడ్నాప్‌ విషయమై ఆయన భార్య మాధవి, వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని వేణుగోపాలరావు పసిగట్టాడు. వ్యవహారం పెద్దదవుతుందని భావించి వీఎల్‌ఎన్‌ రాజుతో ఆయన భార్య మాధవికి ఫోన్‌ చేయించారు. తాను క్షేమంగా ఉన్నానని, సాయంత్రానికి తిరిగి వస్తానని చెప్పాలని బలవంతం చేయడంతో దాని ప్రకారమే ఫోన్‌ చేశాడు. అయితే ఇందులో మతలబు ఉందని భావించిన కాశీబుగ్గ సీఐ వేణుగోపాలరావుకు ఫోన్‌ చేసి హెచ్చరించడంతో రిజిస్ట్రేషన్‌, కిడ్నాప్‌ డ్రామాకు ఫుల్‌స్టాప్‌ పడింది.

  • అనంతరం వీఎల్‌ఎన్‌.రాజును నరసన్నపేట వద్ద విడిచిపెట్టి వేణుగోపాలరావు, ఆయన అనుచరులు వెళ్లిపోయారు. అతికష్టంపై అక్కడ నుంచి నేరుగా కాశీబుగ్గ పోలీస్టేషన్‌కు చేరుకొని కిడ్నాప్‌, రిజిస్ట్రేషన్‌ వ్యవహారాన్ని వీఎల్‌ఎన్‌ రాజు కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై భౌతికంగా దాడి కూడా చేశారని ఏకరవు పెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సూర్యనారాయణ తెలిపారు. పట్టపగలు టీ తాగుతున్న సమయంలో రాజు కిడ్నాప్‌నకు గురికావడంతో తోటి వ్యాపారులంతా ఆందోళన చెందారు. దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని వ్యాపారులు కోరుతున్నారు.

Updated Date - Nov 06 , 2025 | 11:46 PM