ధాన్యం కొనుగోలులో దళారుల దందా
ABN , Publish Date - Nov 25 , 2025 | 12:07 AM
Collecting money in the form of commissions ధాన్యం కొనుగోలు ప్రక్రియలో దళారీలు, మిల్లర్ల దందా కొనసాగుతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు వెళ్లాల్సిన పనిలేదు. శాంపిల్స్ బాధ ఉండదు. రైతుల ఖాతాల్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర జమవుతుంది. కానీ 80 కేజీల బస్తాకు రూ.100 నుంచి రూ.200 దళారీలు తీసుకునేందుకు, మిల్లర్లకు అదనంగా 2 కేజీల నుంచి 5 కేజీల ధాన్యం ఇచ్చేందుకు ముందస్తు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు.
ఈలింగ్ పేరుతో మాయాజాలం
బస్తాపై అదనంగా 2 నుంచి 5 కేజీలు
కమీషన్ల రూపంలోనూ డబ్బుల వసూలు
‘ప్రభుత్వ’ కేంద్రాల్లో లేని సాంకేతిక సిబ్బంది
మిల్లర్లు, వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు
నరసన్నపేట/ రణస్థలం, నవంబరు 24(ఆంధ్రజ్యోతి):
నరసన్నపేటలోని భవానీపురానికి చెందిన కొంతమంది రైతులు నాలుగు రోజుల కిందట కంబకాయి సర్వీసు రోడ్డులో ధాన్యం ఆరబెట్టారు. నరసన్నపేటకు చెందిన ఒక దళారీ ఆ రైతుల వద్దకు వెళ్లాడు. షెడ్యూల్ తీసుకోవడం నుంచి.. శాంపిల్స్ సేకరణ, ధాన్యం మిల్లుకు పంపించేవరకు అంతా తన బాధ్యతేనని చెప్పాడు. అందుకు బస్తాకు 3 కిలోల చొప్పున మిల్లర్లకు అదనంగా ధాన్యం ఇవ్వాలని.. తన కమీషన్ రూ.200 చొప్పున చెల్లించాలని ఒప్పందం కుదర్చుకున్నాడు. వారి నుంచి సుమారు 200 బస్తాల ధాన్యం కొనుగోలు చేశాడు.
జమ్ము గ్రామానికి చెందిన రైతులు ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు వెళ్లగా షెడ్యూల్ ఇచ్చేవారు లేరు. శాంపిల్స్ తీసుకునేవారు లేరు. తేమ నిర్ధారించే యంత్రాలు కూడా లేవు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు భయపడి నేరుగా మిల్లర్లను ఆశ్రయించి విక్రయించారు. వారు బస్తాకు 2 నుంచి 5 కేజీల వరకు ధాన్యం అదనంగా తీసుకున్నారు.
జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో దళారీలు, మిల్లర్ల దందా కొనసాగుతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు వెళ్లాల్సిన పనిలేదు. శాంపిల్స్ బాధ ఉండదు. రైతుల ఖాతాల్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర జమవుతుంది. కానీ 80 కేజీల బస్తాకు రూ.100 నుంచి రూ.200 దళారీలు తీసుకునేందుకు, మిల్లర్లకు అదనంగా 2 కేజీల నుంచి 5 కేజీల ధాన్యం ఇచ్చేందుకు ముందస్తు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు.
జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 3.80 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. ప్రస్తుతం వరికోతలు, నూర్పులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రభుత్వం 406 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 6.5 లక్షల మెట్రిక్‌టన్నులు సేకరించాలని నిర్ణయించింది. కానీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. కొనుగోలు కేంద్రాలకు తేమశాతం నిర్థారించే యంత్రాలు పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. కేంద్రాల్లో సిబ్బంది అందుబాటులో ఉండడం లేదు. ధాన్యం విక్రయాలకు సంబంధించి కేంద్రాల్లో రైతులకు షెడ్యూల్ ఇవ్వడం లేదు. శాంపిల్స్ తీసుకువెళ్లేందుకు రావాలని కోరగా.. సాంకేతిక సిబ్బంది అందుబాటులో లేరని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. దీంతో రైతులు మిల్లర్లు, దళారీలను ఆశ్రయించి ధాన్యం విక్రయిస్తున్నారు. ఇదే అదునుగా వారు అదనంగా ధాన్యంతోపాటు కమీషన్ల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది మద్దతు ధర ప్రకటించింది. 17 శాతంలోపు తేమ ఉంటే బస్తాకు రూ.1895 మద్దతు ధరగా ప్రకటించింది. కానీ దళారులు తేమశాతం ఎక్కువగా ఉందని, ధాన్యం దిగుబడి(ఈలింగ్) రాదంటూ.. రూ.1600లోపు అడుగుతున్నారు. ఇలా నరసన్నపేట మండలంలోని నడగాం, చిక్కావలస, సుందరాపురం, చెన్నాపురం, చోడవరం, జలుమూరు మండలం కూర్మనాథపురం, గొటివాడ, పాగోడు తదితర గ్రామాల్లో దళారీలు కొనుగోలు చేస్తున్నారు.
మిల్లర్లతో కుమ్మక్కు
పౌరసరఫరాలశాఖ, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొంతమంది సిబ్బంది మిల్లర్లతో కుమ్మక్కు అయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే ధాన్యం విక్రయించేందుకు వెళ్లిన రైతులను ఇబ్బందులు పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిల్లర్లు పంపించిన రైతుల జాబితాకు మాత్రం వేగంగా షెడ్యూల్ ఇస్తున్నారని, వారి ధాన్యం శాంపిల్స్ నిర్ధారణ రిపోర్టు ఇచ్చి.. మిల్లలకు ధాన్యాన్ని అటాచ్ చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కొంతమంది మిల్లర్లు భారీస్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పౌరసరఫరాలశాఖ అధికారులు తనిఖీలు చేపడితే నిల్వలు బయటపడే అవకాశం ఉందని చెబుతున్నారు.
‘వాట్సాప్’ సేవలు అందుబాటులోకి వచ్చినా..
గత అనుభవాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ సేవలను సైతం అందుబాటులోకి తెచ్చింది. రైతులు 7337359375 నెంబరుకు హాయ్ అని మెసేజ్ పెట్టగానే పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందిస్తారు. రైతుల వద్ద ఎన్నిబస్తాల ధాన్యం ఉన్నాయి? ఏ రకం? బస్తాలు ఎప్పటికి సిద్ధమవుతాయి? వంటి వివరాలు ఆరా తీస్తారు. ఏ కేంద్రంలో ఏ రోజు? ఏ సమయానికి? ఏ రకం ధాన్యం.. ఎన్ని బస్తాలు విక్రయించాలో తదితర వివరాలతో కూడిన స్లాట్ బుక్ అవుతుంది. ధాన్యం విక్రయించిన 48 గంటల్లో నగదు రైతుల అకౌంట్లలో జమవుతుంది. రైతుసేవా కేంద్రాలు, మిల్లుల్లో ఒకేలా తేమశాతాన్ని కొలిచే యంత్రాలను ఏర్పాటు చేయాలని పౌరసరఫరాలశాఖ అధికారులకు ఆదేశించింది. మరోవైపు రైతులకు ధాన్యం విక్రయాల్లో ఇబ్బందులు ఎదురైతే తెలియజెప్పేందుకు 1967 టోల్ ఫ్రీ నెంబర్‌ను సైతం అందుబాటులో తెచ్చింది. కంట్రోల్ రూం నంబరు 9963479141 నంబరుకు సైతం సంప్రదించవచ్చు. అయినప్పటికీ జిల్లాలో దళారుల హవా తగ్గేలా కనిపించడం లేదు. వారికి చెక్ చెప్పాలంటే ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది.
దళారుల బారిన పడొద్దు..
జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ మద్దతు ధర మేర చెల్లింపులు జరుగుతాయి. రైతులు దళారుల బారిన పడొద్దు. 7337359375 నెంబర్‌కు హాయ్ అని వాట్సాప్ మెసేజ్ పెడితే చాలు పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందిస్తారు. వివరాలు నమోదు చేసుకొని ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే 1967 టోల్‌ఫ్రీ నెంబర్, 9963479141 కంట్రోల్ రూమ్ నెంబర్‌ను సంప్రదించాలి.
- టి.వేణుగోపాల్, డీఎం, పౌరసరఫరాల సంస్థ