arasavalli: ఆదిత్యాలయంలో దళారుల దందా!
ABN , Publish Date - Apr 20 , 2025 | 12:40 AM
Temple Corruption అరసవల్లిలోని ఆదిత్యాలయంలో దళారుల దందా సాఫీగా సాగిపోతోంది. కొంతమంది మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ ప్రత్యేక దర్శనాల పేరిట భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు.
ప్రత్యేక దర్శనాల పేరిట వసూళ్లు
పట్టించుకోని అధికారులు
అరసవల్లి, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): అరసవల్లిలోని ఆదిత్యాలయంలో దళారుల దందా సాఫీగా సాగిపోతోంది. కొంతమంది మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ ప్రత్యేక దర్శనాల పేరిట భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. బయట వ్యక్తులు ఆలయంలో పనిచేస్తున్న దినసరి వేతన సిబ్బందికి, పర్మినెంట్ ఉద్యోగుల్లో కొందరికి ఫోన్ చేస్తారు. ఫలానా ఉద్యోగి తాలుకా కుటుంబ సభ్యులు వస్తున్నారు... వారిని దర్శనాలకు అనుమతించాలని చెబుతారు. అప్పటికే సంబంధిత భక్తులు ఆలయ ముఖద్వారం గేటు వద్దకు చేరుకుంటారు. వారిని ఆలయ సిబ్బంది నేరుగా అనివెట్టి మండపంలోంచి స్వామి దర్శనానికి తీసుకువెళతారు. ప్రత్యేకంగా ఈ తతంగం అంతా ఆదివారం నాడు జరుగుతోంది. ఈ విషయం ఆలయ ఉద్యోగులకు, సామాన్య భక్తులందరికీ తెలిసినా.. ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఆలయ అధికారి తగినంత సమయం ఆలయంలో ఉండకపోవడం, ఒకరిద్దరు పర్మినెంట్ ఉద్యోగులకు కూడా వసూళ్లలో వాటాలు అందుతుండడంతో ఈ దందా సజావుగా సాగిపోతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు దినసరి ఉద్యోగులు (ప్రస్తుతానికి ఆలయానికి రావడం లేదు) ఫోన్ ద్వారా ఆలయ ఉద్యోగితో కాంటాక్ట్‌లో ఉంటూ, ప్రొటోకాల్ దర్శనాల్లో ముఖ్యపాత్ర పోషిస్తున్నారని, వారికి ఆలయ ఉద్యోగి ఒకరు సహకరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతీ ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటన్నర తరువాత స్వామి దర్శన టిక్కెట్ల అమ్మకం ఆగిపోతుంది. దీంతో దళారుల పని మరింత సులువుగా మారుతుంది. నిజానికి సాయంత్రం వరకు ప్రత్యేక దర్శనానికి సంబంధించి టిక్కెట్లను అందుబాటులో ఉంచితే కొంతవరకైనా ఈ అక్రమ వసూళ్లను అరికట్టవచ్చని భక్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఆలయ అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి అక్రమ వసూళ్ల దందాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.