Ganjai: గంజాయి తెచ్చి.. ప్యాకెట్లలో విక్రయించి..
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:29 AM
Ten members arrest ఆ యువకులు గంజాయి మత్తుకు బానిసయ్యారు. ఒడిశాలో గంజాయిని కొనుగోలు చేసి తెచ్చి.. ప్యాకెట్లుగా తయారుచేసి స్నేహితులకు విక్రయించేవారు. ఈ క్రమంలో మొత్తంగా పది మంది యువకులు జేఆర్ పురం పోలీసులకు చిక్కారు. సోమవారం జేఆర్ పురం పోలీసుస్టేషన్‌లో సీఐ ఎం.అవతారం ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
10 మంది యువకుల అరెస్టు
22.5 కేజీల నిల్వల స్వాధీనం
రణస్థలం, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): ఆ యువకులు గంజాయి మత్తుకు బానిసయ్యారు. ఒడిశాలో గంజాయిని కొనుగోలు చేసి తెచ్చి.. ప్యాకెట్లుగా తయారుచేసి స్నేహితులకు విక్రయించేవారు. ఈ క్రమంలో మొత్తంగా పది మంది యువకులు జేఆర్ పురం పోలీసులకు చిక్కారు. సోమవారం జేఆర్ పురం పోలీసుస్టేషన్‌లో సీఐ ఎం.అవతారం ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎచ్చెర్ల మండలం కుశాలపురం గ్రామానికి చెందిన బగాన పవన్‌కుమార్, పూసపాటిరేగ మండలం కొత్త కొప్పెర్లకు చెందిన ఇనకోటి ముకుంద, ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా మొలగాడకు చెందిన గుంత శుక్ర, శ్రీకాకుళం పెద్దరెల్లి వీధికి చెందిన తుపాకుల అనిల్‌కుమార్, ఎచ్చెర్లకు చెందిన లక్కవరపు పవన్‌కుమార్ నుంచి 22.483 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. శనివారం బాగాన పవన్‌కుమార్, ఇనాకోటి ముకుంద కలిసి ద్విచక్రవాహనంపై ఒడిశా రాష్ట్రం కోరాపుట్ దగ్గర పొత్తంగి వెళ్లి గుంత శుక్ర వద్ద 22.5 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. కిలో రూ.7వేలు చొప్పున కొనుగోలు చేసి.. ఫోన్‌పే ద్వారా నగదు చెల్లించారు. ఈ గంజాయిని అరకేజీ చొప్పున ప్యాకెట్లుగా తయారుచేసి వారు స్నేహితులకు విక్రయిస్తారు. ఈక్రమంలో ఆదివారం పైడిభీమవరంలోని టౌన్‌షిప్ వద్దకు వీరు చేరుకుని, గంజాయి తాగి, గంజాయి ప్యాకెట్లను పంచుకున్నారు. హైదరాబాద్‌లో ఉన్న బాడాన సౌమిత్‌కు, బెంగుళూరులో ఉన్న ఎం.సందీప్‌కు గంజాయిను విక్రయించే క్రమంలో వీరు పోలీసులకు పట్టుబడ్డారు. అలాగే గంజాయి తాగడానికి అలవాటు పడిన లంకలపల్లి దినేష్, ఆళ్ల వెంకటరమణ, సురవరపు వరప్రసాద్, బీ.వీ.వెంటప్రతాప్, ముడిల మోహన్‌వెంకటప్రతాప్‌పై కూడా కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ అవతరాం తెలిపారు. మొత్తంగా పదిమందిని అరెస్టు చేశామన్నారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించడంలో ప్రతిభ చూపిన సీఐ ఎం.అవతారం, ఎస్‌ఐలు ఎస్ చిరంజీవి, జి.లక్ష్మణరావు, ఏఎస్‌ఐ ఎన్.ఉమామహేశ్వరరావు, హెచ్‌సీ కె.కిరణ్‌కుమార్‌సింగ్‌ను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అభినందించారు.