Share News

Bridge: రాధాసాగరంపై వంతెన

ABN , Publish Date - Jun 06 , 2025 | 12:18 AM

Bridge Construction మెళియాపుట్టి మండలంలోని గోకర్ణపురంలో 35ఏళ్ల కిందట రాధాసాగరం గెడ్డపై బ్రిడ్జిని నిర్మించారు. వంతెన ఎత్తు తక్కువగా ఉండడంతో వరదల సమయంలో నీరు పోటు కాసి గోకర్ణపురం గ్రామాన్ని తాకుతోంది. దీంతో ఆ సమయంలో గ్రామస్థులు బయటకు రాలేని పరిస్థితి నెలకొంటోంది.

Bridge: రాధాసాగరంపై వంతెన
గోకర్ణపురం వద్ద బ్రిడ్జిపై వరదనీటి ప్రవాహం ఇలా.. (ఫైల్‌)

  • గోకర్ణపురం వద్ద నిర్మాణానికి శ్రీకారం

  • రూ.90లక్షలు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

  • నెరవేరనున్న దశాబ్దాల కల

  • గ్రామస్థుల్లో ఆనందం

  • మెళియాపుట్టి, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి):

  • ఒడిశాలో భారీ వర్షాలు కురిస్తే చాలు.. ఆ గ్రామం ముంపునకు గురవుతుంది. వరదతో ఆ గ్రామ ప్రజలు అడుగు కూడా బయటకు పెట్టలేరు. బాహ్య ప్రపంచంతో వారికి సంబంధాలు తెగిపోతాయి. వరదలకు కొట్టుకుపోయి గత రెండేళ్లలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. రాధాసాగరం గెడ్డపై బ్రిడ్జి నిర్మించాలని మూడున్నర దశాబ్దాలుగా గ్రామస్థులు కోరుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. వంతెన నిర్మిస్తామని గత వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చి మరిచిపోయింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. అధికారంలోకి వస్తే బ్రిడ్జిని నిర్మిస్తామని చెప్పింది. చెప్పినట్లే బ్రిడ్జి కోసం ఇటీవల రూ.90లక్షలు మంజూరు చేసింది. త్వరలో పనులు ప్రారంభంకానున్నాయి. దీంతో ఎన్నో ఏళ్ల కల నెరవేరనుందని గోకర్ణపురం గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  • ...........................

  • మెళియాపుట్టి మండలంలోని గోకర్ణపురంలో 247 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామ జనాభా 1,246 మంది. ఒడిశాలో భారీ వర్షాలు కురిసే సమయంలో మహేంద్రగిరుల నుంచి వచ్చే వరద నీరు గోకర్ణపురంలోని రాధాసాగరం గెడ్డ ద్వారా ప్రవహించి పలాస మండలం మీదుగా సముద్రంలో కలుస్తుంది. 35ఏళ్ల కిందట అప్పటి ఎమ్మెల్యే కలమట మోహనరావు నిధులు మంజూరు చేసి రాధాసాగరం గెడ్డపై బ్రిడ్జిని నిర్మించారు. అయితే, వంతెన ఎత్తు తక్కువగా ఉండడంతో వరదల సమయంలో నీరు పోటు కాసి గోకర్ణపురం గ్రామాన్ని తాకుతోంది. దీంతో ఆ సమయంలో గ్రామస్థులు బయటకు రాలేని పరిస్థితి నెలకొంటోంది. కొన్నిసార్లు ఇక్కడ ప్రమాదాలు జరిగి పలువురు మృతి చెందారు. 2019 ఎన్నికల్లో రాధాసాగరం గెడ్డపై బ్రిడ్జి నిర్మిస్తామని వైసీపీ నాయకులు హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి ఎమ్మెల్యేగా గెలవడంతో వంతెనపై గ్రామస్థులు ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో గడపగడపకు వైసీపీ కార్యక్రమం కోసం ఆ గ్రామానికి వెళ్లిన అప్పటి ఎమ్మెల్యే రెడ్డి శాంతిని సొంత పార్టీ సర్పంచ్‌ శనపతి రవికుమార్‌తోపాటు గ్రామస్థులు అడ్డుకున్నారు. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము గెలిస్తే వంతెన నిర్మిస్తామని టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావు హామీ ఇచ్చారు. అనుకున్నట్లే ఆయన ఎమ్మెల్యేగా గెలవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇటీవల బ్రిడ్జి నిర్మాణానికి సుమారు రూ.90లక్షలు నిధులు మంజూరు చేసి భూమిపూజ చేశారు. నిధులు సరిపోకపోతే మరో రూ.60 లక్షలతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపించనున్నారు. త్వరలో పాతబ్రిడ్జి స్థానంలో కొత్తది నిర్మించనున్నారు. దీంతో 35 ఏళ్ల నాటి కల నెరవేరనుందని గ్రామస్థులు సంబర పడుతున్నారు.

  • రెండేళ్లలో ముగ్గురి మృతి

    గోకర్ణపురం వద్ద రాధాసాగరం గెడ్డపై గతంలో నిర్మించిన వంతెన తక్కువ ఎత్తులో ఉండడంతో వరదల సమయంలో ఇక్కడ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత రెండేళ్లలో ముగ్గురు మృతి చెందారు. గత ఏడాది గోకర్ణపురం గ్రామానికి చెందిన యవ్వారి శ్రీనివాసరావు నిత్యావసర సరుకుల కోసం గొప్పిలి గ్రామానికి వెళ్లాడు. సరుకులు తీసుకుని ఇంటికి వచ్చేందుకు బ్రిడ్జిని దాటుతున్న సమయంలో ఒక్కసారిగా వరద నీరు రావటంతో కొట్టుకుపోయాడు. మూడు రోజులపాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు గెడ్డలో జల్లెడ పట్టి శ్రీనివాసరావు మృతదేహాన్ని బయటకు తీశారు. అదే ఏడాది నందవ గ్రామానికి చెందిన సవర ధనంజయ్‌ తన ద్విచక్ర వాహనంపై కూరగాయలు అమ్మడానికి వెళ్తూ వరదకు కొట్టుకుపోయాడు. స్థానికులు ఆయన్ను రక్షించారు. రెండేళ్ల కిందట పెదంచల గ్రామానికి చెందిన వ్యక్తితో పాటు గోకర్ణపురం గ్రామానికి చెందిన సరోజిని నీటిలో కొట్టుకుపోయి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణంతో ఇన్నాళ్లకు తమ కష్టాలు తీరనున్నాయని, రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని పేర్కొంటున్నారు.

  • రుణపడిఉంటాం

    బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం ఆనందంగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. దీంతో టీడీపీలో చేరాను. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మా కష్టాలను చూసి వంతెన నిర్మాణానికి నిధులు ఇచ్చారు. 35ఏళ్ల నాటి సమస్యకు పరిష్కారం దొరికింది. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.

    - శనపతి రవికుమార్‌, సర్పంచ్‌, గోకర్ణపురం

Updated Date - Jun 06 , 2025 | 12:18 AM