తాళాలు పగలగొట్టి.. బీరువాలు ఎత్తుకెళ్లి
ABN , Publish Date - Sep 20 , 2025 | 11:31 PM
Theft of gold, silver jewelry, cash ఆమదాలవలస పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన బంగారు ఆభరణాల చోరీ కేసుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద 574 గ్రా. బంగారం, 6.8 కేజీల వెండి, రూ.2.43లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం శ్రీకాకుళంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మహేశ్వరరెడ్డి వెల్లడించారు.
బంగారు, వెండి నగలు, నగదు అపహరణ
ఇద్దరు దొంగలను అరెస్టు చేసిన పోలీసులు
574 గ్రా. బంగారం, 6.8 కేజీల వెండి, రూ.2.43 లక్షలు స్వాధీనం
శ్రీకాకుళం క్రైం, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): ఆమదాలవలస పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన బంగారు ఆభరణాల చోరీ కేసుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద 574 గ్రా. బంగారం, 6.8 కేజీల వెండి, రూ.2.43లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం శ్రీకాకుళంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మహేశ్వరరెడ్డి వెల్లడించారు. ‘ఆమదాలవలస ఎస్‌ఐ, సిబ్బందితో పార్వతీశునిపేట జంక్షన్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమాన్పాదంగా తిరుగుతున్న కుప్పిలి రాజు అలియాస్ బ్లేడుగాడు, కుప్పిలి నరసింగరావు అలియాస్ చెంచుగాడు కనిపించారు. వారిద్దరినీ విచారించగా వారు 26 కేసుల్లో నిందితులుగా ఉన్నట్టు తేలింది. వీరు ప్రధానంగా నిద్రపోతున్న వ్యక్తుల మెడలో బంగారం అపహరిస్తారు. అలాగే ఇంటి తలుపుల తాళాలు విరగ్గొట్టి బీరువాల్లో బంగారం, వెండి వస్తువులు, డబ్బును దొంగిలిస్తూ చోరీలకు పాల్పడుతుంటారు. ఒక్కోసారి బీరువాను పట్టుకునిపోయి పొలాల్లోకి తీసుకెళ్లి తాళాలు విరగొట్టి అందులో ఉన్న వస్తువులను దొంగిలిస్తారు. వీరిద్దరికి సంతకవిటి పోలీస్‌స్టేషన్ పరిధిలో సస్పెట్ షీట్‌లు కూడా ఉన్నాయి. ఆమదాలవలస, బూర్జ, సరుబుజ్జిలి, జలుమూరు, పొందూరు, శ్రీకాకుళం టూటౌన్, పాతపట్నం, కోటబొమ్మాళి ప్రాంతాల్లో జరిగిన దొంగతనాల కేసుల్లో కూడా నిందితులుగా ఉన్నారు. ఆరేడు నెలలుగా వారి కోసం గాలిస్తున్నాం. వారిని అరెస్టు చేస్తే బ్లేడుతో గొంతుకోసుకుని మరణిస్తామని కుటుంబ సభ్యులు బెదిరిస్తుంటారు. డీఎస్పీ వివేకానంద ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. వారిని అరెస్టు చేశాం. మొత్తం 618 గ్రాముల బంగారానికిగాను 574 గ్రాములను, ఏడు కేజీల వెండికిగాను 6.8 కేజీలను, రూ.3.7 లక్షలకుగానూ రూ.2.34 లక్షల నగదును రికవరీ చేశామ’ని ఎస్పీ తెలిపారు.