Share News

సాగునీటి పనులకు బ్రేక్‌

ABN , Publish Date - Dec 16 , 2025 | 12:19 AM

Narayanapuram, Vamsadhara works stay జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆయకట్టును స్థిరీకరించాల్సిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరికొన్ని పూర్తిగా పడకేశాయి.

సాగునీటి పనులకు బ్రేక్‌
కళింగపట్నం వద్ద వంశధార నదిపై అసంపూర్తిగా రక్షణ గోడ..

  • నిలిచిన నారాయణపురం, వంశధార పనులు..

  • చెతులెత్తేసిన కాంట్రాక్టర్లు

  • పూర్తయినవాటికీ మోక్షం లేని బిల్లులు

  • అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు

  • ఆందోళనలో రైతులు

  • శ్రీకాకుళం, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆయకట్టును స్థిరీకరించాల్సిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరికొన్ని పూర్తిగా పడకేశాయి. నిధుల కొరతో, పెండింగ్‌ బిల్లుల భయమో కానీ.. కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే వదిలేశారు. నారాయణపురం ఆనకట్ట నుంచి మైనర్‌ ఇరిగేషన్‌ వరకు ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా వెలుగు చూసిన నీటిపారుదల శాఖ నివేదిక జిల్లాలోని సాగునీటి రంగం దుస్థితికి అద్దం పడుతోంది.

  • నారాయణపురం పనులకు గ్రహణం..

  • జిల్లా రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్న నారాయణపురం ఆనకట్ట పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి.

  • ప్యాకేజీ-ఏ: ఆనకట్ట హెడ్‌ వర్క్స్‌, ఎడమ ప్రధాన కాలువ పనులకు జైకా నిధులు రూ.62.46 కోట్లు మంజూరయ్యాయి. కానీ కాంట్రాక్టర్‌ కేవలం 35 శాతం పనులు మాత్రమే పూర్తిచేశారు.

  • ప్యాకేజీ-బి : కుడి ప్రధాన కాలువ పరిస్థితి కూడా ఇంతే. రూ. 49.64 కోట్లతో పనులు చేపట్టాల్సి ఉండగా.. 45 శాతం పనులు పూర్తయ్యాక కాంట్రాక్టర్‌ చేతులెత్తేశారు. దీంతో చివరి ఆయకట్టుకు నీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు.

  • పూర్తయినా.. పైసా రాలే..!

  • మరో విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే.. పనులు వందశాతం పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లించలేదు. బూర్జ మండలంలోని నారాయణపురం ఆనకట్ట వద్ద టీపీఆర్‌ పనులు, హెడ్‌ స్లూయిస్‌, స్కవరింగ్‌ స్లూయిస్‌(సుమారు రూ.1.86కోట్లు) శతశాతం పూర్తయ్యాయి. పని పూర్తయి చాలా రోజులవుతున్నా ఇంతవరకు బిల్లులు చెల్లించాల్సి ఉందని అధికారులే నివేదికలో పేర్కొనడం గమనార్హం. బిల్లులు రావన్న భయంతోనే మిగతా పనులకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదన్న వాదనకు ఇది బలం చేకూరుస్తోంది.

  • విజిలెన్స్‌ ఉచ్చులో రెల్లిగడ్డ

  • పొందూరు మండలం కొల్లిపేట నుంచి ఆమదాలవలస మండలం నెల్లిమెట్ట వరకు ఉన్న ‘రెల్లిగెడ్డ నేచురల్‌ డ్రైన్‌’ అభివృద్ధి పనులు (రూ.8.90కోట్లు) 55 శాతం పూర్తయ్యాయి. దీనిపై విజిలెన్స్‌ కేసు ఉండటంతో కాంట్రాక్టర్‌ పనులను నిలిపివేశారు. మిగిలిన పనుల కోసం రూ.22.92 కోట్లతో మళ్లీ అంచనాలు తయారుచేసి చీఫ్‌ ఇంజనీర్‌ కమిటీ ఆమోదం కోసం పంపామని అధికారులు చెబుతున్నారు. కానీ ఈలోపు వర్షాలు వస్తే ముంపు ముప్పు తప్పదని రైతులు వాపోతున్నారు.

  • అన్నీ.. అసంపూర్తిగానే

  • వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట వద్ద మత్స్యకారుల కోసం చేపట్టిన ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ పనులు (రూ.11.95 కోట్లు) 40 శాతానికే పరిమితమయ్యాయి. గార మండలం కళింగపట్నం వద్ద వంశధార నదిపై రక్షణ పనులు కూడా అసంపూర్తిగానే మిగిలాయి. అలాగే ఏపీఐఎల్‌ఐపీ ప్యాకేజీలు ఏడు మంజూరు కాగా, ఒకటి మాత్రమే పూర్తయింది. మిగిలిన ఆరు పనులు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో రైతులు, మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు అన్ని పనుల రిమార్క్స్‌ కాలమ్‌లో ‘కాంట్రాక్టర్లు పనులను నిలిపివేశారు’ అని ఉండటం గమనార్హం. అసలు కాంట్రాక్టర్లు ఎందుకు పనులు ఆపేస్తున్నారు? వారికి సకాలంలో బిల్లులు రావడం లేదా? లేక అధికారుల పర్యవేక్షణ లోపించిందా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి నిధుల విడుదల చేసి కాంట్రాక్టర్లతో పనులు పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు.

  • ప్రాజెక్టు పేరు మంజూరు (రూ.కోట్లలో) పూర్తయిన శాతం ప్రస్తుత స్థితి

  • ------------------------------------------------------------------------------------------------------------------

  • నారాయణపురం (ప్యాకేజీ-ఏ) 62.46 35 ఆగిపోయింది

  • నారాయణపురం (ప్యాకేజీ-బి) 49.64 45 ఆగిపోయింది

  • ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ 11.95 40 ఆగిపోయింది

  • రెల్లిగెడ్డ డ్రైన్‌ 8.90 55 విజిలెన్స్‌ కేసు

  • ఆనకట్ట మరమ్మతులు 1.86 100 బిల్లులు పెండింగ్‌

  • ------------------------------------------------------------------------------------------------------------

Updated Date - Dec 16 , 2025 | 12:19 AM