Share News

fisher man: ఒడ్డుకు చేరిన బోట్లు

ABN , Publish Date - Apr 20 , 2025 | 12:49 AM

Boats Shore Docking సముద్రంలో మోటారు, మరబోట్లతో చేపల వేట నిషేధంఅమల్లోకి వచ్చింది. వేటకు విరామంతో మత్స్యకారులంతా బోట్లను ఒడ్డుకు చేర్చారు. వలలను సరి చేసుకుంటున్నారు. బోట్లు, వలలతోపాటు ఇతర సామగ్రిని సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుస్తున్నారు.

fisher man:  ఒడ్డుకు చేరిన బోట్లు
ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశంలో ఒడ్డుకు చేర్చిన బోట్లు

  • - సురక్షిత ప్రాంతాలకు వలలు

  • - స్వగ్రామాలకు చేరుకుంటున్న మత్స్యకారులు

  • ఎచ్చెర్ల, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): సముద్రంలో మోటారు, మరబోట్లతో చేపల వేట నిషేధంఅమల్లోకి వచ్చింది. వేటకు విరామంతో మత్స్యకారులంతా బోట్లను ఒడ్డుకు చేర్చారు. వలలను సరి చేసుకుంటున్నారు. బోట్లు, వలలతోపాటు ఇతర సామగ్రిని సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుస్తున్నారు. మరోవైపు గతేడాది జూలై, ఆగస్టు నెలల్లో గుజరాత్‌, కర్ణాటక తదితర ప్రాంతాలకు వలస వెళ్లిన మత్స్యకారులంతా చేపల వేట నిషేధం కారణంగా స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. కాగా వేట నిషేధ సమయంలో తమకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది వైసీపీ ప్రభుత్వం మత్స్యకార భరోసా ప్రకటించినా.. తమకు డబ్బులు ఇవ్వలేదని వాపోతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం రెట్టింపు సాయం అందజేస్తామని ప్రకటించడంతో కాస్త ఊరట చెందుతున్నారు.

  • జిల్లాలో ఇదీ పరిస్థితి

  • జిల్లాలోని ఎచ్చెర్ల, రణస్థలం, గార, శ్రీకాకుళం రూరల్‌, ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి మండలాల్లో 104 సముద్ర తీర గ్రామాలు ఉన్నాయి. ఆరువేల మందికిపైగా మత్స్యకారులు వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సముద్రంలో చేపలు గుడ్లు పెట్టే దశలో మోటారు, మెకనైజ్డ్‌ బోట్లతో వేటాడితే మత్స్య సంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలో ఏటా రెండు నెలల పాటు.. సముద్రంలో చేపల వేట నిషేధాన్ని అమలు చేస్తున్నారు. ఈ నెల 14న అర్ధరాత్రి నుంచి చేపల వేట విరామం అమల్లోకి రాగా.. జూన్‌ 14 అర్ధరాత్రి వరకు ఇది కొనసాగనుంది. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. దీంతో మత్స్యకారులంతా వేటకు దూరమై.. బోట్లు, వలలు భద్రపరిచే పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడంతో జిల్లాలో మోటారు బోట్లతో చేపలు వేటాడేవారి సంఖ్య పెరిగింది. ప్రతీ తీర గ్రామంలో కూడా 20 వరకు మోటారు బోట్లు ఉన్నాయి. సుమారు రూ.3లక్షల విలువ చేసే పైబర్‌ బోటును ఇద్దరు, ముగ్గురు మత్స్యకారులు కలిసి కొనుగోలు చేసి చేపలు వేటాడుతుంటారు. ఒక్క బోటుపై సుమారు 8 మంది మత్స్యకారులు చేపల వేటకు వెళ్తుంటారు. వేట నిషేధం కావడంతో దాదాపుగా అందరికీ పనిలేకుండా పోయింది. ఈ పరిస్దితుల్లో చేపలు వేటపై జీవనం సాగిస్తున్నవారందరికీ భరోసా అందజేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. అన్‌ సీజన్‌ కావడంతో సంప్రదాయ తెప్పలతో వేటాడినా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. ప్రస్తుతం కొంతమంది మత్స్యకార మహిళలు చెరువు చేపలను కొనుగోలు చేసి విక్రయించినా.. కష్టానికి తగిన ప్రతిఫలం రావడం లేదని ఆవేదన చెందుతున్నారు.

  • పూర్తిస్థాయిలో ఉపాధి లేక..

    తీర గ్రామాల్లో ఉపాధి పనులు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. తీర ప్రాంతాల్లో చెరువులు, కాలువలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఉపాధి పనులు చేపట్టేందుకు పెద్దగా అవకాశం ఉండడంలేదు. జాబ్‌ కార్డు ఉన్న ఒక్కో కుటుంబానికి 40 నుంచి 50 రోజులకు మించి ఉపాధి పనులు కల్పించని పరిస్థితి ఉంది. పక్క గ్రామాలకు వెళ్లి ఉపాధి పనుల్లో పాల్గొందామన్నా వెళ్లి రావడం కష్టమవుతోందని మత్స్యకారులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి పూర్తిస్థాయిలో ఉపాధి పనులు కల్పించాలని మత్స్యకారులు కోరుతున్నారు. అలాగే అర్హులందరికీ మత్స్యకార భరోసా సాయం అందజేసేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

  • గతేడాది భరోసా ఇవ్వలేదు

    గతేడాదికి సంబంధించి మత్స్యకార భరోసా ఇవ్వలేదు. ఈ రెండేళ్లు కలిపి ఒకేసారి భరోసా మొత్తం అందజేస్తే మత్స్యకార కుటుంబాలకు ఎంతో ఊరట కలుగుతుంది. మర, మోటారు బోట్లలో వేట నిషేధంతో సంప్రదాయ తెప్పలపై వేటాడి ఉపాధి పొందాలి.

    - గనగళ్ల అప్పన్న, మత్స్యకారుడు, డి.మత్స్యలేశం

    ................

  • ప్రభుత్వమే ఆదుకోవాలి

    2 నెలలపాటు సముద్రంలో చేపల వేట నిషేధించారు. వేరే ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకునేందుకు మదుపు పెట్టే పరిస్థితిలో లేము. ప్రభుత్వమే మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలి. నిషేధం సమయంలో గతంలో మాదిరిగా బియ్యాన్ని పంపిణీ చేయాలి.

    - మైలపల్లి రాజు, మత్స్యకారుడు, డి.మత్స్యలేశం

Updated Date - Apr 20 , 2025 | 12:49 AM