నాగావళిలో బయోమెడికల్
ABN , Publish Date - Oct 09 , 2025 | 12:04 AM
శ్రీకాకుళం నగరంలో దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న నాగావళి నది.. వ్యర్థాలతో కలుషితమవుతోంది.
-నదిలో ప్రైవేటు ఆస్పత్రుల వ్యర్థాలు
-ఇటీవల కలెక్టర్ పరిశీలన.. చర్యలకు ఆదేశం
-నోటీసులిచ్చేందుకు అధికారుల సన్నద్ధం
శ్రీకాకుళం అర్బన్, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరంలో దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న నాగావళి నది.. వ్యర్థాలతో కలుషితమవుతోంది. ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా బయోమెడికల్ వ్యర్థాలు పారబోస్తున్నారు. ప్రజలు సైతం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ.. నదిలో చెత్త పడేస్తున్నారు. శ్రీకాకుళంలో పేరుమోసిన ఆస్పత్రులు, సాధారణ క్లీనిక్‌లు సుమారు 70కు పైగా ఉన్నాయి. ఆసుపత్రి నిర్వహణలో రోజుకు టన్ను వరకు చెత్త లభ్యమవుతుంది. కానీ అలా లభ్యమవుతున్న బయోమెడికల్ వ్యర్థాలను నిబంధనలు మేరకు తరలించడం లేదు. వాటిని నాగావళి నదిలో విడిచిపెడుతున్నారన్న విమర్శలున్నాయి. అలాగే కొత్త బ్రిడ్జి, గుజరాతీపేట, బలగమెట్టు, ఏడురోడ్ల జంక్షన్, కలెక్టర్ ఆఫీస్, డీసీసీబీ కాలనీ.. ఇలా అన్నిచోట్ల వ్యర్థాలు కనిపిస్తున్నాయి. వీటికితోడు నగరంలోని చికెన్, మటన్, దుకాణాలు, హోటళ్ల వద్ద వ్యర్థాలను సైతం నదిలో పారబోస్తున్నారు. దీంతో నది పూర్తిగా కలుషితం అవుతోంది. బయో మెడికల్ వ్యర్థాల్లో చాలారకమైన బ్యాక్టీరియా, వైరస్ రోగ కారకాలు వ్యాపించి చాలామంది ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు.
ఖచ్చితంగా ఇలా చేయాల్సిందే...
ఆస్పత్రుల్లో సాధారణంగా వ్యాధి నిర్ధారణ, చికిత్సలో దూది, సూది, సిరంజీ వంటివి ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఒకసారి వాడిన తర్వాత ఇవి వ్యర్థాల జాబితాలో చేరుతాయి. వైద్య ఆరోగ్య పరిభాషలో వాటిని జీవవైద్య వ్యర్థాలుగా పరిగణిస్తారు. వీటి నిర్వహణ సరిగా లేకపోతే ప్రజారోగ్యానికి పెను ప్రమాదమే. వీటిని శాస్ర్తీయ విధానాల్లో వర్గీకరించాలి. సురక్షితంగా తరలించాలి. తర్వాత శుద్ధి చేయాలి. అలా శుద్ధి చేయడానికి వీల్లేని వ్యర్థాలను భూమి లోపల పాతాలి. కానీ ఈ ప్రక్రియ ఏదీ జరగడం లేదు. చాలా ఆసుపత్రుల్లో వీటిని భ ద్రపరిచేందుకు గదులు లేవు. ప్రత్యేక విభాగాలు లేవు. దీంతో సూదులు, సిరంజీలు, మాస్క్‌లు, దూది, చేతి తొడుగులు, బ్లడ్ బ్యాగ్‌లు, రక్తపరీక్ష పరికరాలు, కణజాలం, గ్లూకోజ్ బాటిళ్లు, వైర్లు, పీపీఈ కిట్లు వంటి వాటిని కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా పడేస్తున్నాయి.
ఇటీవల శ్రీకాకుళం నగర పరిధిలోని నాగావళి నదిలో స్వచ్ఛోత్సవ్ నిర్వహించారు. కొత్త బ్రిడ్జి సమీపంలోఒక చోట గుట్టగుట్టలుగా ఆసుపత్రి వ్యర్థాలు కనిపించాయి. దీనిపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యర్థాల నిర్వహణను సక్రమంగా చేపట్టని ఆసుపత్రులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు ఆస్పత్రుల యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చేందుకు కార్పొరేషన్ అధికారులు సిద్ధమవుతున్నారు. పారిశుధ్య నిర్వహణను పాటించని వారి నుంచి భారీ జరిమానా వసూలు చేయనున్నారు.
ఆసుపత్రులకు నోటీసులు
వ్యర్థాల కారణంగా నాగావళి నది కలుషితం అవుతుంది. బయోమెడికల్ వ్యర్థాలను విడిచిపెడుతున్న ప్రైవేటు ఆస్పత్రులు యాజమాన్యాలకు స్పష్టమైన నోటీసులు జారీ చేశాం. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు. దీనిపై కాలుష్య నియంత్రణ అధికారులు సైతం దృష్టిపెట్టాలి.
- ప్రసాదరావు, కమిషనర్, శ్రీకాకుళం కార్పొరేషన్