Share News

Bio medical : ‘భయో’ మెడికల్‌!

ABN , Publish Date - Aug 08 , 2025 | 11:51 PM

Hospitals that do not comply with regulations ఆస్పత్రుల నిర్వహణలో బయోకెమికల్‌, మెడికల్‌ వ్యర్థాల నిర్వహణ ప్రధానమైనది. కానీ కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు ఈ రెండు అంశాలు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రజారోగ్యానికి భంగం కలిగిస్తున్నాయి.

Bio medical : ‘భయో’ మెడికల్‌!

  • ఇష్టారాజ్యంగా వ్యర్థాల నిర్వహణ

  • నిబంధనలు పాటించని ఆస్పత్రులు

  • ప్రజారోగ్యానికి ముప్పు

  • శ్రీకాకుళం డేఅండ్‌నైట్‌ జంక్షన్‌ కూడలిలో పేరుమోసిన ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. కానీ వాటిలో బయో కెమికల్‌ వ్యర్థాల నిర్వహణ అనేది తూతూమంత్రంగా జరుగుతోందన్న విమర్శలున్నాయి. సమీపంలో నాగావళి నదిలో నిత్యం ఈ బయో వ్యర్థాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వాస్తవానికి వీటిని శుద్ధి చేయాలి. లేదంటే భూమిలో లోతుగా పాతాలి. కానీ ఇదెక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. ఏ వ్యాధుల నియంత్రణకు ఔషధాలుగా వాడుతారో.. అవే బయో వ్యర్థాలుగా మారి ప్రజారోగ్యానికి తీవ్ర భంగం కలిగిస్తున్నాయి.

  • రణస్థలం, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ఆస్పత్రుల నిర్వహణలో బయోకెమికల్‌, మెడికల్‌ వ్యర్థాల నిర్వహణ ప్రధానమైనది. కానీ కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు ఈ రెండు అంశాలు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రజారోగ్యానికి భంగం కలిగిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 500 ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. శ్రీకాకుళం నగరంలోనే సుమారు 100 ఆస్పత్రులు ఉన్నాయి. మరోవైపు పలాస-కాశీబుగ్గ, నరసన్నపేట, టెక్కలి, సోంపేట, ఇచ్ఛాపురం, పాతపట్నం వంటిచోట్ల ఎక్కువగా ఉన్నాయి. అయితే రోగులకు వైద్యసేవలు అందించడం ఎంత ముఖ్యమో.. వినియోగించే ఔషధాలు, మందులు, వాడిన సామగ్రిని సంరక్షిస్తూ..వ్యర్థాల నిర్వహణ అంతే అవసరం. కానీ జిల్లాలో చాలా ఆస్పత్రుల్లో వ్యర్థాల నిర్వహణ అనేది సక్రమంగా జరగడం లేదు. కొన్ని ఆస్పత్రులు మునిసిపల్‌, పంచాయతీ పారిశుధ్య కార్మికులతో ఒప్పందం చేసుకొని వారికి కొంతమొత్తం అందించి డంపింగ్‌ యార్డులకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. డంపింగ్‌ యార్డులకు వెళ్తున్న బయో మెడికల్‌ వ్యర్థాలతో ప్రజారోగ్యానికి తీరని భంగం కలుగుతోంది. బయో మెడికల్‌ వ్యర్థాల్లో చాలారకమైన బ్యాక్టీరియా, వైరస్‌, రోగ కారకాలు వ్యాపించి.. చాలామంది ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. బయో మెడికల్‌ వ్యర్థాల కారణంగా గాలి, నీరు, నేల సైతం కలుషితం అవుతున్నాయి.

  • అంతటా జీవ వైద్య వ్యర్థాలు..

  • సాధారణంగా వ్యాధి నిర్థారణ, చికిత్సలో దూది, సూది, సిరంజీ వంటివి ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఒకసారి వాడిన తరువాత ఇవి వ్యర్థాల జాబితాలో చేరుతాయి. అయితే వైద్య ఆరోగ్య పరిభాషలో వీటిని జీవ వైద్య వ్యర్థాలుగా పరిగణిస్తారు. వీటి నిర్వహణ సరిగ్గా లేకపోతే ప్రజారోగ్యానికి పెను ప్రమాదమే. వాస్తవానికి వీటిని శాస్త్రీయ విధానాల్లో వర్గీకరించాలి. సురక్షితంగా తరలించాలి. తరువాత శుద్ధి చేయాలి. అలా శుద్ధి చేయడానికి వీలులేని వ్యర్థాలను భూమి లోపల పాతాలి. కానీ ఈ ప్రక్రియ ఏదీ జరగడం లేదు. చాలా ఆస్పత్రుల్లో వీటిని భద్రపరిచేందుకు గదులు లేవు. ప్రత్యేక విభాగాలు లేవు. దీంతో సూదులు, సిరంజీలు, మాస్కులు, దూది, చేతి తొడుగులు, బ్లడ్‌ బ్యాగులు, రక్తపరీక్ష పరికరాలు, కణజాలం, గ్లూకోజ్‌ బాటిళ్లు, వైర్లు, పీపీఈ కిట్లువంటి వాటిని కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా పడేస్తున్నాయి. జిల్లాలో చాలా ఆస్పత్రుల వద్ద పరిశీలిస్తే వెనుక భాగంలో, రోడ్లపై పారబోస్తున్నారు. నదులు, చెరువులు, నిర్జీన ప్రదేశాల్లో ఈ బయో మెడికల్‌ వ్యర్థాలు ఎక్కడికక్కడే కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఎప్పటికప్పుడు ఆస్పత్రులను కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తనిఖీ చేయాలి. ఈ విషయంలో స్థానిక సంస్థలు సైతం బాధ్యతగా పనిచేయాలి. కానీ జిల్లాలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బయోమెడికల్‌ వ్యర్థాల నియంత్రణపై దృష్టి సారించాలని జిల్లావాసులు కోరుతున్నారు.

  • స్పష్టమైన ఆదేశాలు

  • జిల్లాలో ఆస్పత్రుల నిర్వహణకు సంబంధించి యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. బయో మెడికల్‌ వ్యర్థాల నిర్వహణకు సంబంధించి నిబంధనలు పాటించాల్సిందే. లేదంటే చర్యలు తప్పవు. ఈ విషయంలో కాలుష్య నియంత్రణ అధికారులు సైతం దృష్టిపెట్టాలి.

  • - కళ్యాణబాబు, డీసీహెచ్‌ఎస్‌, శ్రీకాకుళం

Updated Date - Aug 08 , 2025 | 11:51 PM