Share News

పాములతో జాగ్రత్త

ABN , Publish Date - Nov 14 , 2025 | 11:49 PM

Increasing snakebite incidents జిల్లాలో పాముకాటు బాధితుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత ఆరు నెలల వ్యవధిలో పాముకాటుకు గురై 50 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క ఎల్‌ఎన్‌పేట మండలంలోనే ఈ ఏడాది జూలైలో 26మంది పాముకాటుకు బలయ్యారు. ఎక్కువగా గిరిజనులు, రైతులే బాధితులు. జిల్లాలో ఏటా 2 వేల మంది వరకూ పాముకాటుకు గురవుతున్నారు.

పాములతో జాగ్రత్త

  • జిల్లాలో పెరుగుతున్న పాముకాటు ఘటనలు

  • ఆరు నెలల్లో 50 మంది మృతి

  • వరి కోతల సమయంలోనే అధికం

  • రైతులు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు

  • రణస్థలం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి):

  • ఈ నెల 10న జలుమూరు మండలం యాతపేట గ్రామానికి చెందిన వాడ సింహాచలం పాముకాటుతో మృతిచెందాడు. పొలం పనులు చేస్తుండగా పాముకాటు వేయడంతో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందాడు.

  • ఈ ఏడాది సెప్టెంబరు 11న ఎల్‌ఎన్‌పేట మండలం బసవరాజుపేటకు చెందిన వాన అప్పలనాయుడు పాముకాటుతో మృతిచెందాడు. పొలం పనులు చేస్తుండగా పాముకాటు వేయడంతో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కుటుంబసభ్యులు హిరమండలం పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందాడు.

  • ..ఇలా జిల్లాలో పాముకాటు బాధితుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత ఆరు నెలల వ్యవధిలో పాముకాటుకు గురై 50 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క ఎల్‌ఎన్‌పేట మండలంలోనే ఈ ఏడాది జూలైలో 26మంది పాముకాటుకు బలయ్యారు. ఎక్కువగా గిరిజనులు, రైతులే బాధితులు. జిల్లాలో ఏటా 2 వేల మంది వరకూ పాముకాటుకు గురవుతున్నారు. 400 మంది వరకూ ప్రాణాలు కోల్పోతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో ఎక్కువగా కట్లపాము, రక్తపింజరి, నాగుపాములే ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. పొలాల్లో పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా కాటు వేస్తాయి. అందుకే పొలంలో పనిచేసేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు.

  • వైద్యం అందక.. మూల్యం

  • పాముకాటు వేసిన వెంటనే సకాలంలో వైద్యసేవలందక ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. బాధితుల్లో 70 శాతం మంది నాటు వైద్యంపై ఆధారపడుతున్నారు. ప్రాణాలు కాపాడే విలువైన సమయాన్ని చేజేతులా జారవిడుస్తున్నారు. పాముకాటుకు విరుగుడుగా ఇచ్చే ‘పాలీవేలెంట్‌ యాంటీ వినమ్‌’ శాస్త్రీయంగా నిరూపితమైన మందు. స్థానికంగా ఉండే పీహెచ్‌సీల్లో యాంటీ వినమ్‌ అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటిస్తోంది. కానీ చాలా పీహెచ్‌సీల్లో ఉండడం లేదన్న విమర్శ ఉంది. సీహెచ్‌సీలతో పాటు ఏరియా ఆస్పత్రిల్లో యాంటీవినమ్‌ అందుబాటులో ఉన్నప్పటికీ.. అది మొదటి 5-10 డోసులకే పరిమితమవుతోంది. తరువాత బాధితులను జిల్లా కేంద్రాస్పత్రికి తరలించాల్సి వస్తోంది. చికిత్స ఆలస్యం కావడం, విషం తీవ్రత బట్టి డోసుల మోతాదు మారుతూ ఉంటుంది. పాముకాటుకు గురైన బాధితుడికి మూడు గంటల్లోపు శరీరంలో విష తీవ్రత బట్టి యాంటీ వినమ్‌ డోసులను అందిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు. ఆపై దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా అడ్డుకట్ట వేయవచ్చు. జిల్లాలో 60 పీహెచ్‌సీలతో పాటు 104 వాహనాలు 55 ద్వారా ప్రజలకు వైద్యసేవలందుతున్నాయి. వీటిలో పూర్తిస్థాయిలో యాంటీవీనమ్‌ మందును అంబాటులో ఉంచితే పాముకాటు మృతుల సంఖ్యను తగ్గించవచ్చు.

  • ఇవి చేయాలి

  • పాముకాటు బారినపడకుండా ఉండాలంటే ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.

  • ఇంటి పరిసరాల్లో వస్తువులు, ధాన్యం రాశులు, సంచులు తదితర వాటిలో మురుగు లేకుండా చూసుకోవాలి.

  • పిల్లలను పుట్టలు, గుట్టలు దగ్గర ఆటలు ఆడకుండా చూసుకోవాలి.

  • రైతులు తమ పశువుల శాలల్లో పశువులను కట్టినప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

  • పొలాలకు వెళ్లినప్పడు చేతిలో కర్రతో పాటు వినికిడి శబ్దాలు చేసే పరికరాలు తమ వద్ద ఉంచుకోవాలి.

  • రాత్రి, తెల్లవారుజాము సమయంలో పొలాలకు వెళ్లే వారు విధిగా తమవెంట టార్చ్‌లైట్లు అందుబాటులో ఉంచుకోవాలి.

  • మట్టి, పెంకుటిళ్లకు ఎక్కడా రంధ్రాలు లేకుండా చూసుకోవాలి.

  • అప్రమత్తంగా ఉండాలి

  • పాముకాటు వేస్తే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. నాటు వైద్యం అత్యంత ప్రమాదకరం. ఆలస్యం చేస్తే ప్రాణాలకే ముప్పు. అన్నింటికీ మించి బాధితులు ధైర్యంతో ఉండాలి. పాముకాటు వేసిన వెంటనే విష ప్రసరణ జరగకుండా అడ్డుకట్ట వేయాలి. తాడుతో గాయాన్ని కట్టి వేయాలి. పాముకాటు వేసిన మూడు గంటల్లో ఇంజక్షన్‌ అందిస్తే ప్రాణాపాయం ఉండదు. ప్రభుత్వాస్పత్రిలో యాంటీ వీనమ్‌ డోసులు అందుబాటులో ఉంటాయి.

  • - డాక్టర్‌ యుగంధర్‌, కొండములగాం సీహెచ్‌సీ, రణస్థలం

Updated Date - Nov 14 , 2025 | 11:49 PM