డబ్బులు డిమాండ్ చేసిందని..
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:54 AM
నగరంలోని ఏఎస్‌ఎన్ కాలనీకి చెందిన గురుగుబిల్లి సీతారత్నం అనే మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది.
- మహిళను చంపేశాడు
- వీడిన హత్యకేసు మిస్టరీ.. ఒకరి అరెస్టు
శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): నగరంలోని ఏఎస్‌ఎన్ కాలనీకి చెందిన గురుగుబిల్లి సీతారత్నం అనే మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. డబ్బులు డిమాండ్ చేసిందనే కారణంతో నరసన్నపేట మండలం శాంతపేట వీధికి చెందిన గొల్లపల్లి ప్రశాంత్‌కుమార్ ఆమెను చంపేశాడు. ఈ మేరకు పోలీసులు ప్రశాంత్‌కుమార్‌ను అరెస్టు చేశారు. ఈ వివరాలను ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మహేశ్వరరెడ్డి విలేకరులకు వెల్లడించారు. సీతారత్నం, ప్రశాంత్‌కుమార్ గత రెండేళ్లుగా చనువుగా ఉంటున్నారు. ఈ నెల 2న సాయంత్రం నాలుగు గంటలకు సీతారత్నం.. ప్రశాంత్‌కుమార్‌కు ఫోన్‌చేసి డేఅండ్‌నైట్ జంక్షన్ వద్దకు రమ్మంది. సాయంత్రం ఆరు గంటలకు ప్రశాంత్‌కుమార్ కారు తీసుకొచ్చి కొత్త బ్రిడ్జిపై నడుచుకొని వెళుతున్న సీతారత్నంను వాహనంలో ఎక్కించుకున్నాడు. సింహద్వారం నుంచి కొత్త రోడ్డువైపు సర్వీస్ రోడ్డులోకి వెళ్లి ఎవరూ లేని చోట కారుని ఆపారు. ‘నాకు రూ.50 వేలు కావాలని, ఇవ్వకపోతే మన మధ్య ఉన్న సంబంధాన్ని నీ భార్యకు చెబుతానని’ సీతారత్నం ప్రశాంత్‌ను బెదిరించింది. దీంతో ఎప్పటికైనా తనకు ఇబ్బంది ఉంటుందని ప్రశాంత్‌కుమార్ భావించి సీతారత్నం మెడకు ఆమె చీరకొంగు, పుస్తెలతాడును బిగించి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఎచ్చెర్ల మండలం కింతలి మిల్లు జంక్షన్ వద్ద జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో పడేశాడు. ఆమె పుస్తెలతాడు, సెల్‌ఫోన్‌ను తీసుకొని పరారయ్యాడు. మృతురాలి కుమారుడు వెంకటరమణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు, సీతారత్నం కాల్‌డేటా, వాట్సాప్ కాల్స్ ఆధారంగా ప్రశాంత్‌కుమార్‌ను నిందితుడిగా గుర్తించారు. ఈ మేరకు ఆదివారం జర్జాం జంక్షన్‌లోని గాయత్రీ డాబా వద్ద ఉన్న ప్రశాంత్‌కుమార్‌ను ఎచ్చెర్ల ఎస్‌ఐ, సిబ్బంది పట్టుకుని అరెస్టు చేశారు. డీఎస్పీ సీహెచ్.వివేకానంద పర్యవేక్షణలో కేసును చేధించడంలో ప్రతిభ కనబరిచిన జేఆర్‌పురం సీఐ అవతారం, ఎస్‌ఐలు సందీప్, లక్ష్మణరావు, మోహిని, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.