Share News

ఉద్దానంలో ఎలుగుబంట్లు హల్‌చల్‌

ABN , Publish Date - Aug 11 , 2025 | 12:05 AM

మందస మండలం లోహరిబంద పంచాయతీ చిన్నలోహరిబంద, కొత్తపేట, దుమ్మూలూరు తదితర గ్రామాల పరిధిలో ఎలుగుబంట్లు సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

ఉద్దానంలో ఎలుగుబంట్లు హల్‌చల్‌

హరిపురం, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): మందస మండలం లోహరిబంద పంచాయతీ చిన్నలోహరిబంద, కొత్తపేట, దుమ్మూలూరు తదితర గ్రామాల పరిధిలో ఎలుగుబంట్లు సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆదివారం సాయంత్రం రెండు ఎలుగుబంట్లు చిన్నలోహరిబంద గ్రామంలోనే మకాం వేసి వీరంగం సృష్టించాయి. గతేడాది ఎర్రముక్కాం, దున్నూరు గ్రామాల్లో ఎలుగు సృష్టించిన బీభత్సాన్ని మరవకముందే ప్రస్తుతం రాత్రి, పగలు తేడాలేకుండా గ్రామాల్లోకి వస్తుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రాత్రి ఆరుదాటితే చాలు ఇంటినుంచి బయటకు రాలేని పరిస్థితి. ఇతర పనులమీద పక్క గ్రామాలకు వెళ్లేవారు ఈ రోడ్లు వెంబడి రావాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. వర్షాకాలం కావడంతో జీడి తోటలు శుభ్రం చేసే పనులకు వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఎలుగుల నుంచి రక్షణ కల్పించాలని గ్రామానికి చెందిన వెంకటరావు, వైకంఠరావు, శ్రీనివాస్‌ తదితరులు కోరుతున్నారు.

Updated Date - Aug 11 , 2025 | 12:05 AM