ఎలుగుబంటి బీభత్సం
ABN , Publish Date - Sep 07 , 2025 | 12:12 AM
Bear terror in uddanam మందస మండలం నారాయణపురం, సువర్ణాపురం, రంగనాథపురం గ్రామాల పరిధిలో శనివారం ఉదయం ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. జీడితోటల్లో పనులు చేస్తున్న జి.లక్ష్మినారాయణ, పందిరి పున్నయ్య, గొరకల మోహనరావు, పాపయ్యపై దాడి చేసింది. దీంతో స్థానికులు వారిని అంబులెన్స్‌లో హరిపురంలో ఆస్పత్రికి తరలించారు.
మందస మండలంలో నలుగురిపై దాడి
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
ఆందోళనలో ఉద్దానం వాసులు
హరిపురం, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): మందస మండలం నారాయణపురం, సువర్ణాపురం, రంగనాథపురం గ్రామాల పరిధిలో శనివారం ఉదయం ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. జీడితోటల్లో పనులు చేస్తున్న జి.లక్ష్మినారాయణ, పందిరి పున్నయ్య, గొరకల మోహనరావు, పాపయ్యపై దాడి చేసింది. దీంతో స్థానికులు వారిని అంబులెన్స్‌లో హరిపురంలో ఆస్పత్రికి తరలించారు. వైద్యాధికారులు స్వరాజ్యలక్ష్మి, బాలకృష్ణ చేశారు. ప్రాణాపాయం తప్పిందని తెలిపారు. విషయం తెలుసుకున్న అటవీశాఖాధికారులు మురళీకృష్ణం నాయుడు, నరేంద్రరెడ్డి తన సిబ్బందితో కలసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం హరిపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.
ఎలుగుబంటి సంచారంతో ఉద్దానం ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం నారాయణపురంలో గొరకల పాపారావుపై ఎలుగుబంటి దాడి చేసిన విషయం తెలిసిందే. మళ్లీ శనివారం మరో నలుగురిపై దాడి చేయడంతో భయాందోళన చెందుతున్నారు. ఒక ఎలుగుబంటి లేదా రెండు మూడు సంచరిస్తున్నాయోమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డుపక్కన ఎలుగు కళేబరం
మందస మండలం జగన్నాథపురం రోడ్డు పక్కన శనివారం ఉదయం ఒక ఎలుగుబంటి కళేబరం స్థానికులకు కనిపించింది. ఈ విషయాన్ని పోలీసులకు, అటవీశాఖ అధికారులకు చెప్పారు. వారు అక్కడకు చేరుకుని ఎలుగుబంటి కళేబరాన్ని పరిశీలించారు. పశువైద్యుడు దువ్వాడ శ్రీకాంత్ పోస్టుమార్టం నిర్వహించారు. కాగా, ఈ ఎలుగుబంటి మూడు పిల్లలతో నల్లబొడ్లూరు వద్ద రోడ్డుపై తిరుగుతుండేది. రాత్రి సమయంలో ట్రాక్టర్ ఢీకొని పిల్లలు మృతి చెందినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లి ఎలుగు మతిస్థిమితం కోల్పోయి గ్రామాల వెంబడి తిరిగి దాడులకు పాల్పడేదని పేర్కొన్నారు. దీంతో స్థానికులు ఆ ఎలుగును చంపివేశారని పలువురు ఆరోపిస్తున్నారు.