Beach Festival: బారువలో బీచ్ ఫెస్టివల్
ABN , Publish Date - Apr 15 , 2025 | 11:30 PM
Cultural Events ఎత్తయిన ఇసుక దిబ్బలు.. ఎటు చూసినా పచ్చదనంతో ఆహ్లాదంగా కనిపించే కొబ్బరి తోటలు.. ఆధ్యాత్మికతను నింపే ప్రాముఖ్యత కలిగిన పురాతన ఆలయాలు.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచే లైట్‌హౌస్, రిసార్ట్స్.. ఇవీ బారువ బీచ్ అందాలు. సోంపేట మండలంలో పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన బారువలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
19, 20 తేదీల్లో నిర్వహణకు ఏర్పాట్లు
సోంపేట, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): ఎత్తయిన ఇసుక దిబ్బలు.. ఎటు చూసినా పచ్చదనంతో ఆహ్లాదంగా కనిపించే కొబ్బరి తోటలు.. ఆధ్యాత్మికతను నింపే ప్రాముఖ్యత కలిగిన పురాతన ఆలయాలు.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచే లైట్‌హౌస్, రిసార్ట్స్.. ఇవీ బారువ బీచ్ అందాలు. సోంపేట మండలంలో పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన బారువలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 19, 20వ తేదీల్లో బీచ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఇటీవల ఆదేశాలు జారీచేశారు. పలాస ఆర్డీవో ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఫెస్టివల్‌కు తహసీల్దార్ ప్రముఖలకు ఆహ్వానం పలకాలని కోరారు. కాశీబుగ్గ డీఎస్పీ ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని, జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని సూచించారు. డీడీ ఫిషరీష్ లైఫ్‌గార్డ్ బోటులు ఏర్పాటు చేయాలన్నారు. పర్యాటకశాఖ అధికారి, డీఎస్‌డీవో, వైద్య, మెరైన్, అగ్నిమాపక, ఆర్‌అండ్‌బీ, అటవీ, నీటిపారుదల, విద్యుత్ శాఖ అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఇటీవల జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, పలాస ఆర్డీవోతోపాటు పలువురు అధికారులు బారువ బీచ్‌ను సందర్శించారు. ఇక్కడ పర్యాటక అభివృద్ధికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని గుర్తించారు. బీచ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్టు వెల్లడించారు. కాగా.. దీనిపై ప్రచారం విషయంలో అధికారులు వెనుకబడి ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రచారం ఆశించినస్థాయిలో లేకపోతే ఫెస్టివల్‌కు పర్యాటకులు ఎలా వస్తారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
వసతులు ఏర్పాటు చేయాలి
బారువ బీచ్‌లో ఏటా కార్తీకమాసంలో పిక్నిక్ సందడి కనిపిస్తుంది. వేలాది మంది పర్యాటకులు ఈ బీచ్‌కు వస్తుంటారు. అలాగే శుభదినాల్లో మహేంద్రతనయ నదీ సంగమంలో స్నానాలు ఆచరిస్తుంటారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఓడ అవశేషాలు ఇక్కడ కనిపిస్తాయి. లైట్‌హౌస్ నుంచి చూస్తే.. ఒకవైపు సముద్రం, మరోవైపు కొబ్బరితోటల ఆందాలు ఎంతో ఆహ్లాదానిస్తాయి. ఇక్కడ కోటిలింగేశ్వరాలయం, జనార్దనస్వామి, వేణుగోపాలస్వామి వంటి పురాతన ఆలయాలతోపాటు అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. ఇంతటి ఆహ్లాదకరమైన బారువ తీరం అభివృద్ధికి నోచుకోవడం లేదు. బారువ బీచ్‌కు సరైన రహదారి, విధ్యుత్, మరుగుదొడ్లు, తాగునీటి వసతి, మహిళలు దస్తులు మార్చుకోవడానికి ఏర్పాట్లు మాత్రం కనిపించవు. బీచ్ ఫెస్టివల్‌లో పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.