బీచ్ పరిశుభ్రత మన బాధ్యత
ABN , Publish Date - Sep 20 , 2025 | 11:28 PM
beach cleaning ‘పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాల’ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. బీచ్ పరిశుభ్రత.. మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం రూరల్, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): ‘పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాల’ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. బీచ్ పరిశుభ్రత.. మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. అంతర్జాతీయ తీరప్రాంత శుభ్రపరిచే దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం శ్రీకాకుళం మండలం పెదగణగళ్లవానిపేట బీచ్‌ను కలెక్టర్‌తోపాటు ఎమ్మెల్యే గొండు శంకర్, అధికారులు, సిబ్బంది శుభ్రం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ‘పర్యాటకులు బీచ్‌లను శుభ్రంగా ఉంచాలి. చెత్త వేసేందుకు డస్ట్‌బిన్‌లు ఉపయోగించాలి. స్వచ్ఛాంద్ర-స్వర్ణాంధ్రలో భాగంగా జిల్లాలో 912 గ్రామాల్లో 221 గ్రామాలను ఓడీఎఫ్ మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దాం. అక్టోబర్ 2 నుంచి శ్రీకాకుళం కార్పొరేషన్‌తో సహా అన్ని మున్సిపాలిటీలను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీగా మార్చనున్నాం. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటికే ప్లాస్టిక్ వినియోగించరాదని ఆదేశాలు జారీ చేశామ’ని తెలిపారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ.. ‘వ్యర్థాలను నేరుగా సముద్రంలో విడిచి పెట్టడం ద్వారా నీరు కలుషితమై మత్స్య సంపద నాశనం అవుతుంది. కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని నిర్మూలించాలి. పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత’ అని తెలిపారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ కరుణశ్రీ, డీపీవో కె.భారతి సౌజన్య, తహసీల్దార్ గణపతిరావు, ఎంపీడీవో ప్రకాశరావు, సర్పంచ్ బర్రి రామారావు, ఎంపీటీసీ చీకటి అమ్మోజీరావు, యువత, స్వచ్ఛంద సేవా సంస్థలు, వివధ కంపెనీల ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ‘స్వచ్ఛతహి సేవ’, ‘ప్లాస్టిక్ వద్దు - కాటన్ ముద్దు’ అనే నినాదాలతో అవగాహన కార్యాక్రమాలు నిర్వహించారు.