పొగమంచుతో జాగ్రత్త
ABN , Publish Date - Dec 27 , 2025 | 11:13 PM
Snow falling on the roads జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. మరోవైపు పొగమంచు విపరీతంగా కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
రహదారులపై కమ్మేస్తున్న మంచు
ఎదుటి వాహనాలు కనిపించక ప్రమాదాలు
రణస్థలం, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. మరోవైపు పొగమంచు విపరీతంగా కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల కోటబొమ్మాళి మండలంలో హైవేపై పొగమంచు కారణంగా జీపును ఢీకొని నలుగురు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో 193 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి విస్తరించి ఉంది. ప్రతిరోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రణస్థలం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం రూరల్, నరసన్నపేట, కోటబొమ్మాళి, టెక్కలి, నందిగాం, కాశీబుగ్గ, సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం పోలీస్‌స్టేషన్ల పరిధిలో రహదారి ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. గత ఆగస్టు నుంచి ఇప్పటివరకూ 125 ప్రమాదాలు జరిగాయి. 48మంది మృత్యువాత పడ్డారు. పోలీసులు 36 బ్లాక్‌స్పాట్‌లను గుర్తించారు. ప్రతి 3 నెలలకు పోలీస్ అధికారులు సమీక్షలు చేస్తున్నా ప్రమాదాలు నియంత్రణలోకి రావడం లేదు. ప్రస్తుతం పొగమంచు కారణంగా ప్రమాదాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, డ్రైవింగ్‌లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కచ్చితంగా పాటించాలి
రాత్రి వేళల్లో రోడ్డును చూడగలిగే స్థితిలో వేగంతోనే వాహనాన్ని నడపాలి. వాహనం నడిపేటప్పుడు ఇతరులకు స్పష్టంగా కనిపించేలా లైట్లు ఆన్‌చేసి ఉంచాలి. ఇతర వాహనాలు గమనించేలా త్రికోణాకృతి లైట్లను వినియోగించుకోవాలి. లోబీమ్ ఫాగ్ లైట్లు ఉండేలా చూసుకోవాలి.
జాతీయ రహదారులు, శివారు రహదారులపై వాహనాల మధ్య కచ్చితమైన దూరం పాటించాలి. ముందు వెళ్లే వాహనాలకు ఓవర్‌టేక్ చేయకూడదు. విండ్ స్ర్కీన్, సైడ్ అద్దాలపై మంచుపొరను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. రోడ్డు స్పష్టంగా కనిపించకపోతే సురక్షితమైన స్థలంలో వాహనాన్ని నిలిపివేయాలి. ఇది ఇతర వాహనాలకు కనిపించేలా ఉంచాలి.
వాహనం నడుపుతూ తినడం, తాగడం, పొగ తాగడం చేయరాదు. డ్రైవింగ్‌పైనే ఎక్కువగా దృష్టిపెట్టాలి. రాత్రి సమయాల్లో, తెల్లవారుజామున వాహనాలు నడిపే డ్రైవర్లు నిద్రమత్తులో ఉండరాదు. టోల్‌ప్లాజాల వద్ద అనౌన్స్‌మెంట్ ద్వారా జారీచేసే సూచనలు పాటించాలి.
ఆకస్మికంగా మలుపులు తిరగడం, రోడ్డు మధ్యలో వాహనం నిలపడం వంటివి నియంత్రించుకోవాలి. వాహనం నిలపడానికి ముందుగా బ్లింకర్లను వినియోగించాలి.
అప్రమత్తంగా ఉండాలి
రోడ్డుపై ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలి. వీలైనంత వేగాన్ని నియంత్రించుకోవాలి. పొగమంచు కారణంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎదుటి వాహనాలు కనబడకపోతే వెంటనే నిలిపివేయాలి. సంక్రాంతి వేళ వాహనాల రద్దీ పెరగనున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
- ఎం.అవతారం, సీఐ, జేఆర్ పురం