ఈ-సిగరెట్లతో జాగ్రత్త
ABN , Publish Date - Oct 01 , 2025 | 12:09 AM
పబ్‌లు, పార్టీల్లో చాలామంది ఎలకా్ట్రనిక్ సిగరెట్లను పీల్చుతున్నారు. వాసన లేకపోవడం, పొగరాకపోవడం వల్లన ఆరోగ్యానికి పెద్దగా ప్రమాదం లేదనే అపోహతో ఈ-సిగరెట్లను వినియోగిస్తున్నారు.
- పొగరాదని వాడితే ఆరోగ్యానికే ముప్పు
- పీలిస్తే క్యాన్సర్ బారినపడే అవకాశం
- జ్ఞాపకశక్తి కోల్పోయే ఆస్కారం
- వినియోగిస్తూ పట్టుబడితే మూడేళ్ల జైలు
అరసవల్లి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పబ్‌లు, పార్టీల్లో చాలామంది ఎలకా్ట్రనిక్ సిగరెట్లను పీల్చుతున్నారు. వాసన లేకపోవడం, పొగరాకపోవడం వల్లన ఆరోగ్యానికి పెద్దగా ప్రమాదం లేదనే అపోహతో ఈ-సిగరెట్లను వినియోగిస్తున్నారు. నిజానికి ఎలకా్ట్రనిక్ సిగరెట్ల ద్వారా పొగ రాకపోయినా ఆర్యోగానికి ముప్పు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్యాటరీ ఆఽధారిత పరికరంతో ఈ-సిగరెట్లను తయారు చేస్తారు. ఈ పరికరంలో నికోటిన్ ద్రవ రూపంలో ఉంటుంది. రుచి, వాసన కోసం ఇతర రసాయనాలు వినియోగిస్తారు. పరికరంలో ఉండే ఆటోమైజర్.. నికోటిన్ ద్రవాన్ని వేడిచేసి ఆవిరిగా మారుస్తుంది. ఇవి విడుదల చేసే ఆవిరిలో 2.5 పీఎం కంటే చిన్న రేణువులు ఉంటాయి. దీన్ని పీల్చడం వల్లన ఊపిరితిత్తులు, గుండె సంబంధిత సమస్యలు వస్తాయని, నాడీ వ్యవస్థ, మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని, కొన్నిసార్లు జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దంతాలు, నోటి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ-సిగరెట్ల తయారీ, దిగుమతి, ప్రకటనలు, అమ్మకం, వినియోగాన్ని దేశంలో నిషేధించారు. కానీ, చాలామంది యువత పార్టీల్లో వీటిని విరివిగా వినియోగించి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. ఈ-సిగరెట్లను వినియోగిస్తూ మొదటిసారి పట్టుబడితే ఒక సంవత్సరం జైలుశిక్షతో పాటు రూ.లక్ష జరిమానా ఉంటుంది. రెండోసారి పట్టుబడితే మూడేళ్ల జైలు శిక్ష, రూ.5లక్షల జరిమానా విధిస్తారు. పొగతాగడాన్ని మానివేసేందుకు చాలామంది ఈ-సిగరెట్లను ఒక ప్రత్యామ్నాయంగా భావిస్తుంటారు. కానీ, ఇది చాలా తప్పు. ఈ-సిగరెట్లు కాల్చడం సరదాగా మొదలై, చివరకు అలవాటుగా మారి అనారోగ్యానికి దారి తీస్తుంది. పట్టుబడితే జీవితాలు నాశనమైపోతాయి. అందుకే యువత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
అనారోగ్యం తప్పదు
ఈ-సిగరెట్లతో పొగరాదని, ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవని చాలామంది అపోహ పడుతుంటారు. అది నిజం కాదు. వీటి వినియోగంతో అనారోగ్యం తప్పదు. గుండె, ఊపిరితిత్తుల సంబంధిత తదితర సమస్యలు తలెత్తుతాయి. హృద్రోగులు, గర్భిణీలు, యువత వీటికి కచ్చితంగా దూరంగా ఉండాలి.
-డాక్టర్ అన్నెపు శశిధర్, ఎండీ (జనరల్ ఫిజీషియన్)