బాణసంచాతో జాగ్రత్త!
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:43 PM
Unofficial 'Diwali' equipment దీపావళి వేళ.. జిల్లాకు పెద్ద ఎత్తున బాణాసంచా నిల్వలు చేరుకున్నాయి. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వంటి ప్రాంతాల నుంచి కొంతమంది అనధికారికంగా ముడిసరుకు తెప్పించుకుంటున్నారు. జనావాసాల మధ్య భద్రపరుస్తున్నారు. దీంతో సమీప నివాసితులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాకు అనధికారికంగా ‘దీపావళి’ సామగ్రి
జనావాసాల మధ్య భద్రపరుస్తున్న వైనం
ఆందోళనలో ప్రజలు.. పట్టని అధికారులు
శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): దీపావళి వేళ.. జిల్లాకు పెద్ద ఎత్తున బాణాసంచా నిల్వలు చేరుకున్నాయి. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వంటి ప్రాంతాల నుంచి కొంతమంది అనధికారికంగా ముడిసరుకు తెప్పించుకుంటున్నారు. జనావాసాల మధ్య భద్రపరుస్తున్నారు. దీంతో సమీప నివాసితులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 8న అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామవరంలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటనం జరిగి ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. జిల్లాలో కూడా గతంలో రెండు మూడుచోట్ల ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీపావళి పండుగ ఎంతటి ప్రమోదాన్ని కలిగిస్తుందో.. అప్రమత్తంగా లేకుంటే అంతటి ప్రమాదాన్ని కూడా తెచ్చిపెడుతుంది. ఈ నేపథ్యంలో బాణసంచా విక్రయదారులతోపాటు వాటిని కొనుగోలు చేసే ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
జిల్లాలో పరిస్థితి...
జిల్లాలో శ్రీకాకుళం, పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో మాత్రమే అధికారికంగా అనుమతులు కలిగిన షాపులు ఉన్నాయి. కానీ ప్రతి పట్టణానికి, మండలానికి అనధికారికంగా బాణసంచా సామగ్రి చేరింది. జిల్లాలో 12 మంది ఏడాది పొడవునా బాణసంచా తయారు చేసే లైసెన్స్‌లు కలిగి ఉన్నారు. వీరు ఆర్డర్‌పై మాత్రమే తయారు చేసి విక్రయించాలి. దుకాణాలకు అమ్మకూడదు. ఈ కేంద్రాలు జనావాసాలకు కచ్చితంగా దూరంగా ఉండాలి. బాణసంచా తయారీ విక్రయ కేం ద్రాలను పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపకశాఖ అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. కానీ జిల్లాలో ఆ పరిస్థితి లేదు. దీపావళి సమీపిస్తున్నా కనీసం ప్రజలకు అవగాహన కల్పించడంపై కూడా దృష్టిసారించడం లేదు. ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ సేఫ్టీ నిబంధనలు కఠినంగా ఉంటాయి. కానీ బాణసంచా సామగ్రి తయారీ కేం ద్రాలు తమ పరిధిలోకి రావాలంటూ ఆ శాఖాధికారులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం దీపావళి టపాసులు తయారు చేసి విక్రయించడానికి వీల్లేదు. వేరే రాష్ర్టాల నుంచి హోల్‌సేల్‌గా తెచ్చుకున్న వారి దగ్గర నుంచి రిటైల్ వ్యాపారులు కొనుగోలు చేసి విక్రయించాలి. ఏడాది పొడువునా బాణసంచా తయారు చేయడానికి లైసెన్స్ తీసుకున్నవారు 15కిలోలకు మించి తమ వద్ద ముడిసరుకుల నిల్వ ఉంచకూడదు. కానీ అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈ నిబంధనలు సక్రమంగా అమలుకావడం లేదు. ఊహించని ఘటన జరిగితే.. అధికారులు హడావుడి చేస్తూ నివేదికలతో చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ నిబంధనలు తప్పనిసరి..
నివాసాలకు దగ్గరగా తాత్కాలిక, శాశ్వత బాణసంచా విక్రయ షాపుల ఏర్పాటుకు పోలీసులు అనుమతులు ఇవ్వకూడదు.
విద్యుత్ ట్రాన్ప్‌ఫార్మర్లకు సమీపంలో, హైటెన్షన్ విద్యుత్ తీగలకు కింద దుకాణాలు పెట్టకూడదు. ఊరికి ఆవల ఏర్పాటయ్యేలా అధికారులు చూడాలి.
దుకాణాల మధ్య మూడు మీటర్ల దూరం ఉండేలా చూడాలి.
పొగ తాగరాదనే బోర్డులు ఏర్పాటు చేయాలి. నీటి సదుపాయం కల్పించాలి.
డ్రై కెమికల్ పౌడర్ నాలుగైదు కిలోలు, సీఓటూ (కార్భన్ డై ఆక్సైడ్) ఐదుదు కిలోలు దుకాణం వద్ద ఉండేలా చూడాలి.
నిబంధనలకు మించి నిల్వలు ఉంచకూడదు.
చిన్నపిల్లలను పనిలో పెట్టుకోకూడదు.
అగ్నిమాపక సాధనాలను అందుబాటులో ఉంచాలి.
చర్యలు తప్పవు
అనధికారికంగా బాణాసంచా నిల్వ చేస్తే చర్యలు తప్పవు. అనుమతులు ఉన్నవారు నిబంధనల మేరకు వ్యాపారాలు చేయాలి. అక్రమంగా తయారు చేసినా, నిల్వ ఉంచినా, విక్రయించినా క్రిమినల్ కేసులు తప్పవు. జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజూ ఆకస్మిక తనిఖీలు చేయడానికి బృందాలను ఏర్పాటు చేశాం. అక్రమ తయారీ, నిల్వ, వి క్రయాలపై 112కు సమాచారం ఇవ్వాలి. అవసరమైతే వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.
- ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి