Beach festival: సందడిగా బీచ్ ఫెస్టివల్
ABN , Publish Date - Apr 20 , 2025 | 12:46 AM
Beach Festival Celebrations సోంపేట మండలం బారువ తీరంలో బీచ్ ఫెస్టివల్ శనివారం సందడిగా సాగింది. అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో బారువ తీరం జనసంద్రంగా మారింది. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ముఖ్య అతిథిగా హాజరై బీచ్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు.
బారువాను మినీగోవాగా తీర్చిదిద్దుతాం
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
సోంపేట, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): సోంపేట మండలం బారువ తీరంలో బీచ్ ఫెస్టివల్ శనివారం సందడిగా సాగింది. అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో బారువ తీరం జనసంద్రంగా మారింది. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ముఖ్య అతిథిగా హాజరై బీచ్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా కబడ్డీ, వాలీబాల్, పడవ పోటీలను నిర్వహించారు. బోటు షికారులో విహరించారు. గాలిపటాలు ఎగరేశారు. సముద్రంలో అపాయం ఎదురైతే.. ఎలా రక్షించాలో డెమో ద్వారా వివరించారు. మరోవైపు సాంస్కృతిక నృత్యప్రదర్శనలతో బీచ్‌లో ఎక్కడ చూసినా సందడి కనిపించింది. బారువ ఎంపీపీ పాఠశాల విద్యార్థులు రూపొందించిన ఆలివ్‌రిడ్లే తాబేలు సైకత శిల్పం విశేషంగా ఆకట్టుకుంది.
పర్యాటక హబ్‌గా..
బారువ బీచ్‌ను అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు పొందేలా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు తెలిపారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్‌తో కలసి బారువ తీరంలో బీచ్‌ఫెస్టివల్ సందర్భంగా ఆలివ్‌రిడ్లే తాబేళ్లను శనివారం విడిచిపెట్టారు. అనంతరం వివిధ క్రీడా విన్యాసాల కార్యక్రమాలను ప్రారంభించారు. స్పీడ్‌బోట్‌లో తీరం లోపల విహరించారు. స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా.. సముద్ర తీరంలో పర్యావరణ పరిశుభద్రత చేపట్టారు. అనంతరం నిర్వహించిన సభలో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. ‘స్వచ్ఛమైన పరిసరాలు, మహేంద్రతనయ నదీ సంగమం, లైట్‌హౌస్, ఎత్తయిన దిబ్బలు, సువిశాలమైన తీరం కలిగిన బారువ బీచ్‌ను మినీగోవాగా తీర్చిదిద్దుతాం. ఈ సముద్ర తీరప్రాంతాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. భవిష్యత్‌లో నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్‌కు ఇది ట్రైలర్ మాత్రమే. ఇదే స్ఫూర్తితో వచ్చేనెల 3, 4 తేదీల్లో ఘనంగా బీచ్‌ఫెస్టివల్ నిర్వహిస్తాం. బారువ ప్రజలుకూడా సహకరించి బీచ్‌లో నిత్యం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలి. పర్యాటకులను అక్కున చేర్చుకోవాలి’ అని సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 16 కేంద్రాల ద్వారా ఆలివ్‌రిడ్లే తాబేళ్ళ సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బారువ బీచ్ ప్రత్యేకతను చాటిచెప్పేందుకు వెబ్‌సైట్, ప్రచార కార్యక్రమాలు ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, ఆర్డీవో వెంకటేశ్వరరావు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.