బ్యాంకులు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలి
ABN , Publish Date - Jul 24 , 2025 | 12:20 AM
బ్యాంకులు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అదేశించారు.
- కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, జూలై 23(ఆంధ్రజ్యోతి): బ్యాంకులు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుఽధవారం బ్యాంకర్లతో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. వార్షిక క్రెడిట్ ప్లాన్ 2024-25, ఎంఎస్‌ఎంఈ, విద్యా రుణాలు, వ్యవసాయానికి క్రెడిట్, చెల్లింపులు, స్వయం సహాయక సంఘాల గ్రూపులకు లింకేజీ అండ్ ఎంసీపీ డిజిటల్, పీఎం సూర్యఘర్, పీఎం విశ్వకర్మ, నాబార్డు తదితరాల లక్ష్యాలను, సాధించిన తీరును విశ్లేషించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మత్స్యశాఖ, ఎంఎస్‌ఎంఈ, ఉద్యానశాఖ, తదితర శాఖల లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. సూర్యఘర్ ఎక్కువ మందికి చేరేలా చర్యలు తీసుకోవాలని ఏపీఈపీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. అలాగే నైపుణ్యాభివృద్ధి శాఖతో సంబంధం ఉన్న ప్రతీ శాఖ సమన్వయంతో ఆయా శాఖలకు సంబంధించిన శిక్షణ తీసుకోవాలన్నారు. జిల్లా అధికారులు ఒకసారి నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థను సందర్శించాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలను తూచ తప్పకుండా పాటించాలని లీడ్ బ్యాంకు మేనేజర్ పి.శ్రీనివాసరావు బ్యాంకర్లకు సూచించారు. కిసాన్ క్రెడిట్ కార్డు, మత్స్యకారులకు, పశు సంవర్థక శాఖలకు సంబంధించి రుణాలు అందిస్తామని నాబార్డు డీడీ ఎం.రమేష్ కృష్ణ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ప్రతీ కుటుంబానికి ఒక పారిశ్రామిక వేత్త ఉండే విధంగా బ్యాంకర్లు సహకరించాలని ఆదేశించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ప్రతీ రైతు చేరాలని, ప్రకృతి వైపరీత్యాలతో పంటలకు నష్టం జరిగితే బీమా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సమావేశంలో యుబీఐ ప్రాంతీయాధికారి పి.రాజు, డీసీసీబీ జీఎం వరప్రసాద్, ఉద్యానశాఖ ఏడీ ప్రసాదరావు, మత్స్యశాఖ అధికారి సత్యనారాయణ, ఏపీఎంఐపీ డీడీ శ్రీనివాసరావు, వ్యవసాయాధికారి త్రినాథస్వామి, ఆయా బ్యాంకుల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.