దారి తప్పిన బంగ్లాదేశీయులు
ABN , Publish Date - Dec 01 , 2025 | 12:31 AM
Bangladeshi fishermen reached the Moosawanipet beach వారంతా బంగ్లాదేశ్‌కు చెందిన మత్స్యకారులు. కొద్దిరోజుల కిందట 13 మంది సముద్రంలో చేపలవేటకు వెళ్లారు. సముద్రంలో వాతావరణం అనుకూలించకపోవడం.. మరోవైపు బోటు పాడైపోవడంతో దారి తప్పి.. ఎచ్చెర్ల మండలం బడివానిపేట పంచాయతీ మూసవానిపేట సముద్ర తీరానికి ఆదివారం చేరారు. పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్ర సరిహద్దుల మీదుగా బడివానిపేట పంచాయతీ మూసవానిపేట తీరం వద్ద సముద్రంలో బోటు లంగరు వేసి ఉండిపోయారు.
మూసవానిపేట తీరానికి చేరిన 13 మంది
గుర్తించిన స్థానిక మత్స్యకారులు
కళింగపట్నం మెరైన్‌స్టేషన్‌కు తరలింపు
ఎచ్చెర్ల, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): వారంతా బంగ్లాదేశ్‌కు చెందిన మత్స్యకారులు. కొద్దిరోజుల కిందట 13 మంది సముద్రంలో చేపలవేటకు వెళ్లారు. సముద్రంలో వాతావరణం అనుకూలించకపోవడం.. మరోవైపు బోటు పాడైపోవడంతో దారి తప్పి.. ఎచ్చెర్ల మండలం బడివానిపేట పంచాయతీ మూసవానిపేట సముద్ర తీరానికి ఆదివారం చేరారు. పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్ర సరిహద్దుల మీదుగా బడివానిపేట పంచాయతీ మూసవానిపేట తీరం వద్ద సముద్రంలో బోటు లంగరు వేసి ఉండిపోయారు. బోటు నడిపేందుకు ఇంధనం లేక, తినేందుకు ఆహారం లేక ఇబ్బందులు పడ్డారు. వారిని ఆదివారం మధ్యాహ్నం స్థానిక మత్స్యకారులు గమనించారు. బోటు ఈ ప్రాంతానికి చెందినది కాదని, బోటులో ఉన్నవాళ్లంతా అనుమానితులుగా ఉన్నట్టు భావించి స్థానిక, మెరైన్ పోలీసు స్టేషన్‌కు సమాచారం అందజేశారు. కళింగపట్నం మెరైన్ సీఐ బి,ప్రసాదరావు, ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ జి.లక్ష్మణరావు, సిబ్బంది సముద్ర తీరానికి చేరుకుని మూడు బోట్ల సాయంతో సముద్రంలోనికి వెళ్లి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఆ మత్స్యకారుల వేషధారణ, భాష ఆధారంగా వారంతా బంగ్లాదేశీయులుగా గుర్తించారు.
భాష తెలియక.. బిక్కుబిక్కుమంటూ..
స్థానిక మత్స్యకారులు, పోలీసులు వారితో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ కొద్దిరోజులుగా ఆహారం లేకపోవడం, భయంతో వివరాలు చెప్పేందుకు ఇబ్బంది పడ్డారు. కొద్దోగొప్పో బంగ్లాదేశ్ భాష తెలిసిన స్థానిక మత్స్యకారులు వారితో మాట్లాడితే కొద్ది సమాచారం మాత్రమే తెలిసింది. సాజ్వికె, జహంగీర్, షబీర్, కోకాన్, మాక్సుద్, మాలిక్, మాక్షుద్, ఎండీ ఫరూఖ్, నశీర్, హెల్లాల్, ఫరూఖ్, అలామ్, షమీర్ తమ పేర్లు అని వెల్లడించారు. వారం రోజులుగా భోజనం లేదని, సముద్రంలో బోటు ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితిలో వారంతా బిక్కుబిక్కుమంటూ మాట్లాడారు. సుమారు 15 రోజులుగా సముద్రంలో ఉండడం, బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితి అనుకూలించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వీరు ఒడ్డుకు చేరిన వెంటనే స్థానిక మత్స్యకారులు వేడిని కాచుకునేందుకు మంటలు వేశారు. అలాగే ముందుగా బిస్కెట్లు అందించారు. ఆ తర్వాత భోజనాలు ఏర్పాటు చేశారు. వారిని కళింగపట్నం మెరైన్ స్టేషన్‌కు తరలించారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇక్కడికి చేరిన బంగ్లాదేశీయులపై 81, 82 ఇండియన్ మారిటైమ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేస్తున్నట్టు మెరైన్ సీఐ ప్రసాదరావు తెలిపారు.
2008లోనూ..
2008లో ఒకసారి బంగ్లాదేశ్‌కు చెందిన మత్స్యకారులు బోటు పాడైన కారణంగా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం సముద్ర తీరానికి చేరారు. తాజాగా మరోసారి ఈ సంఘటన చోటుచేసుకుంది.