బాబోయ్ కిడ్నాప్‌లు
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:50 PM
Kidnappings on the rise in the srikakulam జిల్లాలో నేర సంస్కృతి పెరుగుతోంది. అప్పట్లో పట్టణాలకే పరిమితమైన ఈ సంస్కృతి గ్రామాలకు సైతం పాకుతోంది. ప్రధానంగా భూదందాలు, ఆస్తి తగాదాలు, సెటిల్‌మెంట్‌లు మూలంగానే ఈ ఘటనలు జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంతో పాటు పలాస, కాశీబుగ్గ, నరసన్నపేట వంటి పట్టణాల్లో తరచూ ఈ ఘటనలు వెలుగుచూస్తున్నాయి.
జిల్లాలో పెరుగుతున్న ఘటనలు
ఆస్తి, సివిల్ తగాదాలే కారణం
వెలుగులోకి వచ్చినవి కొన్నే
శ్రీకాకుళం క్రైం, నవంబరు 17(ఆంధ్రజ్యోతి):
ఈ నెల 6న పలాసకు చెందిన ప్రముఖ జీడి వ్యాపారి, బ్యాంకుల కన్సల్‌టెంట్ వి.లక్ష్మినారాయణరాజు (వీఎల్‌ఎన్ రాజు)ను ఆమదాలవలసకు చెందిన వ్యాపారి పొట్నూరు వేణుగోపాలరావు, ఆయన అనుచరులు కిడ్నాప్ చేశారు. ఆమదాలవలసలో రాజు పేరిట ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌ను రిజిస్ర్టేషన్ చేసుకునేందుకు బలవంతంగా ఆయనను కారులో ఎత్తుకెళ్లారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. కిడ్నాపర్లను ఫోన్‌లో హెచ్చరించడంతో ఆ రోజు సాయంత్రానికి నరసన్నపేటలో రాజును వారు విడిచిపెట్టేశారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు.
నరసన్నపేటలోని లచ్చుమన్నపేటకు చెందిన బంగారం కొరియర్ పొట్నూరు గుప్త ఆగస్టు 26న కారులో విశాఖపట్నం వెళ్లి.. తిరిగి ఇంటికి చేరుకోలేదు. నాలుగు రోజులపాటు ఆయన ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెంది ఆ నెల 31న పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు రంగంలోకి దిగి దర్యాప్తు చేయగా.. గుప్త వద్ద పనిచేస్తున్న కారు డ్రైవర్ డబ్బుకు ఆశ పడి.. మరో వ్యక్తితో కలిసి గుప్తను హత్య చేసినట్టు తేలింది. శ్రీకాకుళం సమీపంలోని ఓ గెడ్డలో గుప్త మృతదేహాన్ని పడేసినట్టు పోలీసులు గుర్తించారు.
కొన్ని నెలల కిందట కాశీబుగ్గలోని గణేష్ ఆఫ్ సెంటర్ ప్రింటర్స్ అధినేత గోపి అనే వ్యక్తిని ఓ ఆర్మీ ఉద్యోగి కిడ్నాప్ చేయించాడు. నెల రోజుల పాటు ఆయన ఆచూకీ తెలియలేదు. అడిగినంత డబ్బులు ఇచ్చిన తర్వాత దుండగులు విడిచిపెట్టారు. ఇప్పటికీ ఆ కేసులో చిక్కుముడి వీడలేదు.
కొన్నేళ్ల కింద శ్రీకాకుళం నగరంలో ఓ డాక్టర్ కిడ్నాప్ ప్రయత్నం కలకలం సృష్టించింది. కిమ్స్ ఆసుపత్రి ఎదురుగా నివాసముంటున్న ఓ డాక్టర్‌ను కిడ్నాప్ చేసే క్రమంలో నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు.
..ఇలా జిల్లాలో నేర సంస్కృతి పెరుగుతోంది. అప్పట్లో పట్టణాలకే పరిమితమైన ఈ సంస్కృతి గ్రామాలకు సైతం పాకుతోంది. ప్రధానంగా భూదందాలు, ఆస్తి తగాదాలు, సెటిల్‌మెంట్‌లు మూలంగానే ఈ ఘటనలు జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంతో పాటు పలాస, కాశీబుగ్గ, నరసన్నపేట వంటి పట్టణాల్లో తరచూ ఈ ఘటనలు వెలుగుచూస్తున్నాయి. శ్రీకాకుళం చుట్టుపక్కల ప్రాంతాల్లో భూ సెటిల్‌మెంట్‌లు, నరసన్నపేటలో బంగారం వ్యాపారం, టెక్కలిలో గ్రానైట్ వ్యాపారాలు, పలాస జీడిలో వ్యాపార లావాదేవీలు వంటివి కిడ్నాప్ ఘటనలకు దారితీస్తున్నాయి. కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతుండడంతో మధ్యవర్తులు ఎక్కువగా రంగ ప్రవేశం చేస్తున్నారు. ఈ తరుణంలో పంపకాల్లో వస్తున్న వ్యత్యాసాలు నేరాలకు పురిగొల్పుతున్నాయి.
జిల్లాలో కిడ్నాప్ ఘటనలకు సంబంధించి గతేడాది ఏడు కేసులు, ఈ ఏడాది ఇప్పటివరకు మూడు కేసులు నమోదయ్యాయి. పోలీసుల దృష్టికి రానివి ఇంకెన్నో ఉన్నాయి. అడ్డదారిలో డబ్బులు సంపాదించేందుకు కొందరు కిరాయి వ్యక్తులను తీసుకొస్తున్నారు. గతంలో బిహార్, కోల్‌కత్తా, కటక్ ప్రాంతాల నుంచి ఆగంతుకులు వచ్చి నేరాలకు పాల్పడేవారు. ఇప్పుడు స్థానికంగా కూడా ఇలాంటి వ్యవహారాలను చక్కబెట్టే ముఠాలు పుట్టుకొచ్చాయి. సెటిల్‌మెంట్‌లు రూపంలో లక్షలాది రూపాయల ఆదాయం వస్తుండడంతో కిడ్నాప్‌లకు తెరతీస్తున్నారు. వీటి నియంత్రణపై పోలీసులు మరింత దృష్టిపెట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.
పోలీసులను ఆశ్రయించాలి:
సివిల్ తగాదాలతోపాటు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కిడ్నాప్ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న విదాదాల్లో మూడో వ్యక్తి రావడంతోనే నేర తీవ్రత పెరుగుతోంది. వీలైనంతవరకు శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. లేదంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలి. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు.
- కేవీ రమణ, ఏఎస్పీ, శ్రీకాకుళం