Share News

School Auto accident: టైరు పేలి.. అదుపు తప్పి

ABN , Publish Date - Jul 05 , 2025 | 12:05 AM

auto rickshaw overturn విద్యార్థులతో పాఠశాలకు వెళ్తున్న ఓ ఆటో టైరు పేలింది. అదుపు తప్పి రోడ్డుపక్కన పిల్ల కాలువ వైపు దూసుకెళ్లి ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురి విద్యార్థులకు గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

School Auto accident: టైరు పేలి.. అదుపు తప్పి
కాలువలోకి దూసుకెళ్లిన ఆటో, తీవ్రంగా గాయపడిన శ్యామ్‌చరణ్‌, వివరాలు సేకరిస్తున్న పోలీసులు

  • పాఠశాలకు వెళ్తూ.. ఆటో బోల్తా

  • ఆరుగురి విద్యార్థులకు గాయాలు

  • ఒకరి పరిస్థితి విషమం

  • నరసన్నపేట, జూలై 4(ఆంధ్రజ్యోతి): విద్యార్థులతో పాఠశాలకు వెళ్తున్న ఓ ఆటో టైరు పేలింది. అదుపు తప్పి రోడ్డుపక్కన పిల్ల కాలువ వైపు దూసుకెళ్లి ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురి విద్యార్థులకు గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి నరసన్నపేట పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పోలాకి మండలం పిరువాడ నుంచి 12 మంది విద్యార్థులు ఈదులవలస ఆదర్శ పాఠశాలకు శుక్రవారం ఉదయం ఆటోలో వెళ్తున్నారు. దేశవానిపేట శివారులో ఒక దాబా వద్ద ఆటో ముందుభాగం టైరు పేలింది. దీంతో ఆటో అదుపు తప్పి.. రోడ్డు పక్కనే ఉన్న పిల్ల కాలువలో బోల్తా పడింది. విద్యార్థులు ఆర్తనాదాలు విని.. స్థానికులు ఆ ఆటోను పైకి లేపారు. ఈ ఘటనలో నరసన్నపేట ఇందిరానగర్‌కు చెందిన ఆరో తరగతి విద్యార్థి కె.శ్యామ్‌చరణ్‌, పిరువాడకు చెందిన కె.కామేశ్వరి, పి.కుసుమ కావ్య, వై.గీతతోపాటు రాళ్లగోదాయివలసకు చెందిన గొల్లంగి గుణశ్రీ, జమ్ము జంక్షన్‌కు చెందిన వి.జాగృతికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందజేశారు. ఆటో కింద భాగంలో చిక్కుకుపోయిన కె.శ్యామ్‌చరణ్‌కు తుంటి ఎముక విరిగిపోయిందని వైద్యులు గుర్తించారు. తలపై కూడా బలమైన గాయాలు కావడంతో ఆ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. శ్రీకాకుళంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు.

  • తల్లిదండ్రుల్లో ఆందోళన

  • పాఠశాలకు వెళ్లే ఆటో బోల్తా పడిందని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. తమ పిల్లలకు ఏమైందో.. ఏమోనని ఏరియా ఆస్పత్రికి పరుగులు పెట్టారు. పోలీసులు కూడా ప్రభుత్వాసుపత్రికి చేరుకుని ప్రమాద ఘటనపై ఆరా తీశారు. పరిమితికి మించిన లోడుతో వెళ్లడం, ఆటో టైరు ముందు భాగం పేలి ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ తెలిపారు.

  • ప్రిన్సిపాల్‌ పరామర్శ:

  • పోలాకి: శ్రీకాకుళం, నరసన్నపేట ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఈదులవలస ఆదర్శపాఠశాల ప్రిన్సిపాల్‌ పైడి ప్రవీణ పరామర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. డీఈవో తిరుమల చైతన్య, విద్యాకమిటీ చైర్మన్‌ దండుపాటి ఎర్రయ్య, ఉపాధ్యాయ, అధ్యాపక సిబ్బంది కూడా విద్యార్థులను పరామర్శించారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రిన్సిపాల్‌కు ఫోన్‌ చేసి ఈ ఘటనపై ఆరా తీశారు.

Updated Date - Jul 05 , 2025 | 12:05 AM