సెల్ టవర్ ఎక్కి ఆటోడ్రైవర్ హల్‌చల్
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:03 AM
Auto driver up to cell tower ఎచ్చెర్ల మండలం కుశాలపురం పరిధిలోని యాతపేట వద్ద సెల్‌టవర్ ఎక్కి ఓ ఆటోడ్రైవర్ మంగళవారం హల్‌చల్ చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ‘ఆటోడ్రైవర్ల సేవలో’ పథకం కింద ఆటోడ్రైవర్లకు రూ.15వేలు చొప్పున అందజేసిన విషయం తెలిసిందే.
ప్రభుత్వ పథకం నిధులు అందలేదని ఆవేదన
ఎచ్చెర్ల, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్ల మండలం కుశాలపురం పరిధిలోని యాతపేట వద్ద సెల్‌టవర్ ఎక్కి ఓ ఆటోడ్రైవర్ మంగళవారం హల్‌చల్ చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ‘ఆటోడ్రైవర్ల సేవలో’ పథకం కింద ఆటోడ్రైవర్లకు రూ.15వేలు చొప్పున అందజేసిన విషయం తెలిసిందే. కాగా.. ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరు గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ దాసరి కళ్యాణ్‌కుమార్‌కు ఈ పథకం కింద నిధులు జమకాలేదు. ఈ నేపథ్యంలో కళ్యాణ్‌కుమార్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో యాతపేట వద్ద సెల్‌టవర్ ఎక్కాడు. ఆటోడ్రైవర్లకు ఇచ్చే సాయం తనకు అందలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ నిధులు మంజూరుచేసే వరకూ దిగేది లేదంటూ సుమారు గంట సేపు హల్‌చల్ చేశాడు. విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల ఎస్‌ఐ-2 వి.అప్పారావు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ‘ఆటోడ్రైవర్ల సేవలో’ డబ్బులు జమయ్యేలా సంబంధిత అధికారులతో మాట్లాడతామని నచ్చజెప్పడంతో కళ్యాణ్‌కుమార్ టవర్ దిగాడు.