బంగారు దుకాణాలపై అధికారుల దాడులు
ABN , Publish Date - Aug 01 , 2025 | 12:13 AM
నరసన్నపేట పట్టణంలోని పలు బంగారు దుకాణాలపై తూనికలు, కొలతలు శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ చిన్నమ్మి ఆధ్వర్యంలో ఆశాఖ అధికారులు గురువారం దాడులు చేశారు.
నరసన్నపేట, జూలై 31(ఆంధ్రజ్యోతి): నరసన్నపేట పట్టణంలోని పలు బంగారు దుకాణాలపై తూనికలు, కొలతలు శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ చిన్నమ్మి ఆధ్వర్యంలో ఆశాఖ అధికారులు గురువారం దాడులు చేశారు. ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన నరసన్నపేటలో గోల్డ్‌మాల్ కథనంపై ఉన్నత అధికారులు స్పందించారు. వారి ఆదేశాల మేరకు తూనికల శాఖ అధికారులు బంగారు దుకాణాలపె దాడులు చేసి తూనిక యంత్రాలు, బిల్లులను పరిశీలించారు. వినియోగదారులకు ఇచ్చే బిల్లులపై బంగారు నాణ్యత తెలిపే వివరాలు లేకపోవడాన్ని గుర్తించారు. తూనిక యంత్రాలకు సీలింగ్ వేసుకోవాలన్నారు. రాళ్లతో కూడిన బంగారు ఆభరణాలను తూకం వేసే సమయంలో మోసాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కాగా, తూనికలు కొలతల శాఖ అధికారులు దాడులతో బంగారు వ్యాపారుల్లో అలజడి రేగింది. అధికారుల రాక సమాచారం తెలుసుకున్న కొందరు వ్యాపారులు తమ బండారం బయట పడకుండా ఉండేందుకు తూకం యంత్రాల్లో తేడాలను సరి చేశారు. మరికొందరు దుకాణాలను మూసివేశారు. ఇంకొందరు శ్రావణ మాసం ప్రత్యేకంగా తయారు చేసిన కాసులు బయటకు కనిపించకుండా ఆదరబదరాగా దుకాణాల నుంచివాటిని మాయం చేసినట్లు సమాచారం.