Share News

బంగారం దుకాణాలపై దాడులు

ABN , Publish Date - Sep 26 , 2025 | 11:58 PM

Searches target wholesale businesses నరసన్నపేటలో బంగారం దుకాణాలపై కేంద్ర జీఎస్టీ కస్టమ్స్‌ అధికారులు శుక్రవారం దాడులు చేపట్టారు. నరసన్నపేటలో అడ్డదారిలో బంగారం వ్యాపారం సాగుతున్నట్టు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం కేంద్ర జీఎస్టీ అండ్‌ కస్టమ్స్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ వర్మ నేతృత్యంలో ప్రత్యేక బృందాలు పట్టణంలో బంగారం షాపులు, హోల్‌సేల్‌ వ్యాపారుల ఇళ్లలో సోదాలు చేశాయి.

బంగారం దుకాణాలపై దాడులు
నరసన్నపేట ఆదివారం జంక్షన్‌ వద్ద హోల్‌సేల్‌ బంగారం షాపులో సోదాలు చేస్తున్న కేంద్ర జీఎస్టీ అండ్‌ కస్టమ్స్‌ అధికారులు

హోల్‌సేల్‌ వ్యాపారాలే లక్ష్యంగా సోదాలు

జీరో ట్యాక్స్‌ లావాదేవీలపై ఆరా

షాపులు, ఇళ్లలో సోదాలు

వ్యాపారుల్లో అలజడి

నరసన్నపేట, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): నరసన్నపేటలో బంగారం దుకాణాలపై కేంద్ర జీఎస్టీ కస్టమ్స్‌ అధికారులు శుక్రవారం దాడులు చేపట్టారు. నరసన్నపేటలో అడ్డదారిలో బంగారం వ్యాపారం సాగుతున్నట్టు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం కేంద్ర జీఎస్టీ అండ్‌ కస్టమ్స్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ వర్మ నేతృత్యంలో ప్రత్యేక బృందాలు పట్టణంలో బంగారం షాపులు, హోల్‌సేల్‌ వ్యాపారుల ఇళ్లలో సోదాలు చేశాయి. స్థానిక తమ్మయ్యపేటలోని ఉప్పు గిరి ఇంట్లో సోదాలు చేసి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం పేట జంక్షన్‌లోని శ్రీగౌరీ శంకర్‌ జ్యూయలర్స్‌ షాపులో కూడా దాడులు చేశారు. శుక్రవారం ఉదయం 10గంటలు నుంచి రాత్రి వరకు సోదాలు చేసి పలు రికార్డులను పరిశీలించారు. ఇటీవల కోయంబత్తూరులో బంగారం వ్యాపారి నుంచి భారీ మొత్తంలో జీరో ట్యాక్స్‌లో లావాదేవీలు నిర్వహించినట్లు అధికారుల దాడుల్లో బయట పడింది. దీంతో ఈ వ్యవహారంలో నరసన్నపేటలోని మరో నాలుగు హోల్‌సేల్‌ దుకాణాలతో పాటు మరికొందరు వ్యాపారుల లావాదేవీలు, జీరోట్యాక్స్‌ వ్యాపారంపై అధికారులు ఆరా తీశారు. హోల్‌సేల్‌ వ్యాపారులు తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి గత మూడేళ్లుగా ఎంతెంత బంగారం లావాదేవీలు నిర్వహించారు. సంబంధిత బంగారాన్ని స్థానికంగా ఎవరికి విక్రయించారో.. వాటి డాక్యుమెంట్లను పరిశీలించినట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో దాడులు నిర్వహించి వివరాలను వెల్లడిస్తామని సంబంధిత శాఖ అధికారి తెలిపారు. దర్యాప్తు పూర్తయితే పేట హోల్‌సేల్‌ వ్యాపారుల బండారం బయట పడే అవకాశం ఉంది.

తొలిసారిగా దాడులు

నరసన్నపేటలో ఇటీవల బంగారం వ్యాపారంలో లుకలుకలపై బ్యూరో అఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ అధికారులు దాడులు నిర్వహించి నకిలీ హాల్‌మార్కులు వేసి అమ్మకాలు చేస్తున్న గుడ్ల నాగరాజుకు చెందిన జీఎన్‌ఆర్‌ బంగారం షాపులో తనిఖీలు చేసి బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నకిలీ హాల్‌మార్కు వేసిన షాపుపై దాడులు చేపట్టారు. తాజాగా నరసన్నపేటలో కేంద్ర జీఎస్టీ అండ్‌ కస్టమ్స్‌ అధికారులు దాడులు చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా జీఎస్టీ అధికారుల దాడులతో బంగారం వ్యాపారుల్లో అలజడి రేగింది. తూనికలు కొలతలుశాఖ, బీఐఎస్‌, జీఎస్టీ అధికారులు ఎవరు దాడిచేసినా తాము చేసే వ్యాపారాల బండారం బయట పడతుందని భయాందోళన చెందారు. ఈ నేపథ్యంలో చాలామంది వ్యాపారులు బంగారం దుకాణాలను మూసేశారు.

Updated Date - Sep 26 , 2025 | 11:58 PM