Share News

మద్యం మత్తులో యువకుడిపై దాడి

ABN , Publish Date - Aug 13 , 2025 | 12:14 AM

: పండ్ల దుకాణంలో పనిచేస్తున్న యువకుడిపై మద్యం మత్తులో సంబంధిత యజమాని స్నేహితుడితో కలిసి దాడి చేసిన ఘటనలో అరసవల్లికి చెందిన ఉల్లాకుల రాజేష్‌(30) విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన సంచలనం కలిగించింది. ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది.

    మద్యం మత్తులో యువకుడిపై దాడి
రాజేష్‌ (ఫైల్‌ )

శ్రీకాకుళం క్రైం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): పండ్ల దుకాణంలో పనిచేస్తున్న యువకుడిపై మద్యం మత్తులో సంబంధిత యజమాని స్నేహితుడితో కలిసి దాడి చేసిన ఘటనలో అరసవల్లికి చెందిన ఉల్లాకుల రాజేష్‌(30) విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన సంచలనం కలిగించింది. ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఉల్లాకుల రాజేష్‌ పొట్టి శ్రీరాములు మార్కెట్‌లో పండ్ల దుకాణం నిర్వహిస్తున్న వంశీ వద్ద కొన్నేళ్లు గా పనిచేస్తున్నాడు. ఈ నెల 3న యజమాని వంశీ రాత్రి దుకాణానికి వచ్చి వ్యాపారం ఎంత జరిగిం దని రాజేష్‌ను ప్రశ్నించాడు. రూ.24 వేలు అయిందని చెప్పాడు. అయితే అప్పటికే మద్యం మత్తులో ఉన్న వంశీ రోజువారి ఇచ్చిన ఆదాయం కంటే తక్కువ ఎందుకయిందని కోపోద్రిక్తుడై రాజేష్‌పై దాడిగి దిగాడు. అయితే ఈ రోజు ఆదివారమని, మార్కెట్‌లో వ్యాపారం మందగించిందని, కనుకే రూ.24 వేలే అయిందని చెప్పగా దానికి వంశీ ఆగ్రహం వ్యక్తం చేసి మరోసారి దాడికి పాల్పడ్డాడు. రాజేష్‌ చేసేదేమీ లేక అక్కడి నుంచి పారిపోయాడు. వంశీ అతని స్నేహితుడైన రామకృష్ణకు ఫోన్‌ ద్వారా పిలిపించుకొని తన వద్ద పనిచేస్తున్న రాజేష్‌ మోసం చేశాడంటూ చెప్పాడు. రామకృష్ణ కూడా మార్కెట్‌ వద్దకు చేరుకొని వారిద్దరు రాజేష్‌కు ఫోన్‌ చేసి నీవు ఎక్కడున్నావు, మా వద్దకు రాకపోతే నీ ఇంటి వద్దకు వచ్చి గలాటా చేసి నీ భార్యను కూడా వీధిలోకి లాగుతామని బెదిరిం చారు. దీంతో రాజేష్‌ తాను అరసవల్లి జంక్షన్‌ వద్ద ఉన్నానని తెలపగా వంశీ, రామకృష్ణ అక్కడకు చేరుకొని రాజేష్‌ను దుకాణం వద్దకు పిలిచి మద్యం సేవించి మరలా దాడి చేశారు. దాడి అనం తరం వంశీ, రామకృష్ణ ఆటోలో వెళ్లిపోతుండగా రాజేష్‌ తాను ఏం తప్పు చేశానని, ఇంతలా దాడి చేశారని ప్రశ్నించగా మరలా ఆటోలో ఎక్కించుకొని తీవ్రంగా చితకబాది ఆటో నుంచి నెట్టివేశారు. రాజేష్‌కు తల వెనుకభాగాన తీవ్ర గాయాలయ్యాయి. రాజేష్‌ను అరసవల్లి వద్ద ఉన్న ఇంటి వద్దకు తీసుకువెళ్లి ఆరు బయట వదిలేశారు. ఆదివారం అర్థరాత్రి ఘటన జరిగినా రాజేష్‌ను కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం వరకు చూడలేదు. ఉదయం అతని భార్య వచ్చి చూసేసరికి మద్యం మత్తులో ఉన్నాడేమోనని ఇంటిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టింది. అయితే సాయంత్రమైనా రాజేష్‌ స్పృహలోకి రాకపోవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి రిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. బాధితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం రిమ్స్‌ వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు రిఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం రాజేష్‌ మృతి చెందాడు. సమాచారం అందుకున్న శ్రీకాకుళం వన్‌టౌన్‌ ఎస్‌ఐ హరికృష్ణ.. దాడికి పాల్పడిన వంశీ, రామకృష్ణలను 10 రోజుల తరువాత అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈమేరకు మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం నడిబొడ్డున ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఇటువంటి ఘటన జరగడం వ్యాపార వర్గాలు, ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

Updated Date - Aug 13 , 2025 | 12:14 AM