Share News

ఆటోడ్రైవర్ల సేవలో..

ABN , Publish Date - Oct 04 , 2025 | 11:54 PM

13,887 Auto drivers will benefit మీ కష్టానికి, గౌరవానికి ఇది ఒక గుర్తింపు. రోగులను ఆస్పత్రికి తీసుకెళ్లాలన్నా.. విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాలన్నా, ఏ సమయంలోనైనా గుమ్మం వద్దకే చేర్చే మీ సేవలు అపురూపం. అటువంటి మీకు కూటమి ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుంది’ అని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు భరోసా ఇచ్చారు.

ఆటోడ్రైవర్ల సేవలో..
కార్యక్రమంలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

  • జిల్లాలో 13,887 మందికి రూ.20.83కోట్ల లబ్ధి

  • మీ కష్టానికి, గౌరవానికి ఇది ఒక గుర్తింపు

  • అన్నివిధాలా అండగా ఉంటాం

  • కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు

  • అరసవల్లి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ‘మీ కష్టానికి, గౌరవానికి ఇది ఒక గుర్తింపు. రోగులను ఆస్పత్రికి తీసుకెళ్లాలన్నా.. విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాలన్నా, ఏ సమయంలోనైనా గుమ్మం వద్దకే చేర్చే మీ సేవలు అపురూపం. అటువంటి మీకు కూటమి ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుంది’ అని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు భరోసా ఇచ్చారు. శనివారం శ్రీకాకుళంలో ‘ఆటోడ్రైవర్ల సేవలో’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. బలగ ప్రాంతం నుంచి ఆయన ఆటోడ్రైవర్‌ యూనిఫాం వేసుకుని, స్వయంగా ఆటో నడిపారు. ఏడురోడ్లజంక్షన్‌ వరకూ ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఎన్టీఆర్‌, కింజరాపు ఎర్రన్నాయుడు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మునిసిపల్‌ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఆటోడ్రైవర్ల సేవలో కార్యక్రమం ఎంతో సంతృప్తినిస్తోంది. ఎన్నికల హామీమేరకు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించాం. దీనివల్ల మీ ఇబ్బందులను గుర్తించి.. ప్రభుత్వం ‘ఆటోడ్రైవర్ల సేవలో’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద అర్హులైన ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.15వేలు చొప్పున అందజేస్తోంది. గత ప్రభుత్వం రూ.10వేలు చొప్పున ఇచ్చినా.. ట్యాక్స్‌లు, చలానాల పేరిట మోసగించి డబ్బులు లాగేసుకుంది. గతుకుల రోడ్లతో మీ ఆరోగ్యాలను పాడు చేసింది. మా కూటమి ప్రభుత్వం రోడ్లను బాగు చేసింది. ‘ఆటోడ్రైవర్ల సేవలో’ పథకం కింద గత ప్రభుత్వం కన్నా అదనంగా మరో 5వేలు అందజేస్తున్నాం. నేరుగా ఆటోడ్రైవర్ల బ్యాంకు ఖాతాలో నిధులు జమ చేశాం. జిల్లాలో 13,887 మంది ఆటోడ్రైవర్లకు రూ.20.83కోట్ల లబ్ధి చేకూరుతోంది. ఇంకా అర్హులెవరికైనా ఈ పథకం వర్తించకపోతే ‘మీ-కోసం(గీవెన్స్‌)’లో ఫిర్యాదు చేయండి. అధికారులు పరిశీలించి అర్హులకు పథకం వర్తింపజేస్తార’ని కేంద్రమంత్రి తెలిపారు. జీఎస్టీ 2.0తో ధరలు తగ్గాయని, ఎలక్ర్టిక్‌ ఆటోల వినియోగానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆటోడ్రైవర్ల కోసం పట్టణంలో ఒక భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఖాకీ యూనిఫాం ధరించానని.. ఖద్దరు కన్నా ఎక్కువ ధైర్యంగా అనిపిస్తోందన్నారు. కుటుంబ సభ్యుడిలా ఆటోడ్రైవర్ల కష్టసుఖాల్లో అండగా ఉంటామని స్పష్టం చేశారు.

  • జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘ఈ పథకం ఆటోడ్రైవర్ల అందరి కోసం. మీ బాగు కోసం ప్రభుత్వం పనిచేస్తోంది. స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మీకు ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించాం. మిమ్మల్ని ఆదుకునేలా ఈ పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.15వేలు అందజేశాం. ఇది మొదలు మాత్రమే. మున్ముందు మరిన్ని మంచి పనులు చేయనున్నామ’ని తెలిపారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ.. ‘ఆటోడ్రైవర్ల సేవలో’ పథకం ద్వారా లబ్ధి పొందిన నగదును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

  • శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ మాట్లాడుతూ.. ‘శ్రీకాకుళం నియోజకవర్గంలో 2011 మందికి ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుతుంది. సొంత ఆటోలు, క్యాబ్‌లు కలిగి, ఫిట్‌నెస్‌, ఇన్స్యూరెన్స్‌ పత్రాలున్న అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేశామ’ని తెలిపారు.

  • కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ, ఆర్డీవో సాయిప్రత్యూష, కార్పొరేషన్‌ కమిషనర్‌ ప్రసాదరావు, ఉప రవాణా అధికారి ఎ.విజయసారధి, ఆర్టీవో పివి.గంగాధర్‌, పీఎంజే బాబు, కలగ జగదీష్‌, అరవల రవీంద్ర, శవ్వాన ఉమామహేశ్వరి, పాండ్రంకి శంకర్‌, మాదారపు వెంకటేష్‌, ఆటోడ్రైవర్లు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

  • మా కష్టాలు తెలిసిన నాయకుడు

  • ‘మా కష్టాలు తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు’ అని బలగలోని శ్రీ భవానీ ఆటోడ్రైవర్ల సంక్షేమం సంఘం సభ్యులు చుక్క అప్పన్న, కరగాన సోమేశ్‌, చమళ్ల తిరుపతిరావు, లోకేశ్‌, నర్సింహమూర్తి ఆనందం వ్యక్తం చేశారు. స్త్రీశక్తి పథకంతో తామంతా ఇబ్బందులు పడుతున్నామని గుర్తించి.. అండగా నిలిచినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

  • చంద్రబాబుకు రుణపడి ఉన్నాం

  • నేను గత 25 ఏళ్లుగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాను. మహిళలకు ఉచిత బస్సు పథకంతో మేం ఇబ్బందులు పడుతున్నాం. ఈ విషయాన్ని గుర్తించి, వెంటనే స్పందించింది కూటమి ప్రభుత్వం. ఇంత సత్వరంగా ఒక ప్రభుత్వం స్పందించి మాకు రూ.15వేలు ఆర్థిక సహాయం అందించడం నిజంగా గొప్ప విషయం. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మేమంతా రుణపడి ఉన్నాం.

    - ఎం.రాజారావు, ఆటోడ్రైవర్‌, మంగువారితోట

Updated Date - Oct 04 , 2025 | 11:54 PM