ధాన్యం రైతులకు భరోసా
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:07 AM
Money was deposited within five to six hours of the sale రైతులకు సహాయం, భరోసా, నమ్మకం కలిగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ధాన్యం కొనుగోలు చేసిన కేవలం 5 నుంచి ఆరు గంటల్లోనే వారి ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామ’ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
విక్రయించిన ఐదారు గంటల్లోనే సొమ్ము జమ
పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
పారదర్శకంగా ప్రక్రియ చేపట్టాలని ఆదేశాలు
శ్రీకాకుళం, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ‘రైతులకు సహాయం, భరోసా, నమ్మకం కలిగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ధాన్యం కొనుగోలు చేసిన కేవలం 5 నుంచి ఆరు గంటల్లోనే వారి ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామ’ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సోమవారం శ్రీకాకుళంలో ఉత్తరాంధ్రలో ఆరుజిల్లాలకు సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లాపరిషత్ కార్యాలయంలో రైస్ మిల్లర్లు, వివిధ రైతు సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆదేశాల మేరకు.. శాఖలో సాంకేతికతతో కూడిన సంస్కరణలను చేపడుతున్నామని తెలిపారు. రైస్ మిల్లర్ల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు.
తూకంలో మోసం.. అలసత్వంపై హెచ్చరిక
‘ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు పునరావృతం అయితే ఉపేక్షించేది లేద’ని రైస్‌మిల్లర్లను, అధికారులను మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. రైతుల వద్ద 80కిలోల తూకం ఉన్నచోట 75 కేజీలుగా నమోదు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని.. వారికి అన్యాయం చేయొద్దని స్పష్టం చేశారు. తేమ శాతం పరీక్షల్లో ఏకరూపత కోసం రైతుసేవా కేంద్రాలు, రైస్‌మిల్లుల వద్ద ఒకే కంపెనీకి చెందిన యంత్రాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
యాభై లక్షల టన్నుల కొనుగోళ్లతో..
విలేకరులతో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ‘ఖరీఫ్ సీజన్‌లో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి చరిత్ర సృష్టించబోతున్నాం. ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాలలో గతంలో 11.45 లక్షల టన్నులు కొనుగోలు చేయగా.. ఈ సారి లక్ష్యాన్ని 13 లక్షల టన్నులకు పెంచాం. గతంలో కొనుగోళ్లు మిల్లుకే పరిమితమయ్యాయి. కానీ మా ప్రభుత్వం రైతులకు నమ్మకమున్నచోట ధాన్యం విక్రయించే వెసులుబాటును తీసుకువచ్చింది. నూరుశాతం రాయితీపై టార్పాలిన్‌లను అందజేస్తాం. ఉత్తరాంధ్రలో వారం రోజుల్లోపు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. రైస్ మిల్లర్ల కోసం ఈ ఏడాది 1:2 నిష్పత్తిలో బ్యాంకు గ్యారెంటీలను తీసుకుంటామ’ని చెప్పారు.
‘అకాల వర్షాలతో రైతులు తక్కువ ధరకే ధాన్యం అమ్మాల్సిన పరిస్థితి లేకుండా కనీస మద్దతు ధర కల్పిస్తాం. రాష్ట్రంలో 41వేల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, 400కు పైగా వసతిగృహాలలో మంచి బియ్యంతో నాణ్యమైన భోజనాన్ని అందించడం కూటమి ప్రభుత్వానికి మరింత ప్రతిష్టను, సంతృప్తిని ఇస్తోంది. ఇది ప్రభుత్వ ప్రాధామ్యాల్లో ఒకటిగా నిలుస్తోంద’ని మంత్రి తెలిపారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్‌గౌర్, చైర్మన్, ఎండీ మన్‌జీర్ జిలానీ సమూన్, డైరెక్టర్ గోవిందరావు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్, రైస్‌మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు, కౌలు రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.