దసరా సంబరాలకు ఏర్పాట్లు
ABN , Publish Date - Sep 21 , 2025 | 11:34 PM
పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఇచ్ఛాపురం, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం నుంచి ఈ ఉత్సవాలు నిర్వహణకు గాను నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఆలయాలు, మందిరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వివిధ మండపాల్లో అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. గ్రామదేవత స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీపారాధన కోసం ప్రత్యేక మండపాన్ని సిద్ధం చేశారు. సోమవారం వేకువ జామునుండే పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గాంధీ పార్క్ వద్ద ముత్యా లమ్మ, ముత్యాలమ్మపేట వద్ద ముత్యాలమ్మ, డబ్బూరి వీధి జంక్షన్ వద్ద కలకత్తా కాళీ మాత ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు 10 రోజుల పాటు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే సంతపేట జంక్షన్ వద్ద వెలసిన నూకాలమ్మ తల్లి అమ్మ వారి ఆలయంలో దేవీ శరన్నరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నామని ఆలయ ధర్మక ర్తలు కాళ్ల శ్రీనివాసరావు, లక్ష్మి తెలిపారు. సోమవారం నుంచి అక్టోబరు ఒకటో తేదీ వరకు అమ్మ వారు వివిధ అవతారాల్లో దర్శనమిస్తారన్నారు.
పురుషోత్తపురంలో..
సరుబుజ్జిలి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): పురుషోత్తపురంలో సోమవారం నుంచి నిర్వహించనున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు కమిటీ సభ్యులు సర్వం సిద్ధం చేశారు. విద్యుత్ అలంకరణలు, పచ్చని తోరణాలతో మందిరాన్ని తీర్చిదిద్దారు. అమ్మవారి గుడి ఆకారంలో బంగారుఛాయలో ఉన్న సెట్ ఆకట్టుకుంటోంది. ప్రతిరోజూ కుంకుమ పూజలు, హోమాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.