Share News

మహిళలంటే అంత చులకనా?

ABN , Publish Date - Jun 10 , 2025 | 12:29 AM

Women's rights Gender equality టీడీపీ మహిళా విభాగం నేతలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భగ్గుమన్నారు. సాక్షి మీడియాలో ఇటీవల అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినవారితోపాటు ఆ మీడియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఎచ్చెర్లలోని సాక్షి కార్యాలయం వద్ద ధర్నా చేశారు.

మహిళలంటే అంత చులకనా?
ఎచ్చెర్లలో సాక్షి కార్యాలయం వద్దధర్నా చేస్తున్న తెలుగు మహిళా నేతలు, టీడీపీ శ్రేణులు

సాక్షి మీడియాలో వ్యాఖ్యలపై నిరసనాగ్రహం

ఎచ్చెర్లలో కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణుల ధర్నా

బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు

నేమ్‌బోర్డు తొలగించి.. పత్రికలు దహనం

ఎచ్చెర్ల/ టెక్కలి, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): టీడీపీ మహిళా విభాగం నేతలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భగ్గుమన్నారు. సాక్షి మీడియాలో ఇటీవల అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినవారితోపాటు ఆ మీడియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఎచ్చెర్లలోని సాక్షి కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కార్యాలయం ముందు బైఠాయించి.. అమరావతి మహిళలపై అమానుష వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. కొమ్మినేని శ్రీనివాస్‌ హోస్ట్‌గా నిర్వహించిన డిబేట్‌లో జర్నలిస్ట్‌ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని మండిపడ్డారు. మహిళలంటే అంత చులకనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి బాధ్యత వహించి సాక్షి యాజమాన్యం తరపున వైఎస్‌ భారతీరెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సాక్షి దినపత్రికలను దహనం చేసి, కార్యాలయానికి చెందిన నేమ్‌బోర్డును తొలగించి మంటల్లో వేశారు. సాక్షి కార్యాలయం గేటుకు చెప్పుల దండను వేలాడదీశారు. కార్యాలయం గేటు నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు సర్దిచెప్పడంతో శాంతించారు. డీఎస్పీ వివేకానంద, జేఆర్‌పురం సీఐ అవతారం, ఎచ్చెర్ల ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్‌, పోలీసు సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరిస్థితిని సమీక్షించారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మి, శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు మెట్ట సుజాత, శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్‌, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, డీసీఎంఎస్‌ అధ్యక్షుడు చౌదరి అవినాష్‌, ముప్పిడి సుజాత, కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ అన్నెపు భువనేశ్వరరావు, ఎచ్చెర్ల మండల టీడీపీ అధ్యక్షుడు బెండు మల్లేశ్వరరావు, టీడీపీ నేతలు మెండ దాసునాయుడు, పైడి ముఖలింగం, బల్లాడ అరుణ, మెండ రాజారావు, కొత్తకోట అమ్మినాయుడు, గూరు జగదీష్‌బాబు, మూకళ్ల భాస్కరరావు, అల్లుపల్లి రాంబాబు, కైబాడి రాజు పాల్గొన్నారు.

టెక్కలిలోనూ పత్రికలు దహనం చేసి.. నిరసన

సాక్షి మీడియాలో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన.. ఆ చానెల్‌కు చెందిన కొమ్మినేని శ్రీనివాసరావు(కేఎస్‌ఆర్‌), కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని టెక్కలి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు పూజారి శైలజ, రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి మెట్ట పద్మావతి డిమాండ్‌ చేశారు. సోమవారం రాత్రి టెక్కలిలో సాక్షి దినపత్రికలను దహనం చేశారు. అనంతరం కేఎస్‌ఆర్‌, కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలంటూ సీఐ విజయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘రాజధాని అమరావతి మహిళలను కించపరుస్తూ మాట్లాడడం అవివేకానికి నిదర్శనం. అమరావతి అభివృద్ధిని చూడలేని జగన్‌మోహన్‌రెడ్డి ఇలాంటి తప్పుడు వ్యక్తులతో విష ప్రచారాలు చేయిస్తున్నారు. కోట్లాదిమంది ఆంధ్రా మహిళలను మనోవేదనకు గురిచేశార’ని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మట్ట సుందరమ్మ, మెండ దమయంతి, దేవాది సింహాద్రమ్మ, వాన లక్ష్మి, బెండి అన్నపూర్ణ, అల్లు తులసమ్మ, రూపమ్మ, అరుణ, హేమని, సునీత, నీరజ పాల్గొన్నారు.


nirsasana-1.gif

Updated Date - Jun 10 , 2025 | 12:29 AM