Share News

పట్టాలు సరే స్థలాలేవీ?

ABN , Publish Date - Sep 24 , 2025 | 12:15 AM

ఈ ఇద్దరే కాదు. దాదాపు 196 మంది లబ్ధిదారులదీ ఇదే పరిస్థితి.

పట్టాలు సరే స్థలాలేవీ?
రణస్థలంలోని వివాదాస్పద జగనన్న లేఅవుట్‌ ఇదే

- జగనన్న లేఅవుట్లుగా వివాదాస్పద భూములు

- పట్టాలు అందించిన తరువాత కోర్టు కేసులు

- గత వైసీపీ పాలకుల నిర్వాకం

-ఆందోళనలో 196 మంది బాధితులు

20rnm01.gif

-ఈమె పేరు మహదాసు రమణమ్మ. రణస్థలం గ్రామానికి చెందిన ఈమెకు వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీ లేఅవుట్‌లో అధికారులు ఇంటి పట్టా ఇచ్చారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఆమె పేరిట రిజిస్ట్రేషన్‌ కూడా చేశారు. పట్టా చేతిలో పెట్టారు. కానీ, స్థలం మాత్రం చూపించలేదు. అదేంటంటే కోర్టులో పెండింగ్‌లో ఉందని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

20rnm02.gif

-రణస్థలం గ్రామానికి చెందిన ఈమె పేరు మహంతి గౌరి. జగనన్న కాలనీ లేఅవుట్‌లో సెంటున్నర స్థలం మంజూరు కావడంతో ఆమె ఎంతగానో సంతోషించారు. ఆమె పేరుతో అధికారులు రిజిస్ట్రేషన్‌ చేయించి చేతిలో పట్టా పెట్టారు. తీరా లేఅవుట్‌ వద్దకు వెళ్లేసరికి కోర్టులో ఉందని చెప్పడంతో ఆమె తీవ్ర నిరాశ చెందారు.

రణస్థలం, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): ఈ ఇద్దరే కాదు. దాదాపు 196 మంది లబ్ధిదారులదీ ఇదే పరిస్థితి. నవరత్నాల్లో భాగంగా జగన్‌ సర్కారు పేదలకు సొంతంటి కల నెరవేర్చేందుకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. రణస్థలం మండలానికి సంబంధించి రణస్థలంతో పాటు జేఆర్‌పురంలో లేఅవుట్లను గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రణస్థలానికి సంబంధించి రెండు విడతల్లో 134 మందికి ఇళ్ల పట్టాలు నాటి అధికారులు, వైసీపీ పాలకులు అందించారు. ఇళ్లు కూడా మంజూరు చేసినట్టు అప్పట్లో ప్రకటించి వారి పేరుతో రిజిస్ట్రేషన్లు కూడా చేయించి పట్టాలు చేతిలో పెట్టారు. తమకు ఇళ్ల పట్టాలు వచ్చాయని అంతా సంబరపడ్డారు. కానీ, లేఅవుట్ల వద్దకు వెళితే స్థలం చూపించలేదు. అదేంటని ప్రశ్నిస్తే కోర్టులో పెండింగ్‌ ఉందని.. వచ్చిన వెంటనే ఇంటి స్థలం అప్పగిస్తామని చెప్పుకొచ్చారు. జేఆర్‌పురంలో కూడా అదే పరిస్థితి. అక్కడ పేదల కోసమని లేఅవుట్‌ను ఏర్పాటు చేశారు. రెండు విడతల్లో 141 ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. 62 పట్టాలకు సంబంధించి ఇళ్ల స్థలాలు కోర్టు కేసుల్లో ఉన్నాయని చెప్పి పెండింగ్‌లో పెట్టారు.

ఆందోళనలో బాధితులు

పట్టాలతో పాటు ఇళ్లు సైతం పొందారని 196 మంది పేర్లు ప్రభుత్వ రికార్డులోకి ఎక్కాయి. కానీ, వాస్తవానికి మాత్రం వారికి ఎటువంటి లబ్ధి చేకూరలేదు. రణస్థలం మండలంలోని జగనన్న లేఅవుట్లకు సంబంధించి పెద్ద గోల్‌మాల్‌ జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు వివాదాస్పద భూములను జగనన్న కాలనీ లేఅవుట్ల కోసం కేటాయించినట్లు తెలుస్తోంది. అధిక ధరకు వాటిని కొనుగోలు చేసి ప్రభుత్వ ఖజానాకు సైతం చిల్లు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో వారే కోర్టులో కేసులు వేయించి లబ్ధిదారులకు స్థలాలు దక్కకుండా మోసం చేసినట్లు విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మారిపోవడంతో ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

ప్రభుత్వం దృష్టిపెట్టింది..

రణస్థలం, జేఆర్‌పురంలోని జగనన్న ఇళ్ల స్థలాలకు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇవి కోర్టు పరిధిలో ఉన్నాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారిచ్చే సూచనల మేరకు నడుచుకుంటాం. ఇప్పటికే ఇళ్ల పట్టాల అక్రమాలపై ప్రభుత్వం దృష్టిపెట్టింది.

-సనపల కిరణ్‌కుమార్‌, తహసీల్దార్‌, రణస్థలం

Updated Date - Sep 24 , 2025 | 12:15 AM