ఆలయాలు భద్రమేనా?
ABN , Publish Date - Nov 03 , 2025 | 11:16 PM
కాశీబుగ్గలోని ఓ ప్రైవేట్ ఆలయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో తొమ్మిది మంది భక్తులు మృతి చెందగా, మరికొందరు గాయపడిన విషయం తెలిసిందే.
- కానరాని బారికేడ్లు, సీసీ కెమెరాలు
- కొన్నిచోట్ల అనుమతులు లేకుండానే గుడుల నిర్మాణం
- ప్రైవేటు ఆలయాల్లో కరువైన భద్రత
- కాశీబుగ్గ ఘటనతో వెలుగుచూస్తున్న డొల్లతనం
- అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తుల విన్నపం
మెళియాపుట్టి/పాతపట్నం/నరసన్నపేట, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గలోని ఓ ప్రైవేట్ ఆలయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో తొమ్మిది మంది భక్తులు మృతి చెందగా, మరికొందరు గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఆలయాల్లో భద్రత ఎంత? అనే ప్రశ్న సర్వత్రా ఉత్పన్నమవుతోంది. జిల్లాలో అరసవల్లి సూర్యనారాయణ స్వామి, శ్రీముఖలింగంలోశ్రీముఖలింగేశ్వర, రావివలసలో ఎండలమల్లికార్జున, శ్రీకూర్మంలో కూర్మనాథ, పాతపట్నంలో నీలమణిదుర్గ, శ్రీకాకుళంలోఉమా రుద్రకోటేశ్వర వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అలాగే, నరసన్నపేట, పలాస, మందస, హిరమండలం, టెక్కలి, సోంపేట, కొత్తూరు ఎచ్చెర్ల, రణస్థలం తదితర మండలాల్లో ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో కొన్ని దేవాలయాలు ఉన్నాయి. ప్రైవేట్ ఆలయాల్లో భద్రతా లోపాలు అధికంగా కనిపిస్తున్నాయి. చాలా ఆలయాల్లో సీసీ కెమెరాలు, బారికేడ్లు లేవు. తరచూ క్యూలైన్లలో భక్తుల మధ్య తోపులాటలు చోటుచేసుకుంటున్నాయి. చిన్నచిన్న గాయాలతో భక్తులు బయటపడుతున్నారు.
రావివలసలోని ఎండల మల్లికార్జునస్వామి దర్శనానికి జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. కార్తీక సోమవారాలు, శివరాత్రి వంటి పర్వదినాల్లో అయితే భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ తాత్కాలిక బారికేడ్‌లు ఏర్పాటు చేయడంతో తొక్కిసలాట వంటి ఘటనలు జరిగితే పరిస్థితి ఏంటని భక్తులు అంటున్నారు.
పాతపట్నంలోని నీలకంఠేశ్వర స్వామిని కార్తీక మాసంలో అధికసంఖ్యలో భక్తులు దర్శించుకుంటుంటారు. ఈ ఆలయానికి స్థానిక మహేంద్ర తనయ నదిపైగల భద్రతలేని కాజ్‌వే వంతెనపై నుంచే వెళ్లాల్సి ఉంటుంది.
శ్రీముఖలింగేశ్వరుని దర్శనానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కార్తీక మాసంతోపాటు శివరాత్రి రోజున నదీ స్నానాలు వంటివి జరుగుతుంటాయి. అక్కడ తాత్కాలిక బారికేడ్‌లే ఉన్నాయి. ఆలయ పరిసరాల్లో అపరిశుభ్రత నెలకొంది. ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది.
పాతపట్నం నీలమణిదుర్గ ఆలయంలో కూడా సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. బారికేడ్‌ల ఏర్పాటు చేసినప్పటికీ అవి అంతంత మాత్రంగానే ఉండడంతో భక్తుల్లో భయాందోళన నెలకొంటుంది.
దేవదాయశాఖ ఆధ్వర్యంలో 6,267.87 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆలయాల పర్యవేక్షణకు 95మంది ఈవోలు ఉన్నారు. ఒక్కొక్కరు 20 నుంచి 25 ఆలయాల బాఽధ్యతలు చూస్తున్నారు. ఆలయాలకు వచ్చే ఆదాయం మాత్రమే పర్యవేక్షించి, మిగిలినవి వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
దేవదాయశాఖ ఆధ్వర్యంలో 739 ఆలయాలే..
జిల్లాలో సుమారు 13వేల దేవాలయాలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో కేవలం 739 మాత్రమే దేవదాయశాఖ ఆధ్వర్యంలో ఉన్నాయి. వీటిలో 108 ఆలయాలకు కార్యనిర్వాహక అధికారులు ఉన్నారు. 12వేలకు పైగా ఆలయాలు గ్రామ కమిటీలు, పురోహితులు, అర్చకుల నిర్వహణలో నడుస్తున్నాయి. మరికొన్ని ఆలయాలకు ఎలాంటి కమిటీలు లేవు. టీటీడీ, ప్రభుత్వాలు ఆర్థికంగా సహాయం చేయడంతో ఇటీవల గ్రామాల్లో పెద్ద పెద్ద ఆలయాలను నిర్మించారు. పూర్వకాలంలో గ్రామాల్లో జమిందారి, సంపన్న కుటుంబాలు వివిధ ఆలయాలను కట్టాయి. ఇలాంటి ఆలయాలు దాదాపు 80 శాతం మేర ఉండగా, వీటి నిర్వహణ బాధ్యతలను వంశపారంపర్య ధర్మకర్తలు చూస్తున్నారు.
కానరాని సీసీ కెమెరాలు..
జిల్లాలో ప్రైవేట్ వ్యక్తుల పర్యవేక్షణలో నడుస్తున్న చాలా ఆలయాల్లో సీసీ కెమెరాలు లేవు. దీంతో ఆలయాల్లో ఏర్పాట్లపై పర్యవేక్షణ కొరవడుతోంది. పురాతన దేవాలయాల వద్ద భక్తులకు రక్షణ కూడా ప్రశ్నార్థంగా మారింది. తొక్కిసలాట జరిగిన కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో నాణ్యమైన బారికేడ్‌లు లేవని, భక్తుల భద్రతకు అనుగుణంగా ఆలయ నిర్మాణం జరగలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రైవేటు వ్యక్తులు ఆలయాలు నిర్మించాలంటే దేవదాయశాఖ ఇంజనీరింగ్ అధికారుల అనుమతి తీసుకోవాలి. దీనిపై ప్రజల్లో అవగాహన లేకపోవడంతో ఎవరికి నచ్చిన విధంగా వారు గుడులు నిర్మిస్తున్నారు. భక్తుల భద్రతను పట్టించుకోవడం లేదు. దీంతో తొక్కసలాట వంటి ఘటనలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. మందస మండలంలో వాసుదేవ ఆలయాన్ని ప్రైవేటుగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ బారికేడ్‌లు లేవని భక్తులు తెలుపుతున్నారు. కోష్ట తీరప్రాంతంలోని శ్రీహరి ఆలయంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. కార్తీకమాసంలోనే కాకుండా ఇతర సందర్భాలలోనూ ఆయా ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివెళ్తుంటారు. క్యూలైన్లతో పాటు తాగునీరు, ఇతర వసతులు ఉన్నాయా? భక్తులు సురక్షితంగా దైవదర్శనం చేసుకొని బయటకు వచ్చే పరిస్థితి ఉందా? లేదా? అనే విషయాన్ని అధికారులు పరిశీలించాల్సి ఉంది. ఎక్కడైనా లోపాలుంటే వాటిని సరిదిద్ది భక్తుల రక్షణకు తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. దేవదాయశాఖ పనితీరు అంతంతమాత్రంగానే ఉంది. దురదృష్టకర సంఘటనలు జరగకముందే సంబంఽధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
తేనేటీగల దాడి.. 15 మంది భక్తులకు గాయాలు
నరసన్నపేట, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఉర్లాంలోని త్రిపురసుందరీశ్వరస్వామి ఆలయం వద్ద సోమవారం ఉదయం తేనేటీగల దాడిలో 15 మంది భక్తులు గాయపడ్డారు. కార్తీక సోమవారం సందర్భంగా వివిధ గ్రామాల నుంచి భక్తులు ఆలయానికి వచ్చారు. ఉదయం 7.15 గంటల సమయంలో ఆలయ సమీపంలోని భారీవృక్షం మీద ఉన్న పక్షులు ఒక్కసారిగా ఎగరడంతో తేనే తొట్టే కదిలింది. దీంతో క్యూలైన్‌లో ఉన్న భక్తులపై తేనేటీగలు దాడి చేయడంతో 15 మంది గాయపడ్డారు. ఆ సమయంలో భక్తులు పరుగులు తీయడంతో ఏమి జరిగిందోనని స్థానికులు ఆందోళన చెందారు. చిన్నచిన్న గాయాలు కావడంతో భక్తులు ఇళ్లకు వెళ్లిపోగా, శేషు అనే వ్యక్తి ఉర్లాం పీహెచ్‌సీలో చికిత్స తీసుకున్నాడు.