కల సాకారమైన వేళ!
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:01 AM
Appointment letters for 530 constables ఆ నిరుద్యోగుల కల నెరవేరింది. కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం నియామక పత్రాలు అందజేసింది. దీంతో కొలువు దక్కిన అభ్యర్థుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
కానిస్టేబుళ్ల అభ్యర్థులకు నియామక పత్రాలు
జిల్లా నుంచి 530 మంది ఎంపిక
శ్రీకాకుళం, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఆ నిరుద్యోగుల కల నెరవేరింది. కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం నియామక పత్రాలు అందజేసింది. దీంతో కొలువు దక్కిన అభ్యర్థుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. వైసీపీ పాలనలో కానిస్టేబుళ్ల పోస్టుల కోసం ఏళ్లతరబడి వేచి చూశారు. కానీ ఊరించి ఉసూరుమనిపించేసింది గత ప్రభుత్వం. జాబ్‌క్యాలెండర్ అంటూ ఉత్తుత్తి ప్రచారం చేసి.. యువత ఆశలపై నీళ్లుచల్లింది. కాగా.. కూటమి ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేస్తామని.. యువతను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చింది. ఆ మేరకు ఈ ఏడాది ఆగస్టులో కానిస్టేబుళ్ల పోస్టుల ప్రక్రియకు సంబంధించి తుది ఫలితాలు విడుదల కాగా.. రాష్ట్రవ్యాప్తంగా 5,757 మంది అభ్యర్థులు కొలువులు సాధించారు. జిల్లా నుంచి ఏకంగా 530 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఇందులో ఏకంగా 60 శాతం వరకు ఏపీఎస్పీకి ఎంపికైనవారే. వారందరికీ మంగళగిరి వేదికగా మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌తోపాటు... పోలీసు శాఖ సమక్షంలో నియామక ధ్రువపత్రాలను అందజేశారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఆహ్వానం మేరకు జిల్లా నుంచి అభ్యర్థుతోపాటు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మొత్తంగా 900 మందిని 15 బస్సుల్లో మంగళగిరి తీసుకెళ్లారు. పండుగ మాదిరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు ఆనందంతో ఉప్పొంగారు. ధ్రువపత్రాలు అందుకున్నవారందరూ.. ఈనెల 22 నుంచి పోలీసు శాఖ నుంచి శిక్షణ తీసుకోనున్నారు.