Share News

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మత్తు వైద్యులను నియమించండి

ABN , Publish Date - Oct 02 , 2025 | 12:27 AM

ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో మత్తు వైద్యులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని..వీరిని నియమించేందుకు చొరవ చూపాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ను ఎమ్మెల్యే అశోక్‌ కోరారు.

 ప్రభుత్వ ఆస్పత్రుల్లో మత్తు వైద్యులను నియమించండి
వైద్యులతో మాట్లాడుతున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే

సోంపేట, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో మత్తు వైద్యులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని..వీరిని నియమించేందుకు చొరవ చూపాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ను ఎమ్మెల్యే అశోక్‌ కోరారు. స్థానిక ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి, డయాలసిస్‌ కేంద్రాన్ని ఎమ్మెల్యేతో కలసి కలెక్టర్‌ బుధవారం పరిశీలించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఆసుపత్రుల్లో మత్తు వైద్యులు లేకుంటే బయటి నుంచి తెచ్చుకొనేందుకు కొంత నిధిని కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఆసుపత్రుల్లో నిల్వ ఉంచేవారని తెలిపారు. ప్రస్తుతం అది కనిపించడం లేదన్నారు. డయాలసిస్‌ కేంద్రానికి వచ్చే బాధితులు వేచి ఉండేందుకు సరైన భవనం లేక పాకలో ఉంటున్నారని తెలిపారు. భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. రాత్రివేళల్లో విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని కోరారు.

పారిశుధ్యాన్ని మెరుగుపరచాలి..

డయాలసిస్‌ కేంద్రంలో పారిశుధ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరడంతో కలెక్టర్‌ స్పందించారు. పారిశుధ్యం అధ్వానంగా ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న బెడ్లను చూపిస్తూ కనీసం తుడవడం లేదన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను పిలిచి పారిశుధ్యం బాగా లేనప్పుడు సంతకాలు ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. ఇక నుంచి పరిశుభ్రంగా లేకపోతే రిమార్కు రాయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వెంకటేష్‌, జనసేన ఇన్‌చార్జి దాసరి రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2025 | 12:27 AM